
- 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు
- ఇంత గొప్ప కార్యక్రమంఈజీ కాదు.. అసౌకర్యానికిగురై ఉంటే క్షమించండి
- భక్తుల ముఖాల్లో సంతోషం మరిచిపోలేనన్న ప్రధాని
న్యూఢిల్లీ: మహాకుంభ మేళా సక్సెస్ అయ్యిందని, 45 రోజుల పాటు సాగిన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏర్పాట్లపరంగా భక్తులు ఇబ్బందులకు గురై ఉంటే క్షమించాల్సిందిగా కోరారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. 66 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని తెలిపారు.
ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేమన్నారు. త్రివేణి సంగమం నదీ తీరానికి 66 కోట్ల మంది ఎలా వచ్చారా? అని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని తెలిపారు. మహాకుంభ మేళా విశేషాలను నరేంద్రమోదీ తన బ్లాగ్‌లో రాశారు. మేళాను పరిపూర్ణం చేయడంలో యూపీ ప్రభుత్వంతో పాటు ప్రయాగ్‌రాజ్ వాసులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ‘‘ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. దేశ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచింది.
అంచనాలను మించి ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. 66 కోట్ల మంది భక్తులెవరికీ అధికారిక ఆహ్వానాలు పంపలేదు. అయినప్పటికీ గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల కోసం వారంతా తరలివచ్చారు. నదిలో స్నానమాచరించిన తర్వాత వారి ముఖాల్లో కనిపించిన సంతోషం, సంతృప్తి నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని మోదీ అన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యానికి నాంది
మహాకుంభ మేళా సక్సెస్ స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యం దిశగా అడుగులు వేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా కొత్త శక్తితో ముందుకు వెళ్తున్నదని తెలిపారు. ‘‘నేను గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థించాను. పూజల్లో ఏదైనా లోపం జరిగితే క్షమించమని కోరాను. భక్తులకు సేవ చేయడంలో మేము విఫలమై ఉంటే క్షమించాలని కోరుతున్నాను. మహా కుంభమేళాలో కోట్లాది మందికి సేవ చేసే భాగ్యం భక్తి ద్వారానే సమకూరింది. అమెరికా జనాభా కంటే రెట్టింపు భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. ఈ మహాకుంభ మేళా నిర్వహణతో అటు ప్రభుత్వం.. ఇటు అధికారులకు ఎంతో అనుభవం వచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మేళా పరిపూర్ణమైంది. ఇండియా.. తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూసి గర్వపడుతున్నది. ఇది కొత్త శకానికి నాంది అని నేను నమ్ముతున్నాను. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, బోటు డ్రైవర్లు, వంట మనుషులంతా కలిసి మహాకుంభ మేళాను సక్సెస్ చేశారు’’అని మోదీ కొనియాడారు.
మేళా నిర్వహణ.. స్టడీ సబ్జెక్ట్‌గా నిలిచింది
గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరగని అద్భుతం.. ఈ మహాకుంభ మేళాతో జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే ఎన్నో శతాబ్దాలకు నాంది వేసిందని తెలిపారు. ‘‘మహాకుంభ మేళా నిర్వహణ అంశమనేది.. మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ప్లానింగ్, పాలసీ ఎక్స్‌పర్ట్స్‌కు ఒక స్టడీ సబ్జెక్ట్‌గా నిలిచింది. దేశం, సమాజానికి ఓ సరికొత్త మార్గాన్ని చూపించింది. కుల, మత, వర్గ విభేదాల్లేకుండా అందరూ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇదే స్ఫూర్తిని వికసిత్ భారత్ లక్ష్య సాధనలోనూ చూపించాలి. నాడు బాలుడి రూపంలో శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు నోట్లో విశ్వాన్ని చూపించాడు. అలాగే ఈ కుంభమేళా ప్రపంచానికి భారతీయులు అపార శక్తి రూపాన్ని చూపించింది. పెద్దఎత్తున యువకులు తరలిరావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు కూడా మహాకుంభ మేళాలో భాగస్వాములయ్యారు’’అని మోదీ అన్నారు.