ఖాసిం సులేమానీని ఎందుకు చంపినట్టు?
ఖాసిం సులేమానీ టెర్రరిస్టా? మిలటరీ కమాండరా ? ఇరాన్ దృష్టిలో మిలటరీ కమాండర్. అమెరికా దృష్టిలో టెర్రరిస్టు. అందుకే ఒకప్పుడు టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్‌ను వెంటాడి, వేటాడి హతమార్చినట్టే సులేమానీని కూడా చంపేసింది అమెరికా.
నిజంగానే సులేమానీ ఎవరు అంటే ఇరాన్ కూడా కచ్చితంగా జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సులేమానీ సైనిక కమాండర్ అయినా అతడి ఆపరేషన్స్ అన్నీ వేరే దేశాల్లోనే ఉంటాయి. ఒక రకంగా అమెరికా గూఢచారి సంస్థ ‘ సీఐఏ’ను, స్పెషల్ ఆర్డ్మ్ ఫోర్సెస్ ను కలిపితే ఎలా ఉంటుందో అలాంటి ‘కుద్స్ ఫోర్స్ ’ కు చీఫ్ గా పని చేశారు సులేమానీ. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో సులేమానీ ఆపరేషన్స్ లో అనేకమంది అమెరికన్లు కన్నుమూశారని అమెరికా అంటోంది. అందుకే అతడిని చంపేశామని అమెరికా వివరణ ఇస్తోంది.
ఇరాన్లో నెంబర్ టూ ..
ఎవరేమన్నా సులేమానీ, సామాన్యుడు కాదు. ఇరాన్లో నెంబర్ టూ లీడర్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తరువాత మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు. జనంలో బాగా పాపులారిటీ ఉన్న నేత. ఇరాన్ కు అనధికారికంగా విదేశాంగ మంత్రి. సులేమానీ పవర్ కేవలం ఇరాన్ కే పరిమితం కాదు. సిరియా, యెమెన్, లెబనాన్ , ఈజిప్ట్ లో కూడా ఆయన హవా నడిచేది. ఈ దేశాల్లో ఇరాన్ తరఫున అన్ని మిలటరీ పనులు ఈయనే చక్కబెట్టేవాడు.
‘ఖుద్స్ ఫోర్స్ ’ చీఫ్‌గా….
ఇరాన్‌కు చెందిన ‘ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ’ ( ఐఆర్ జీసీ) లో ‘ఖుద్స్ ఫోర్స్’ ఒక కీలకమైన విభాగం. 1998లో ‘ఖుద్స్ ఫోర్స్ ’ పగ్గాలు చేపట్టాడు సులేమానీ.ఈ సంస్థలో ఇరవై వేలమంది సిబ్బంది ఉంటారు. విదేశాల్లో ఇరాన్ మిలటరీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అన్నిటినీ ఈ ఆర్గనైజేషనే కంట్రోల్ చేస్తుంది. డ్రోన్ దాడిలో చనిపోయేంతవరకు ఈ సంస్థకు చీఫ్ గా సులేమానీ కొనసాగాడు. ఒక్క ఇరాన్ లోనే కాదు మరికొన్ని దేశాల్లో కూడా సులేమానీ అక్కడి మిలటరీ సంస్థలకు ట్రైనింగ్ ఇచ్చాడంటారు. లెబనాన్ కు చెందిన షియా పార్టీ ‘హెజ్బొల్లా’ మిలటరీ వింగ్ ను రూపొందించింది సులేమానీయే అంటారు చాలా మంది.
2011 లో మేజర్ జనరల్‌గా ప్రమోషన్
‘ఖుద్స్ ఫోర్స్ ’ చీఫ్ హోదాలో బయటి దేశాల్లో కూడా అనేక మిలటరీ యాక్టివిటీస్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు 2011లో సులేమానీకి మేజర్ జనరల్ గా ప్రమోషన్ ఇచ్చింది ఇరాన్ ప్రభుత్వం. అప్పటి నుంచి విదేశాల్లో నిర్వహించే మిలటరీ కార్యకలాపాలపై నేరుగా ఖమేనీకే రిపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఖాసిం సులేమానీని సుప్రీం లీడర్ ఖమేనీ బాగా ఇష్టపడతారు. ‘ఇస్లామిక్ రివల్యూషన్ తరువాత బతికున్న అమరుడు’ అని సులేమానీని అంటారు ఖమేనీ. 80ల్లో ఇరాక్ తో జరిగిన యుద్దంలో చూపిన ధైర్య సాహసాలకు మెచ్చి ఇరాన్ హయ్యస్ట్ మిలటరీ అవార్డు ‘ ఆర్డర్ ఆఫ్ జుల్ఫకర్ ’ ను సులేమానీకి ఇచ్చింది ఇరాన్ ప్రభుత్వం.
అసద్ సర్కార్‌కు అండగా…
సివిల్ వార్ ఫలితంగా ఇబ్బందుల్లో పడ్డప్పుడు సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి ఖాసిం సులేమానీ అండగా నిలబడ్డాడు. తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి సిరియా సైనిక బలగాలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేవాడు. సైన్యంలోని వివిధ విభాగాలను ఎలా కో ఆర్డినేట్ చేసుకోవాలో చెప్పేవాడు. సులేమానీ ఇచ్చిన ఎత్తుగడలతోనే తిరుగుబాటుదారులను అసద్ ప్రభుత్వం అణచివేయగలిగిందంటారు. అంతేకాదు తిరుగుబాటుదారులు కైవసం చేసుకున్న అనేక నగరాలు, పట్టణాలను సిరియా సైనిక బలగాలు మళ్లీ స్వాధీనపరచుకోగలిగాయి.
ఐఎస్ఐఎస్ తో యుద్ధం….
‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్’ (ఐఎస్ఐఎస్) తో ఇరాన్ తరఫున యుద్దం చేశాడు సులేమానీ. ఇరాక్, సిరియాలో ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా చేసిన అనేక మిలిటెంట్ ఆషరేషన్లన్నీ సులేమానీ కనుసన్నల్లోనే జరిగాయి. షియా దళాలకు ఆయుధాలు అందించాడు. అంతేకాదు అవసరమైనప్పుడు ఎత్తుగడలు వేశాడు…వ్యూహాలు పన్నాడు. ఇరాక్‌లోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన ‘తిక్రిత్’ సిటీని ఐఎస్ఐఎస్ దళాల నుంచి షియా బలగాలు మళ్లీ స్వాధీనపరచుకోవడంలో సులేమానీయే కీలక పాత్ర వహించాడని చెబుతారు.
అమెరికాలో రకరకాల అభిప్రాయాలు
ఖాసిం సులేమానీని హతమార్చడం పట్ల అమెరికాలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సులేమానీకి తగిన శాస్తి జరిగిందని రిపబ్లికన్లు అంటున్నారు. దీంతో వీళ్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ….ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని డెమొక్రాట్లు ఆందోళన పడుతున్నారు. సులేమానీని చంపేయడానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో టెన్షన్లు మరింత పెరిగే అవకాశముందన్నారు.
రాబోయో రోజుల్లో ఏం జరగొచ్చు?
సులేమానీని చంపడాన్ని ‘ ఇంటర్నేషనల్ టెర్రరిజం’ గా ఇరాన్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ మహమ్మద్ జావేద్ జరీఫ్ పేర్కొన్నారు. ‘ సులేమానీ హత్య పై ఎప్పుడైనా సరే అమెరికా అనుభవించక తప్పదు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇరాన్ ప్రతీకారం ఎలా ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాకపోయినా అమెరికాకు నష్టం కలిగించే ఆపరేషన్స్ కొన్నింటిని ఇరాన్ చేపట్టవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. సులేమానీ హత్య బ్యాక్‌డ్రాప్‌లో పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని ఎనలిస్టులు అంటున్నారు.
ప్రెసిడెంట్ పోస్టుకు సులేమానీ పేరు ….?
మిలటరీ యాక్టివిటీస్ ను సక్సెస్ ఫుల్ గా అమలు చేయడంతో ఇరాన్ లో ఖాసిం సులేమానీ పాపులారిటీ విపరీతంగా పెరి గింది.ముఖ్యంగా షియా ముస్లిం లకు ఆయన ఒక పెద్ద హీరో అయిపో యాడు. ఈ బ్యాక్ డ్రాప్ లో 2013 ప్రెసి డెన్షియల్ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేస్తారన్న వార్తలొచ్చాయి. అయి తే పాలి టిక్స్ పట్ల సులేమానీ ఆసక్తి చూపలేదు. ఆ తరువాత 2017 నాటి ప్రెసిడెంట్ ఎన్ని కల్లో సులేమానీని పోటీ చేయించాలని ఇరాన్ లోని ఒక వర్గం ప్రయత్నించింది. దీనికి సంబంధించి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలను సులేమానీ తోసిపుచ్చారు. బతికున్నంత కాలం ఓ మంచి సైనికుడిగా ఇరాన్ కోసం పనిచేయడమే తనకిష్టమని పేర్కొన్నాడు.
వందలాది మంది అమెరికన్ల ను హతమార్చిన చరిత్ర
సులేమానీది రక్త చరిత్ర అంటోంది అమెరికా. కొన్ని వందల మంది అమెరికన్ల ఉసురు తీశాడని రగిలిపోతోంది. 2011లో అమెరికా నేల మీద సౌదీ అరేబియా రాయబారి అదెల్ అల్ జుబేర్ ను చంపడానికి సులేమానీ కుట్ర చేశాడని ఆరోపించింది. అయితే ఈ కుట్ర సంగతి చివరిక్షణంలో తెలియడంతో అదెల్ అల్ జుబేర్ ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పింది. కొన్ని నెలలుగా ఇరాక్ లోని తమ దళాలపై సులేమానీ నాయకత్వంలోని ‘ఖుద్స్ ఫోర్స్ ’ దాడులు చేసిందన్నది అమెరికా ఆరోపణ. సులేమానీ నాయకత్వంలోని ‘ఖుద్స్ ఫోర్స్ ’ మిడిల్ ఈస్ట్ లో రక్తపుటేరులు పారిస్తోందని అమెరికా ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ మైక్ పాంపియో రెండేళ్ల కిందటే ఆరోపించారు. మిలటరీ కార్యకలాపాల పేరుతో జరిపిన ఆపరేషన్స్ లో వందలాదిమంది అమెరికన్ల ప్రాణాలు సులేమానీ తీశాడన్నారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులు దాడులు చేశాయి. అలాగే సౌదీ రిఫైనరీ మీద కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక సులేమానీయే ఉన్నాడని అమెరికా గట్టిగా నమ్మింది. కిందటేడాది డిసెంబర్ 27న జరిగిన దాడుల్లో అమెరికన్ కాంట్రాక్టర్ ఒకరు హత్యకు గురయ్యాడు.దీని వెనుక సులేమానీయే ఉన్నాడన్నది అమెరికా ఆరోపణ. ఈ సంఘటనలన్నీ అమెరికా, ఇరాన్ మధ్య వాతావరణాన్ని వేడెక్కించాయి. రెండు దేశాల మధ్య టెన్షన్లు పెంచాయి.
కాంట్రాక్టర్ దగ్గర కూలీగా …
ఇరాక్ లో అమెరికా సేనలను హడలెత్తించిన ఖాసిం సులేమానీది పేద కుటుంబం. 1957 లో కెర్మన్ రాష్ట్రంలోని ఓ పల్లెలో పుట్టాడు. తిండికి కటకటలాడే పరిస్థితి. తొమ్మిది మంది సంతానంలో సులేమానీ ఒకడు. పెద్దవాడయ్యాక పొట్టచేతపట్టుకుని కెర్మన్ సిటీ కి వెళ్లాడు. అక్కడ బిల్డింగులు కట్టే దగ్గర పనికి కుదిరాడు. తట్టలు మోశాడు. ఈ పని లేనిరోజుల్లో చిన్నా చితకా పనులు చేసుకుని బతికేవాడు. ఖాళీగా ఉన్న టైంలో జిమ్ కు వెళ్లేవాడు. బాడీ బిల్డింగ్, కరాటే ప్రాక్టీస్ చేసేవాడు. ఈ టైంలోనే కామ్యాబ్ అనే ఇస్లాం పండితుడి లెక్చర్ల వైపు ఆకర్షితుడయ్యాడు. సైన్యం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తితోనే మిలటరీలో చేరాడు. 1979లో ‘‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ ( ఐఆర్ జీసీ) లో చేరాడు. చాలా తక్కువ టైంలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. పై స్థాయికి ఎదిగాడు. 1980ల్లో ఇరాక్ –ఇరాన్ మధ్య జరిగిన యుద్దంలో పాల్గొన్నాడు. కెర్మన్ యూత్ తో ఏర్పాటు చేసిన రెజిమెంట్ కు నాయకత్వం వహించాడు. ఇరాక్ సేనలతో పోరాటం చేశాడు. ఈ టైంలోనే ఖుర్దిష్ ఇరాకీ నాయకులతో అలాగే ‘షియా బదర్ ఆర్గనైజేషన్ ’అనే మరో సంస్థ లీడర్లతో కాంటాక్ట్స్ పెరిగాయి. సైన్యంలో పాల్గొన్న దైర్య సాహసాలు చూపి ఇరాన్ పాలకుల దృష్టిని ఆకర్షించాడు.
ఇది ఇరాన్‌కు వార్నింగా?
సులేమానీని చంపడం వెనుక అమెరికా దూరాలోచనకూడా ఉంది. సులేమానీని చంపి ఇరాన్‌కి ఒక వార్నింగ్ ఇవ్వాలనేది అమెరికా ఉద్దేశం కావచ్చునని ఎనలిస్టులంటున్నారు. అయిదేళ్లుగా ఇరాన్ చేసిన కొన్ని పనులు అమెరికాకు ఏమాత్రం నచ్చడం లేదు. ‘మేము తలచుకుంటే ఏదైనా చేయగలం. ఇరాన్‌ని ధ్వంసం చేసేయగలం’ అనే మెసేజ్‌తో సులేమానీ హత్యనే ఒక హెచ్చరికగా పంపింది అమెరికా.
2015, జూలై 25 : ఇరాన్‌కి న్యూక్లియర్ వెపన్స్ దక్కకుండా అమెరికా, యూకే, ఇతర అణు దేశాలు ఇరాన్‌తోనే ఒక ఒప్పందంపై సంతకం చేయించాయి. దీనిని మొదటి అడుగుగా ఆ దేశాలు పేర్కొన్నాయి.
2016 అక్టోబర్: తాను ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాగానే ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందం నుంచి అమెరికాని విత్‌డ్రా చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేశారు.
2018 మే 28 : ఇరాన్ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీమాత్రం ఒప్పందానికి కట్టుబడి ఉంటామని తెలిపాయి.
2018 ఆగస్టు–సెప్టెంబర్ : ఇరాన్‌పై అమెరికా మళ్లీ ఆర్థిక ఆంక్షలు విధించింది. చమురు, షిప్పింగ్, బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ఈ ఆంక్షలు అమలు చేసింది.
2019 ఏప్రిల్ 8 : ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీ)పై ప్రెసిడెంట్ ట్రంప్ కత్తిగట్టారు. అమెరికా మిలిటరీ వ్యతిరేకిస్తున్నా ట్రంప్ వినలేదు. ఐఆర్జీని విదేశీ టెర్రరిస్టు సంస్థగా ప్రకటించారు.
2019 ఏప్రిల్ 22 : ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్న దేశాలకుకూడా ఆంక్షలు పొడిగిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆయా దేశాలకు ఇస్తున్న రాయితీల్ని రద్దు చేస్తామని అమెరికా ప్రకటించింది.
2019 మే 8 : అమెరికా బెదిరింపులకు ఇరాన్ లొంగకుండా యురేనియం ఉత్పత్తిని పెంచుతానని ప్రకటించింది.
2019 మే 12 : సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, నార్వేల నుంచి వస్తున్న నాలుగు ఆయిల్ ట్యాంకర్లపై పర్షియన్ గల్ఫ్‌లో దాడి జరిగింది. ఈ దాడికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించింది.
2019 జూన్ 20 : తన దేశంలోకి ప్రవేశించిందన్న కారణంగా అమెరికా డ్రోన్‌ని ఇరాన్ కూల్చేసింది. దీనికి ఆగ్రహించిన ట్రంప్ ఇరాన్‌పై దాడులకు ఆదేశాలిచ్చారు. అయితే, కొద్దిసేపటికే తన ఆర్డర్స్‌ని ట్రంప్ వెనక్కి తీసుకున్నారు.
2019 జూలై 1 : తక్కువ స్థాయి యురేనియం ఉత్పత్తిలో పరిమితిని దాటిపోయినట్లు ఇరాన్ తెలిపింది. ఇది 2015నాటి ఒప్పందం ప్రకారమే చేశామని చెప్పింది.
2019 జూలై 4 : అమెరికా కోరడంతో జిబ్రాల్టర్‌లో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ గ్రేస్–1ని బ్రిటిష్ నేవీ దళం సీజ్ చేసింది.
2019 జూలై 18 : ఆయిల్ ట్యాంకర్‌కి దగ్గరగా వస్తున్న ఇరానియన్ డ్రోన్‌ని అమెరికా నేవీ కూల్చేసింది.
2019 జూలై 20 : బ్రిటన్‌కి చెందిన ఆయిల్ ట్యాంకర్ స్టెనా ఇంపీరోని హొర్ముజ్ కాలువ దగ్గర ఇరాన్ అడ్డగించింది.
2019 జూలై 22 : అమెరికాకి గూఢచారులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై 17 మంది సొంత ప్రజలను ఇరాన్ అరెస్టు చేసింది. వాళ్లలో కొందరిని చంపేసినట్లు వార్తలు వచ్చాయి.
2019 డిసెంబర్ 27 : ఇరాక్‌లోని కిర్కుక్ సిటీలో జరిగిన రాకెట్ దాడిలో ఒక అమెరికన్ సివిల్ కాంట్రాక్టర్ చనిపోయాడు. కొంతమంది సైనికులు గాయపడ్డారు. ఈ దాడికి ఇరాన్ మద్దతున్న కతయిబ్ హెజ్బుల్లా కారణంగా చెబుతున్నారు.
2019 డిసెంబర్ 29 : ఇరాక్‌లో మూడుచోట్ల, సిరియాలో రెండు చోట్ల కతయిబ్ హెజ్బుల్లాకి చెందిన శిబిరాలపై అమెరికా బాంబులు వేసింది. ఈ దాడుల్లో 25 మంది చనిపోయారు.
2019 డిసెంబర్ 31 : బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై నిరసనకారులు దాడికి దిగారు.
పక్కా ప్లాన్
సులేమానీని అమెరికా పూర్తిగా టెక్నాలజీ సాయంతో హతమార్చింది. దీనికోసం అమెరికా రెండు ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లను ఉపయోగించింది. రెండు కార్లలో వెళ్తున్న సులేమాని కాన్వాయ్‌ని కరెక్ట్‌గా గుర్తుపెట్టి క్షిపణుల్ని ప్రయోగించాయి. ఆ డ్రోన్లు ఆపరేషన్ మొత్తం అమెరికన్ కమాండర్లు, ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో సాగింది. ఇన్ఫార్మర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిఘా విమానాలు, ఇతర గూఢచర్య వ్యవస్థలు దీనికోసం పనిచేశాయి. ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ కూడా సులేమానీ కదలికల్ని కనిపెట్టడంలో సహకరించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురించింది. ఇరాక్‌లో ఎక్కడా డ్రోన్లకోసం ప్రత్యేకమైన ఎయిర్‌బేస్ అమెరికాకి లేదు. కువాయిట్, ఖతార్, అరబ్ ఎమిరేట్స్‌లోనే ఉన్నాయి. దాడి జరిపిన ప్రాంతానికి కువాయిట్‌లోని బేస్ 570 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రీపర్ డ్రోన్లు పవర్ఫుల్
ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లను ‘ప్రిడేటర్ బి’ అనికూడా పిలుస్తారు. ఇవి మనుషులెవరూ లేకుండానే ప్రయాణిస్తాయి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ (యుఏవీ) కేటగిరీలోకి ఇవి వస్తాయి. అమెరికా ఎయిర్ ఫోర్స్కోసం జనరల్ ఆటమిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ (గాసి) దీనిని డెవలప్ చేసింది. ఈ డ్రోన్లను రిమోట్ ప్రాంతం నుంచి గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది నడిపిస్తుంటారు. ఒళ్లంతా కళ్లే అన్నట్లుగా వీటి కెమెరాలుంటాయి. సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న వెహికిల్ నెంబర్ ప్లేట్‌ని ఇది స్కాన్ చేసేసి, క్షణాల్లో గ్రౌండ్ కంట్రోల్‌కి పంపించేస్తుంది. దీనికి ఆరు స్టోరేజీ సెక్షన్లుంటాయి. వాటిలో వందలాది కేజీల బరువుండే పేలుడు సామగ్రిని, మిస్సైళ్లను మోసుకెళ్తుంది. ఒకసారి ఇంధనం నింపితే 14 గంటలపాటు ప్రయాణించగలదు.