ఫార్మాసిటీ ఎవరి కోసం?

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు కాలుష్యం పెంచే పరిశ్రమలను తెలంగాణలోనే ఏర్పాటు చేసి ఇక్కడి సహజ వనరులను నాశనం చేస్తున్నారని, ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రజలు అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసేవారు. స్వరాష్ట్రం ఏర్పాటైతే ఈ జాడ్యం పోతుందని భావించారు. కానీ అలా జరగకపోగా కాలుష్య పరిశ్రమలు ఇంకా పెరుగుతున్నాయి. 2017 నాటికే అదనంగా169 ఫార్మా కంపెనీలకు అనుమతి లభించింది. ఫార్మా కంపెనీలతో ఇప్పటికే భయంకరమైన కాలుష్యం ఎదుర్కొంటున్న అనుభవాలు ఉండగా, కొత్తగా హైదరాబాద్​ఫార్మాసిటీ పేరుతో మరో కాలుష్య భూతాన్ని తెస్తామంటే ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఫార్మా ఎగుమతుల వల్ల ఎవరు బాగుపడ్డారు? తెలంగాణ గ్రామాలకు సుస్తి చేస్తే.. ఇక్కడి ఫార్మా ఉత్పత్తులు ఏ మాత్రం ఉపయోగపడ్డాయి? ఇతర ప్రాంతాలతో పోలిస్తే మందుల ఖరీదు తగ్గిందా? తెలంగాణలో ఫార్మా పరిశ్రమను కేంద్రీకృతం చేయడం వల్ల ఇక్కడి ప్రజల జీవితాలను మార్చే ప్రయోజనం ఏమీ లేదని చరిత్ర చెబుతున్నది. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు సహజ వనరుల దోపిడీకి అవకాశం ఇచ్చేలా, కాలుష్యాన్ని పెంచి గ్రామీణ జీవనాన్ని నాశనం చేసేలా ఉంటున్నాయి. నూతన పారిశ్రామిక విధానం మూస ధోరణిలో, విస్తృత సంప్రదింపులు, వనరుల మదింపు లేకుండా, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా పెట్టుబడిదారులకు అనుగుణంగా ఉంది. ప్రోత్సాహకాలు, రాయితీలు, ఇతర ‘బుజ్జగింపు’లతో కూడిన ప్రస్తుత తెలంగాణ పారిశ్రామిక విధానం ‘రెడ్’ కేటగిరి పరిశ్రమల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. ఈజ్​ఆఫ్​డూయింగ్​బిజినెస్, సింగిల్​విండో క్లియరెన్స్, టీఎస్​ఐపాస్ తదితర సంస్కరణలు.. పాలనా నియంత్రణను గాలికొదిలేసి, పారిశ్రామిక కాలుష్యం నిర్లక్ష్యం చేస్తూ, ప్రజలకు పర్యావరణానికి కీడు చేస్తున్నవి.  సెప్టెంబర్ 2007 నాటికి హైదరాబాద్,- రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 1,177 కాలుష్యకారక పరిశ్రమల్లో దాదాపు 50 శాతం రెడ్ కేటగిరి ఇండస్ట్రీలే. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా లేకపోగా మరింత అధ్వానంగా మారింది.  కరోనా మహమ్మారి దృష్ట్యా.. హైదరాబాద్​లో ఫార్మాసిటీ ఏర్పాటు అత్యంత అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కరోనాకు సమాధానంగా ఫార్మాసిటీని చూపెట్టేకంటే ముందు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పరిశ్రమ హైదరాబాద్, తెలంగాణ వాసుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందని పరిశ్రమల శాఖ మంత్రి నిరూపించాల్సిన అవసరం ఉంది. ఫార్మా సిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ ను అంతర్జాతీయ పటంలో పెడతామనే సొంత ‘కలను’ ప్రజల ఆకాంక్షగా మలిచే ప్రయత్నం జరుగుతోంది. పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యంతో హైదరాబాద్​ఎప్పుడో ప్రపంచ పటానికి ఎక్కింది. ఇక్కడి ఫార్మా వ్యర్థ జలాల వల్ల సూక్ష్మ జీవులు మందులకు లొంగని విధంగా పరివర్తనం చెందాయని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. 

లాభాలు కంపెనీలకు.. బలయ్యేది ప్రజలు

ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు పొందుతూ.. లాభాలు వెనకేసుకుంటున్న ఫార్మా పరిశ్రమలు ప్రజల మీద పడుతున్న దుష్ప్రభావం పట్టించుకోవడం లేదు. అధికారులు, ఎన్నికైన ప్రతినిధులు ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించాల్సింది పోయి.. కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పరిశ్రమలు ఉన్నప్పుడే ఇంత దారుణ పరిస్థితి ఉంటే.. హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఒకే చోట15 వందల ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. ఇది పూర్తి స్థాయి విషనగరిగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రజలు.. దాన్ని వ్యతిరేకిస్తున్నారు.  దాదాపు 20 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో పర్యావరణం, చెట్లు, చేమ, చెరువులు, కుంటలు, చెలమలు, భూమి, మట్టి, నేల, పీల్చే గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితమై, భవిష్యత్​తరాల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. 

ప్రజలకు మూడింతల నష్టం

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన ఫార్మా పరిశ్రమల నుంచి నష్ట పరిహారం ఇప్పించకుండా, వాటిని నియంత్రించకుండా, ఇంకా కొత్తగా పరిశ్రమలను పెట్టమని ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి. ప్రజాస్వామిక పాలన మీద చిత్తశుద్ధి లోపించిన ఈ మంత్రి తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా తన మాటే నెగ్గాలని మొండిపట్టు పడుతున్నారు. ఫార్మా పరిశ్రమలను తరలించి కొత్త ప్రాంతంలో కాలుష్యం చేస్తూ, ఉత్పత్తి చేసుకోవచ్చు అనే సందేశం యాజమాన్యాలకిస్తూ.., హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం  విలువైన ప్రజా ధనాన్ని, ప్రకృతి వనరులను పణంగా పెడుతున్నారు. స్థానిక ఫార్మా పరిశ్రమ కారణంగా హైదరాబాద్, తెలంగాణ ఆరోగ్య సూచీలో ఎలాంటి మెరుగుదల లేని పరిస్థితుల్లో ప్రతిపాదిత హైదరాబాద్ ఫార్మా సిటీ మీద కూడా ఎలాంటి ఆశలు లేవు. ప్రస్తుతం ఉన్న ఫార్మా పరిశ్రమల వల్ల పర్యావరణానికి, సహజ వనరులకు, ప్రజలకు భారీగా నష్టం జరుగుతుండగా, హైదరాబాద్ ఫార్మా సిటీ వల్ల ఆ నష్టం రెండు లేదా మూడింతలు పెరుగుతుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. సహజ వనరులను కలుషితం చేసి, గ్రామీణులను పేదరికంలోకి నెట్టి, ఫార్మా ఎగుమతుల ద్వారా రాసుల కొద్దీ కాసులు సంపాదించడమే అభివృద్ధి అని తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న నిర్వచనాన్ని రాజకీయ పార్టీలన్నీ ప్రశ్నించాల్సిన అవసరంఉంది.

ఫార్మా కంపెనీలతో అవస్థలు ఇలా..

రాష్ట్రంలో పటాన్ చెరు, పోలేపల్లి, దోతిగుడెం, జిన్నారం, జీడిమెట్ల, చౌటుప్పల్, కొత్తూర్ వంటి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు తమ ఫాక్టరీల ద్వారా అత్యంత విషపూరిత వ్యర్థాలను భూమిలోకి, నీటి వనరుల్లోకి వదులుతున్నాయి. వాటి తాలూకు దుష్ప్రభావాలు ఇప్పటికే అక్కడి ప్రజలపై కనిపిస్తున్నాయి. దాదాపు 30 ఏండ్ల నుంచి పటాన్ చెరు ప్రాంత ప్రజలు ఎన్ని పోరాటాలు చేస్తున్నా.. అక్కడ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు తీసుకున్న చర్యలు, వాటి ఫలితం శూన్యమనే చెప్పాలి. కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు కూడా వనరులను విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అనారోగ్యంపాలై, వైద్య ఖర్చుల కోసం ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. పరిశ్రమలు వేసే పవర్ బోర్లతో స్థానిక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఆయా ఫార్మా కంపెనీలు ఇంజక్షన్ బోర్లు వేసి ప్రమాదకర వ్యర్థ జలాలను భూగర్భంలోకి వదులుతున్నాయి. హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలో దాదాపు 40 ఏండ్ల కిందట ఓ కంపెనీ చేసిన కాలుష్యం వల్ల, ఇప్పటికీ ఆ ప్రాంతంలోని బోర్లలో విష సమానమైన నీళ్లు వస్తున్నాయి. జీరో డిశ్చార్జి అంటూ స్థానిక భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా, వాటిని మూసివేయకుండా, ప్రజలు నిరసనలు తెలియజేస్తే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మీద దృష్టి పెట్టకపోగా, ఫార్మా పరిశ్రమలు పెట్టండి, అనుమతులు సులభతరం చేశామనడం బాధాకరం. 

- దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్