మునుగోడు పోరులో గెలిచేదెవరో.. ఏడాది వ్యవధిలో మరోసారి ఎన్నికలు

  • రాజగోపాల్ రెడ్డి రీ ఎంట్రీతో జోష్​ మీద కాంగ్రెస్
  • కీలక సమయంలో ఖాళీ అవుతున్న కారు
  • వలసలతో డీలా పడ్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల
  • సీపీఐతో పొత్తు కాంగ్రెస్​కు కలిసొచ్చే అంశం 
  • బీజేపీ నుంచి తొలిసారి అసెంబ్లీ రేసులో చలమల

నల్గొండ, వెలుగు: ఉపఎన్నికలు జరిగి ఏడాది తిరక్కముందే అసెంబ్లీ ఎలక్షన్స్​ రావడంతో మునుగోడులో మరోసారి ఓట్ల జాతర మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి, కాంగ్రెస్​లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడి రాజకీయాలు వేగంగా మారిపోయాయి. అన్ని మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు రూలింగ్ ​పార్టీకి మూకుమ్ముడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ ​గూటికి చేరడంతో సిట్టింగ్​ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి శిబిరం డీలా పడింది.  

తన రాజీనామాతోనే నియోజకవర్గానికి వందల కోట్ల ఫండ్స్​ మంజూరయ్యాయని రాజగోపాల్ ప్రచారం చేసుకుంటుండగా, ఎమ్మెల్యేగా గెలిచాక అతి తక్కువ కాలంలో రూ.557కోట్ల పనులు చేయించానని, అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ ఓటర్లను కోరుతున్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చలమల కృష్ణారెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

రాజీనామాతో దిగొచ్చిన సర్కార్​

ఉప ఎన్నికలు వస్తే తప్ప సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడం లేదని చెబుతూ రాజగోపాల్​రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఏకంగా రూ.557 కోట్లు మంజూరు చేసింది. ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇచ్చింది. నాలుగేళ్లుగా పెండింగ్​పెట్టిన స్పెషల్ డెవలప్​మెంట్​ ఫండ్స్​కు ఒక్క రాజీనామాతో మోక్షం లభించింది.

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పైసలు అకౌంట్లలో పడ్డాయి. నిధులు లేవనే సాకుతో ఆగిన గొర్రెల పంపిణీ పూర్తయింది. శివన్నగూడెం, కిష్టరాయినిపల్లి భూనిర్వాసితుల కష్టాలు తీరాయి. నష్టపరిహారం కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న బాధితులకు చెక్కులు అందజేయడమేగాక, పునరావాస పనుల్లో వేగం పెంచారు.

నియోజకవర్గ ప్రజలు అడిగిందే తడువుగా చండూరు రెవిన్యూ డివిజన్, గట్టుప్పుల్ మండల కేంద్రాన్ని ప్రకటించడంతోపాటు, వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేశారు. కనీస రిపేర్లకు నోచుకోని రోడ్లను బాగుచేశారు. ఇవన్నీ తన రాజీనామాతోనే సాధ్యమయ్యాయని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు మళ్లీ కాంగ్రెస్​లో చేరారని, ప్రజలు ఆదరిస్తే మునుగోడు రూపురేఖలు మార్చిచూపిస్తానని రాజగోపాల్​రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాగా, మునుగోడు డెవలప్​మెంట్​ క్రెడిట్​ అంతా కేసీఆర్, బీఆర్ఎస్ దే అని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి చెప్పుకుంటున్నారు. 

బీఆర్​ఎస్​కు దూరమైన కమ్యూనిస్టులు..

కమ్యూనిస్టుల పొత్తుతో ఉపఎన్నికల్లో గట్టెక్కిన కూసుకుంట్లకు ఈసారి ఆ పార్టీల సపోర్టు లేదు. సీపీఐ, సీపీఎం తలోదారి చూసుకున్నాయి. పైగా సీపీఐ.. కాంగ్రెస్​తో  పొత్తు పెట్టుకుంది. సీపీఎం ఒంటరిగా బరిలో దిగుతోంది. కమ్యూనిస్టుల మద్దతుతోనే 2018లో రాజగోపాల్​రెడ్డి సునాయాసంగా గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ జతకట్టడంతో బీఆర్ఎస్​ చిక్కుల్లో పడినట్లు అయింది. మాజీ కాంగ్రెస్ ​ఎంపీ పాల్వాయి గోవర్ధన్​రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్​లో చేరడం కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డికి కొంత ఊరట కలిగించే అంశం. 

మొన్నటిదాకా కాంగ్రెస్​లో పనిచేసిన చలమల

కృష్ణారెడ్డి బీజేపీలోకి మారడం తనకు కలిసొస్తుందని కూసుకుంట్ల భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక ఆరు నెలల్లోనే రూ.557కోట్లతో మునుగోడును అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఐదేండ్లు పనిచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మొదటిసారి అసెంబ్లీలో బరిలో చలమల

మునుగోడు కాంగ్రెస్​ టికెట్​ తనకే వస్తుందని ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి చివరికి బీజేపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి 83వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. కానీ, ఇదంతా రాజగోపాల్ ​వ్యక్తిగత ఇమేజ్ తోనే సాధ్యమైంది.  రాజగోపాల్ బీజేపీని వీడడంతో పాలిటిక్స్​ పూర్తిగా మారిపోయాయి. టికెట్ దక్కలేదనే బాధతో బీజేపీలోకి వచ్చిన చలమల కాంగ్రెస్​ క్యాడర్ ​తనతోనే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.

లబ్ధి కోసమే రాజగోపాల్​రెడ్డి పార్టీలు మారాడని పదేపదే చెబుతున్నారు. రాజగోపాల్ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఏనాడూ మునుగోడును పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చలమల ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. అయితే బీజేపీ.. బీఆర్ఎస్ బీ టీమ్​గా మారిందని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కృష్ణారెడ్డి ఎంత మేరకు సక్సెస్​ అవుతారనే దానిపై, ఆయన గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయని పొలిటికల్​ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

కారు దిగుతున్న బీఆర్ఎస్​ క్యాడర్​

రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​లోకి వచ్చాక మునుగోడులో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. కిందిస్థాయి నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. నాంపల్లి, మనుగోడు, చండూరు, మర్రిగూడ, చౌటుప్పల్, నారాయాణ్​పూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు మూకుమ్ముడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్​ గూటికి చేరారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల వ్యతిరేకవర్గం మొత్తం కాంగ్రెస్​లోకి వెళ్లింది.

దీంతో ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారు. ఉప ఎన్నికల్లో ప్రభాకర్​రెడ్డికి టికెట్ ఇస్తే ఒప్పుకోబోమని చెప్పిన నేతలను పార్టీ హైకమాండ్ ​బుజ్జగించడంతో సైలెంట్​ అయ్యారు. ఎన్నికల్లో గెలిచాక ప్రభాకర్​రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని, రాజకీయ కక్షసాధింపులు మితిమీరాయని ఆరోపిస్తూ అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోయారు.