తమిళ రాజకీయంలో ఎవరి స్టార్ తిరుగుతుందో?

తమిళనాడు రాజకీయాలతో హైదరాబాద్ కు, తెలుగు రాష్ట్రాలకు కనెక్షన్​ ఎప్పుటి నుంచో ఉంది. టాలీవుడ్​ ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకు రజనీకాంత్, కమల్​హాసన్​ అంటే ఎంతో అభిమానం. అసదుద్దీన్​ ఒవైసీది హైదరాబాద్​ బేస్. వీళ్ల ఎంట్రీతో 2021 మేలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1967 నుంచి తమిళ రాజకీయాలను డీఎంకే, అన్నాడీఎంకే డామినేట్​ చేస్తున్నాయి. ఇప్పుడు రజనీకాంత్​ పొలిటికల్​గా ఎక్కువ ఇంపాక్ట్​ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత 20 ఏండ్లుగా చూస్తే, సూపర్​ స్టార్​ రజనీకాంత్​ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. కానీ, తన పొలిటికల్​ ఎంట్రీపై రజనీ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు సడెన్​గా ఈ నెల 31న పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్​ ఇచ్చారు. మరోవైపు కమల్​హాసన్​ మక్కల్​ నీది మయ్యం అనే తన సొంత పొలిటికల్​ పార్టీ పెట్టారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి.. 4% వరకూ ఓట్లను సాధించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్​ ఇప్పటి నుంచే ప్రచారం కూడా మొదలుపెట్టారు.

కమల్+అసద్

మొదట కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు కోసం కమల్ ​ఆసక్తి చూపించారు. కానీ, డీఎంకే అందుకు సిద్ధంగా లేదు. పైగా డీఎంకే చీఫ్​ స్టాలిన్​ కమల్​ను ఉద్దేశించి కాస్త ఘాటుగానే కామెంట్లు చేశారు. ‘‘సినిమా యాక్టర్లు కాగితం పూల లాంటి వారు. వారికి ఎలాంటి వాసనా ఉండదు”అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రజనీ ఎంట్రీతో కమల్​ ఇప్పుడు పేపర్​ ఫ్లవర్​గా మారిపోయినట్టు డీఎంకే భావిస్తోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కమల్​ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీతో పొత్తును తెరపైకి తెచ్చారు. ఇది అటు కమల్​కు, ఇటు ఒవైసీకి పాజిటివ్​ డెవలప్​మెంటే. వీరి పొత్తుతో ఒవైసీ ఈజీగా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంటర్​ కాగలరు. అలాగే కొన్ని ముస్లిం ఓట్లను ఆయన సాధించగలరు. మరోవైపు ఒవైసీ ఎంట్రీతో అన్నాడీఎంకే కూటమికి లాభం కలగనుంది. ఈ కూటమిలో బీజేపీ ఉండటంతో ముస్లింలు దానికి దూరంగా ఉంటారు. ఈ ఓట్లు డీఎంకే, కాంగ్రెస్​ కూటమికి వెళ్లేవి. ఒవైసీ ఎంట్రీతో అవి చీలిపోయి అన్నాడీఎంకే కూటమికి మేలు జరిగే చాన్స్​ ఉంది.

ఆ ఐడియా చాలా ప్రమాదకరం

‘‘సెపరేట్​ కమ్యూనిటీ” ఐడియాకు అసదుద్దీన్​ ఒవైసీ మద్దతునిస్తున్నారు. ఇలాంటిది దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఉండేది. బ్రిటిష్​ వాళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా ఓటింగ్​ నిర్వహించేవారు. అంటే ముస్లిం ఓట్లు మాత్రమే ఉన్న చోట వారికి నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ ఐడియా అత్యంత ప్రమాదకరమైనది. బ్రిటిష్​ వాళ్ల నుంచి జిన్నా సాధించింది ఇదే. బ్రిటిష్​ వాళ్లు భారతీయులను రెండుగా చీల్చడంలో సక్సెస్​ అయ్యారు. ఇప్పుడు ఒవైసీ కూడా హైదరాబాద్​ మోడల్​పాలిటిక్స్​ను దేశమంతటా విస్తరించాలని భావిస్తున్నారు. అందువల్ల తమిళనాడులో ముస్లిం ఓట్లను ఒవైసీ కచ్చితంగా పోలరైజ్​ చేయగలరు. ఒవైసీని కౌంటర్​ చేయాలంటే అన్ని పొలిటికల్​ పార్టీలు ముస్లింలు, మైనార్టీలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. వారికి గెలిచే అవకాశం ఉన్న సీట్లను కేటాయించాలి. ఇలా చేస్తే ఒవైసీని విజయవంతంగా అడ్డుకోవచ్చు.

రజనీ ఎంట్రీతో రాజకీయ అనిశ్చితి

కమల్​కంటే రజనీకాంత్​ పెద్ద స్టార్. వీరి మధ్య ఎలాంటి కంపారిజన్​ లేదు. రజనీకాంత్​ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో గొప్ప అనిశ్చితి ఏర్పడింది. కెప్టెన్​ విజయ్​కాంత్, కమల్​హాసన్​ లాంటి నటులు డీఎంకే, అన్నాడీఎంకేలను ఏ మాత్రం కదిలించలేకపోయారు. కానీ, రజనీకాంత్.. కమల్​హాసన్, విజయ్​కాంత్​ కంటే కచ్చితంగా ఎక్కువ ఇంపాక్ట్​ చూపిస్తారు. దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే కూటములు ఏర్పాటు చేసో లేదా ప్రతిపక్షాలను విడదీసో అధికారం చేపడుతున్నాయి. కానీ చాలా కొద్ది మంది జనం మాత్రమే ద్రవిడియన్​ పార్టీలను కోరుకుంటున్నారు. అదే తమిళనాడు ఓటర్లు మార్పు కోరుకున్నట్లయితే, రజనీకాంత్​ వారికి ఒక మంచి ఆప్షన్​గా నిలుస్తారు. అన్నాడీఎంకే, డీఎంకే నుంచి మార్పు కోరుకునే ఓటర్లను ఎంత మందిని ఆకర్షిస్తారనే దానిపైనే రజనీకాంత్, కమల్​హాసన్ల విజయ రహస్యం ఆధారపడి ఉంటుంది. 1967 నుంచి ద్రవిడియన్​ పార్టీల రాజ్యమే నడుస్తోందని జనం గుర్తించారు. ఆ రెండు పార్టీలు పాలనకు అంత ఇంపార్టెన్స్​ ఇవ్వడం లేదనేది కూడా వారి దృష్టిలో ఉంది.

ఒవైసీకే ఎక్కువ లాభం

వచ్చే ఎన్నికల్లో కమల్​కూడా ఒవైసీకి ఓటు వేయమని తమిళనాడులోని ముస్లింలకు చెబుతారు. ఈ పరిణామాలతో ఆయన ఆలిండియా ముస్లిం లీడర్​గా మారతారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కువ లాభపడేది అసదుద్దీన్​ ఒవైసీనే. అసదుద్దీన్​ అనుభవం కలిగిన పొలిటీషియన్. ఆయనకు మద్దతుగా నిలవడానికి కావాల్సిన పొలిటికల్​ బేస్​ ఉంది. చట్టసభల్లో ముస్లిం సంఖ్య తగ్గిపోతోందని ఒవైసీ ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. అలాగే హిందువులు, ఇతర వర్గాలు ముస్లింలకు ఓట్లు వేయడం లేదని, అందువల్ల ముస్లింలు ముస్లిం పార్టీకే ఓటు వేయాలని, సెక్యులర్​ పార్టీలకు ఓట్లు వేయవద్దనేది ఒవైసీ వాదన. సెక్యులర్​ పార్టీలు ముస్లింలకు ఏమీ చేయకుండా వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

వచ్చే ఎన్నికలు అందరికీ కీలకమే..

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రజనీకాంత్, అన్నాడీఎంకే, డీఎంకేలకు ఎంతో కీలకం. ఒకవేళ రజనీకాంత్​ ఎక్కువ ప్రభావం చూపించలేకపోతే.. ఆయన తన ప్రతిష్టను కోల్పోతారు. ఒక పేపర్​ టైగర్​గా మిగిలిపోతారు. అదే స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే ఓటమిపాలైతే, 2011 నుంచి ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో అది బలహీనపడుతుంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ఇంత కాలం సర్వైవ్​ కాగలిగిందంటే దానికి ప్రధాన కారణం అధికారంలో ఉండటమే. అన్నాడీఎంకే ఓటమి పాలైతే అది కూడా బలహీనపడుతుంది. కమల్​కోల్పోవడానికి ఏమీ లేదు. అసదుద్దీన్​ ఒవైసీకి మంచి పబ్లిసిటీ రావడంతో ఇప్పటికే ఆయన పాపులారిటీ పెరిగింది. ఒవైసీ ముస్లింల కోసం కొత్త పొలిటికల్​ జర్నీని మొదలుపెట్టారు. అయితే తన జర్నీ ఎక్కడ ముగుస్తుందనే విషయాన్ని ఆయన హైదరాబాద్​లోని ముస్లింలకు చెప్పడం లేదు. ఇది గుర్తు తెలియని రైల్వే స్టేషన్ నుంచి రిటర్న్ -టికెట్ లేని ప్రయాణం కావచ్చు. ఒకవేళ రజనీకాంత్​ సక్సెస్​ అయితే మాత్రం తెలుగు సినిమా స్టార్లు ఆయన నుంచి ఇన్​స్పిరేషన్​ పొందుతారు. అందువల్ల హైదరాబాద్​ తమిళ రాజకీయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.-పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్.