జార్ఖండ్..జై కొట్టేదెవరికి?

జార్ఖండ్ లోని మొత్తం 81 సీట్లకు గాను మొదటి విడతలో 13 సీట్లకు శనివారం పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ,  కాంగ్రెస్, ‘అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ’ (ఏజేఎస్ యు), ‘జార్ఖండ్ వికాస్ మోర్చా’ (జేవీఎం), ‘జార్ఖండ్ ముక్తి మోర్చా’ ( జేఎంఎం) పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వీటితో పాటు కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ‘లోక్ జనశక్తి’ ( ఎల్జేపీ), అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, ఏజేఎస్ యు బంధం ఈసారి తెగిపోయింది. సుదేశ్ మహతో నాయకత్వంలోని ఏజేఎస్ యు ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. కాగా హేమంత్ సోరెన్ నాయకత్వంలోని ‘జార్ఖండ్ ముక్తి మోర్చా’, లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ‘రాష్ట్రీయ జనతా దళ్’ ( ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి తరఫున జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ను సీఎం కేండిడేట్ గా ప్రకటించారు. మొత్తం 81 సీట్లలో కాంగ్రెస్ 31 సీట్లలో పోటీ చేస్తోంది. జేఎంఎం 43 నియోజకవర్గాల నుంచి ఆర్జేడీ ఏడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోంది.

మొదటి విడత లో ప్రముఖులు

మొదటి విడత బరిలో ఉన్న వారిలో బీజేపీ మాజీ చీఫ్ విప్ రాధాకృష్ణ కిశోర్ ఉన్నారు. ఈసారి ఏజేఎస్ యు టికెట్ పై ఛాత్రపూర్ సీటు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి భాను ప్రతాప్ సాహి, భవంత్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై బరిలో ఉన్నారు. జేఎంఎం సీనియర్ లీడర్ చమ్రా లిండా విష్ణుపూర్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

మహిళా ఓటర్లే కీలకం

ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు. మొత్తం ఓటర్లు రెండు కోట్ల 26 లక్షల మంది ఉంటే ఆడవారే కోటి ఎనిమిది లక్షల మంది  ఉన్నారు. లేటెస్ట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికల తరువాత నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో మగవాళ్ల కంటే ఆడవారే ఎక్కువ మంది పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల టైంలోనూ  20 కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో  పైగా   ఆడవారి ఓటింగ్ శాతమే  ఎక్కువగా ఉంది. అంతేకాదు ఎస్టీలకు 28 సీట్లు రిజర్వు చేస్తే వీటిలో 13 నియోజకవర్గాల్లో ఆడవారి జనాభానే ఎక్కువగా ఉంది. వీటన్నిటితో పాటు కొన్నేళ్లుగా జార్ఖండ్ మహిళలు ఎన్నికల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. స్థానిక, అసెంబ్లీ, లోక్ సభ ఇలా ఏ ఎన్నికలు జరిగినా ఆడవారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కేండిడేట్ల తలరాతను ఆడవారే రాస్తారని ఎనలిస్టులు అంటున్నారు.

టార్గెట్ 65 తో బరిలోకి బీజేపీ

ఈసారి ఎన్నికల్లో 65 సీట్లను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం పక్కా ప్లానుతో ముఖ్యమంత్రి రఘుబర్  దాస్ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై  ఫోకస్ పెట్టారు. జార్ఖండ్ సహజంగా రాజకీయ అస్థిరతకు మారుపేరు. అలాంటి రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఫుల్ టర్మ్ పూర్తి చేసింది. జార్ఖండ్ పాలిటిక్స్ లో ఇదొక రికార్డు. నిలకడగా నిలబడటం, ప్రగతి వైపు పరుగెత్తించడం ఆంశాలుగా తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో రఘుబర్ దాస్ పర్యటించారు. తాము చేసిన అభివృద్ధే తమను ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆయన అంటున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో అయోధ్య అంశాన్ని బీజేపీ  తెరపైకి తీసుకువచ్చింది. దీనికితోడు మోడీ మేజిక్ ఈసారి కూడా పనిచేస్తుందని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు.

బీజేపీలోకి  పెరిగిన వలసలు

లేటెస్ట్ గా  జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 సీట్లలో 12 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. చిన్నా చితకా లీడర్లే కాదు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా బీజేపీలోకి జంప్ చేయడం మొదలెట్టారు. కొన్ని నెలల కిందట ప్రతిపక్షాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుఖ్ దేవ్ సింగ్ భగత్, మనోజ్ యాదవ్, కునాల్ సారంగి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే భాను ప్రతాప్ సాహి బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరిలో సుఖ్ దేవ్ సింగ్ భగత్, గతంలో పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన నాయకుడు. రాజకీయ నాయకులే కాదు జార్ఖండ్ మాజీ డీజీపీ దినేష్ కుమార్ పాండే, ఐఏఎస్ మాజీ అధికారి సుచిత్రా సిన్హా కూడా కొన్ని నెలల కిందట బీజేపీలో చేరారు.

పేద కుటుంబాల నుంచి ఒకరికి ఉద్యోగం

పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. రైతులకు  మూడు లక్షల వరకు లోన్ ఇస్తామంది. ప్రతి రైతుకు మొబైల్ హ్యాండె సెట్ ఇస్తామన్నది మరొక హామీ. పేదలు అలాగే బీసీ స్టూడెంట్లకు చదువుకోవడానికి అవసరమైన డబ్బు సాయం చేస్తామని పేర్కొంది. ‘ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన’ పథకం కింద సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు పెట్టుబడి సాయం కింద ఐదు వేల వరకు సాయం చేస్తామంది. పరిశ్రమల్లో ఉద్యోగాలకు స్థానికులకు ప్రయారిటీ ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది.

జేఎంఎంపైనే కాంగ్రెస్ ఆశలు

హేమంత్ సోరెన్ నాయకత్వాన గల జేఎంఎంపైనే ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ బరిలోకి దిగింది. కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితులున్నాయి. సీనియర్ల లీడర్లకు ఒకరి పొడ మరొకరికి గిట్టదు. పీసీసీ మాజీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ సెప్టెంబరులోనే పార్టీ నుంచి బయటకు వెళ్లి ‘ఆప్’ లో చేరిపోయారు. అయితే బీజేపీ తో  తెగదెంపులు చేసుకుంటూ ఏజేఎస్ యు తీసుకున్న నిర్ణయం తమకు  మేలు చేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతాయని అది తమకు ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకుంటోంది. జాతీయ సమస్యల కంటే స్థానిక అంశాలను ప్రజలు పట్టించుకుంటారని కాంగ్రెస్ అంటోంది. దీనికి తోడు రఘువర్ దాస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ది జరగలేదని  కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే కౌలు చట్టాలను సవరించడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. దీంతో ఆదివాసీలంతా తమ వైపు వచ్చారంటున్నారు పీసీసీ ప్రెసిడెంట్ రామేశ్వర్ ఓరాన్.

ఆదివాసీల ఓట్లు చీలిపోతాయా?

జార్ఖండ్​లో ఆదివాసీల జనాభా ఎక్కువ. మొత్తం ఓటర్లలో మూడో వంతుకు పైగా ఆదివాసీ ఓటర్లే ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం 86 లక్షల మందికి పైగా ఆదివాసీలు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో 30కి పైగా ఆదివాసీ గ్రూపులున్నాయి. సంతాల్, ఓరాన్​, ముండా, హోస్ ఈ గ్రూపుల్లో ముఖ్యమైనవి.ఆదివాసీల ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీ కి పడే అవకాశాలు కనపడటం లేదు. ఆదివాసీల ఓట్లపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే బీజేపీకి పడే ట్రైబల్ ఓట్లను సంతాల్ తెగకు చెందిన హేమంత్ సోరెన్ పార్టీ చీలుస్తుందన్న వార్తలు వస్తున్నాయి.

రెండు లక్షల రుణ మాఫీకి కాంగ్రెస్ హామీ

రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న లోన్ల నుంచి కూడా రైతులకు విముక్తి కల్పిస్తామంది. బ్యాంకుల నుంచి చాలా సులభంగా రుణాలు అందచేసే పద్ధతికి శ్రీకారం చుడతామని పేర్కొంది. సమర్థవంతంగా పనిచేసే  ‘కిసాన్ ఫసల్ బీమా’ ను ప్రవేశపెడతామన్నది మరో హామీ.ప్రకృతి బీభత్సాల కారణంగా  పంట దెబ్బతింటే  అందుకు తగ్గట్టు నష్ట పరిహారం ఇప్పిస్తామంది. పంటలకు అవసరమైన ఫెర్టిలైజర్స్, ఇతర పరికరాలను చాలా చౌకగా అందచేస్తామని రైతులకు హామీ ఇచ్చింది.

ఒంటరిగా మరాండీ పార్టీ పోటీ

జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీ నాయకత్వంలోని ‘జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్)’ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. తాజా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్  ‘గ్రాండ్ అలయన్స్’ లో జేవీఎంఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో గ్యాప్ రావడంతో కూటమి నుంచి బయటకు వచ్చింది. మరాండీకి ఆదివాసీల్లో మంచి పట్టు ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరాండీ పార్టీకి ఆదరణ ఉంది.జేవీఎం ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకు లాభం జరుగుతుంద ని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు.