‘సూడు సూడు నల్లగొండ’ పాట రాసిందెవరు..?

‘సూడు సూడు న‌ల్లగొండ‌.. గుండె మీద ఫ్లోరైడ్ బండ’ అనే పాట రాష్ట్రంలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ పాటపై ఇప్పుడు మరోసారి చర్చ నడుస్తోంది. ఈ పాట రాసింది తానేనని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపైనే ఈ ముచ్చటంతా. గత నెల30వ తేదీ మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండ‌లం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ సభ పెట్టింది. ఈ సభలోనే సీఎం కేసీఆర్ ‘సూడు సూడు న‌ల్లగొండ‌.. గుండె మీద ఫ్లోరైడ్ బండ’ పాట గురించి చెప్పారు. ఆ పాట రాసింది తానేనని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితుల కష్టాలను చూసి స్వయంగా తానే రాశానని చెప్పారు. అసలు విషయం ఏంటంటే ఈ పాట రాసింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

ఈ పాట రాసింది ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన ప్రజాకవి కోదారి శ్రీను రాశారు. ఇదే పాటకు విష్ణు కిషోర్ సంగీతం అందించారు. కోదారి శ్రీను రాసిన పాట నిప్పుల వాగు (తెలంగాణ ఉద్యమ పాట) అనే పుస్తకంలో సీరియల్ నెంబర్ 32, పేజీ నెంబర్ 59లో ప్రచురితమైంది. ఈ పుస్తకం ప్రముఖ కవి అందెశ్రీ సంపాదకత్వంలో వెలువడింది. అయితే ఇంత ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ పాట రాసింది తానేనని చెప్పుకోవడం సిగ్గుచేటని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే V6 న్యూస్ చానెల్ లో ‘సూడు సూడు న‌ల్లగొండ‌.. గుండె మీద ఫ్లోరైడ్ బండ’ అనే పాటను తానే రాశానని కోదారి శ్రీను చెప్పారు. 


పాటల పూదోట
అంతేకాదు..కోదారి శ్రీను చాలా పాటలు జనాదరణ పొందాయి. వాటిలో ‘అస్సోయ్ దూలా హారతి...కాళ్ల గజ్జెల గమ్మతి’, ‘ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ’ వంటి పాటలను కూడా కోదారి  శ్రీను రాశాడు. కోదారి శ్రీను.. 1978, ఆగష్టు 30న చంద్రగిరి అంజయ్య గౌడ్ , యాదమ్మ దంపతులకు జన్మించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గంగాపురం కోదారి శ్రీను సొంతూరు.