ఫ్యాక్టరీపై క్లారిటీ లేక చెరుకు సాగుపై ఎన్కా ముందు!

ఫ్యాక్టరీపై క్లారిటీ లేక చెరుకు సాగుపై ఎన్కా ముందు!
  • నిజాం షుగర్స్​ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు
  • ఫాక్టరీ ప్రారంభంపై  రైతుల్లో బిన్నాభిప్రాయాలు
  • 4 న చెరుకు సాగు, ఫ్యాక్టరీ ప్రారంభంపై అభిప్రాయ సేకరణ

చెరుకు సాగు చేయండి ప్యాక్టరీ ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తుంటే.. ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు  చర్యలు చేపట్టండి చెరకు సాగు చేస్తామంటున్నారు. ఇలా ఎవరికి వారే  భిన్నవాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో  బోధన్​ నిజాం షుగర్​ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమవుతుందా? లేదా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి సందేహాలను నివృత్తి చేయడం కోసం బోధన్ శాసన సభ్యుడు సుదర్శన్ రెడ్డి షుగర్‌‌‌‌ కేన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌, నిజామాబాద్​ జిల్లా కలెక్టరుతో కలిసి ఈనెల 4 న ఎడపల్లి మండల కేంద్రంలో  బోధన్​ నియోజక వర్గంలోని నాలుగు మండలాల చెరకు సాగుచేస్తున్న రైతులతో  సమావేశం నిర్వహిస్తున్నారు. 

ఎడపల్లి, వెలుగు : బోధన్ నిజాంషుగర్​ఫ్యాక్టరీని సెప్టెంబర్​లో పున: ప్రారంభిస్తామంటూ సీఎం రేవంత్​ రెడ్డి  ప్రకటించారు. ఇందుకోసం ఓ సబ్​ కమిటీ ని కూడా ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా మూతపడివున్న ఈ ఫ్యాక్టరీ నడవాలంటే దీని మరమ్మతులకే కోట్లు  ఖర్చు చేయాల్సి ఉంటుంది.   మరమ్మతులకు  ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఫ్యాక్టరీని నడుపుతామంటే రైతులు నమ్మడంలేదు. నిధులు కేటాయించకుండా మరమ్మతులు ప్రారంభించకుండా రైతులను చెరుకు సాగు చేయమంటున్నారు.

చెరుకు సాగు చేస్తే ఫ్యాక్టరీ నడుపుతామని ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టం చేసింది. చెరుకు సాగు చేశాక ఫ్యాక్టరీ ప్రారంభించక పోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.  ప్యాక్టరీని నడపడానికి ముందు చెరుకు రైతులతో ఒప్పందం చేయాలని, మద్దతు ధర ముందుగానే ప్రకటించాలని, చెరుకు విత్తనం సబ్సిడీ పై అందించాలని రైతులు కోరుతున్నారు. మొదటి ఏడాది ఆశించిన మేరగాని, ఫ్యాక్టరీ నడవడానికి సరిపడ చెరుకు లేకున్నా, ఇతర ప్రాంతాల నుంచి చెరకు సేకరించి ఫ్యాక్టరీ నడిపితే  రెండో ఏడాది చెరకు రైతుల్లో నమ్మకం కలిగి చెరుకుపంట వేయడానికి ముందుకు రావచ్చు.  

ALSO READ : చైనా మాంజా అమ్మితే..ఐదేండ్లు జైలు..లక్ష జరిమానా

ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి అందుకు అనువైన వాతావరణాన్ని కల్పంచాలని రైతులు కోరుతున్నారు. చెరుకు సాగును ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో  తమ సందేహాలు నివృత్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు  అధికార పార్టీ కి చెందిన రైతుల అభిప్రాయాలు  కాకుండా, క్షేత్ర స్థాయిలో పార్టీలకతీతంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

రోజుకు 3,500 టన్నుల చెరకు అవసరం

బోధన్​లోని చక్కెర మిల్లు రోజు వారీ చెరుకు క్రషింగ్ కెపాసిటీ 3,500 టన్నులు. ఒక సీజన్ లాభదాయకంగా నడవాలంటే కనీసం 5 లక్షల టన్నులు అవసరం. కనీసం 13 వేల ఎకరాలలో  చెరకు సాగు చేస్తేనే ఫ్యాక్టరీకి ముడిసరుకు అందుతుంది. ఫ్యాక్టరీ నడిచినప్పుడే డిమాండ్ కు సరిపడా చెరకు అందక గతంలో కేవలం 60 వేల టన్నుల చెరుకును గానుగ ఆడించి సీజన్ ముగించారు. ఆ తరువాత ప్యాక్టరీ  మూతపడ్డాక చెరుకు రైతులంతా ఇతర పంటలకు వైపు మళ్లారు.

ఏడాదిలో రెండుసార్లు వరి పంట వేస్తూ లాభాలు గడిస్తున్నారు.  చెరుకు పంట కోసం కష్ట పడే బదులు తేలికగా వరి పంట సాగుచేసి దానిని చేల వద్దే అమ్ముకుంటే లాభమని పలువురు రైతులు భావిస్తున్నారు. ఇటువంటి  టైంలో రైతులను తిరిగిచెరుకు సాగువైపు మళ్లించడం సాధ్యమవుతుందా అని  పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.