
ఇండియా vs పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ 2025లో అసలు సిసలు పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా దాయాది జట్లు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రోహిత్ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే, ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.
మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి అంతే. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాక్.. 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. కావున భారత్ తో మ్యాచ్ వారికి చావో రేవో. అంత ఈజీగా ఓటమిని అంగీకరించకపోవచ్చు.
ఇరు జట్ల బలాబలాలు..
బంగ్లాదేశ్‌పై గెలిచి టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంటే, న్యూజిలాండ్ చేతిలో ఓడి పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అలా అని దాయాది జట్టును తీసిపారేయలేం. పాక్ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్ త్రయం అత్యంత ప్రమాదకరం. కొత్త బంతితో వీరు చెలరేగారంటే.. భారత జట్టుకు కష్టాలు తప్పవు. కాకపోతే ఈ ముగ్గురూ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్‌లో దాయాది బ్యాటర్లు దారుణం. ఏ ఒక్కరూ భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. లోయర్ ఆర్డర్‌లో సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా కొంత మేర ఇబ్బంది పెట్టొచ్చు.
భీకర ఫామ్‌లో గిల్
బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇస్తే కనుక జట్టుకు తిరుగుతుండదు. మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఎలాగూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా జట్టుకు అదనపు బలం.
Also Read :- ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డులు.. భారత్‌పై పాకిస్తాన్ ఆధిపత్యం
బ్యాటింగ్‌తో పోలిస్తే.. టీమిండియా బౌలింగ్‌పైనే ఆశలు పెట్టుకోవచ్చు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ద్వయాన్ని ఎదుర్కోవడం దాయాది జట్టుకు అంత తేలికైన పని కాదు. మూడో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి జట్టులోకి వస్తే.. ఇక తిరుగుండదు. ఇక పేస్ విషయానికొస్తే.. హర్షిత్ రాణా, మహమ్మద్ షమీలనే కొనసాగించొచ్చు.
ఇరు జట్ల బలాబలాలను బట్టి గెలిచే అవకాశాలు టీమిండియాకు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే, దాయాది జట్టుకు చావో రేవో మ్యాచ్ కనుక ఉత్కంఠ పోరు తప్పక పోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.
పాకిస్తాన్: బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), సల్మాన్ అఘా, కమ్రాన్ గులాం, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.