అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహంత్ గిరిది సూసైడ్ అని మొదట్లో కథనాలు వచ్చాయి. అయితే నరేంద్ర గిరి మృతిపై అనుమానాలు రావడంతో పోలీసులు ఆయన శిష్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. నరేంద్ర గిరి స్వామీజీ పార్థివ దేహాన్ని భూసమాధి చేశారు. మామూలుగా హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని దహనం చేస్తారు. కానీ స్వామీజీలు, సాధువులు, సన్యాసులు, కొందరు పూజారులు చనిపోయినప్పుడు వారి పార్థివ దేహాలను సమాధి చేస్తారు.
కపాల మోక్షం గురించి విన్నారా?
మరణం తర్వాత ఆత్మ శరీరం నుంచి వెళ్లిపోతుందని హిందూ ధర్మంలో బలంగా నమ్ముతారు. అయితే సామాన్య హిందువుల విషయంలో మృతదేహాన్ని దహనం చేస్తేనే భౌతిక బంధాలు, అవసరాల నుంచి ఆత్మకు విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక సాధు, సన్యాసుల విషయంలో ఈ నమ్మకాలు మరో విధంగా ఉన్నాయి. సన్యానం స్వీకరించడంతోనే వాళ్లకు అన్ని భవబంధాలు, భౌతిక అవసరాల నుంచి విముక్తి లభిస్తుందని హిందూ ధర్మంలో నమ్ముతారు. మరణ సమయంలో సాధు, సన్యాసుల ప్రాణం బ్రహ్మ రంధ్రం ద్వారా శరీరాన్ని వీడుతుందని విశ్వసిస్తారు. ఆ సమయంలో ఆత్మ శరీరం నుంచి వేరుపడి పవిత్రమైన అమరత్వాన్ని పొందుతుంది. అందుకే చనిపోయినప్పుడు సన్యాసుల దేహాలను దహనం చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో వారికి కపాల మోక్ష అనే పద్ధతి ద్వారా అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేస్తారు. మామూలు హిందువులకు.. ఆ మతంలో పవిత్రంగా భావించే సాధువులు, స్వామీజీలు, సన్యాసులకు నిర్వహించే అంత్యక్రియల్లో కీలకమైన తేడా ఇదేనని గుర్తుంచుకోవాలి.
For More News: