Dasara Special : పండుగకు పల్లెలకు ఎందుకు వెళ్తారో తెలుసా..

Dasara Special : పండుగకు పల్లెలకు ఎందుకు వెళ్తారో తెలుసా..

హైదరాబాద్.. విశ్వనగరం.. మెట్రో సిటీ.. ఇలా ఎన్ని తీర్ల పిలిచినా... అందరూ పట్నం వైపు ఆశగా చూసేది మాత్రం ఉపాధి కోసమే. ఎంతమంది వచ్చినా చేతినిండా పని చూపించి.. కడుపు నిండా అన్నం పెడతది పట్నం. అయితే.. పట్నం అన్నం పెట్టి, ఉపాధినిచ్చినంత మాత్రాన పల్లెను మరిచిపోలేరు. అందుకే.. పండుగొచ్చినా  . ..పబ్బమొచ్చినా బస్సెక్కి ఊరెళ్లిపోతారు. పండుగకు ఊరికి పోతే.. ఇట్లా ఉంటది..

సిటీ నుంచి ఊరి బస్సెక్కగానే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామన్న ఆలోచన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తది. నిత్యం పొగ ట్రాఫిక్, కాలుష్యం, హారన్ల మోత, సిటీలైఫ్ కి దూరంగా, పచ్చటి వాతావరణంలో.. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి మనను ఉవ్విళ్లూరుతది. పట్నం నుంచి పల్లెకు పోతుంటే.. స్వార్థంలేని ప్రేమకు దగ్గరగా చేరుకుంటున్నట్లు అనిపిస్తది.

ఆత్మీయుల కౌగిలింత

ఎప్పుడొచ్చినవ్​ రా.. 'అంతా మంచిదేనా?" అనే పలకరింపుల్లోని ఆత్మీయత ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా దొరకదు.  ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇచ్చే ఆత్మీయ కౌగిలి గుండెలోని దిగులు, భారాన్ని తీసిపడేస్తది. నాకు  ఇంతమంది ఉన్నరు" అన్న భరోసా కలిగిస్తది. అందుకే అంటారు కదా. పల్లెలో ఆత్మీయత... పట్నంలో అతృత' అని. .. అంతా మనవాళ్లే.. అందరూ నా వాళ్లే అనిపించే పల్లె ఆత్మీయ  కౌగిలికోసమైనా... పండగొస్తే అందరూ పట్నం విడిచిపెట్టి పల్లెకు వెళ్లిపోతారు. దసరా నావాడు.. చేతిలో ఇంత జమ్మి పెట్టి ఇచ్చే ఆత్మీయ కౌగిలింత కోసం ఎంతదూరమైనా లెక్క చేయకుండా పల్లెను దేవులాడుకుంట పోతరు.

కమ్మటి భోజనాలు

లంచ్ కోసం స్విగ్గీలో ...డిన్నర్ కోసం జొమాటోలో.. ఆర్డరిచ్చి కడుపు నింపుకునే సిటీలైఫ్ కి అలవాటు పడిపోయినయ్ జీవితాలు. కానీ ఊరికిపోతే.. కట్టెల పొయ్యి మీద పండిన కమ్మటి భోజనాలు కడుపారా తినోచ్చు.  ప్రేమ   కలిపి వండిన అమ్మ చేతి వంట ఆస్వాదిస్తూ.. ఆ రుచిలో ఈ లోకాన్నే మరిచిపోవచ్చు. పండుగనాడు మాంసం కూరలో అమ్మ ఇంత మసాలా కొత్తిమీర దట్టించి వండితే. కూర పొయ్యి మీద ఉండంగనే.. అవాసనకు కడుపులో ఎలుకలు పరుగులు పెడుతయ్. ముక్కు పుటలదిరే ఘాటుతో.. నాలుకకు పట్టిన తుప్పు వదిలిపోతది.

చిన్ననాటి జ్ఞాపకాలు

పెరిగిన ఊరు. తిరిగిన వాడలు. దోస్తుగాళ్లు. ఆడుకున్న ఆటలు, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ పల్లెఒడిలోనే భద్రంగా దాచిపెట్టి పొట్టకూటికి పట్నమొచ్చిన వాళ్లు ఎంతోమంది తిరిగి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి పండుగలు, పబ్బాలు ఓ సందర్భం. చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ ఇంకోసారి యాదిచేసుకుంటూ ఊరంతా తిరుగుతుంటే.. ఆ రోజులు కళ్ళముందు కదులుతున్నట్లే అనిపిస్తది.

టైమే తెలియదు

అందరినీ వరుసలు పెట్టి పలకరించుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే అస్సలు టైమ్ గడిచినట్టే అనిపించదు. మంచి, చెడు మాట్లాడుకుంటుంటే.. ఫేస్​ బుక్, వాట్సప్ యూట్యూబ్ అస్సలు గుర్తుకు రావు. ఊరు మనిషినెప్పుడూ ఒంటరిని చేయదు. అదే పట్నంలో అయితే ఎవరి జీవితం వారిదే... పక్కవాడితోనే పోటీ పడాలి. పదిమందిలో ఉన్నప్పటికీ 'సామూహిక ఏకాంతం" అనుభవించాల్చి వస్తుంది.

చందమామ.. చుక్కలు.. చల్లగాలి.. 

చందమామను పట్నంలో చూస్తాం.. ఊర్లో చూస్తం కానీ, ఊర్లో చూసే చందమామ... ఎందుకో అందంగా ఉన్నడు అనిపిస్తది. అక్కడ తేడా చందమామలో లేదు. మనం చందమామను చూసే లొకేషన్లో ఉంటది. అమ్మలక్కలంతా బతుకమ్మలాడుతుంటే... నింగిలోని చందమామ కూడా నేలమీద. బతుకమ్మలాడుతున్న జాబిలమ్మలను చూడడానికి మరింత దగ్గరకు వచ్చిందేమో అనిపిస్తది.చుక్కలు కూడా చక్కున మెరుస్తున్నట్లు అనిపిస్తది. అది పల్లె గొప్పదనం. పల్లె చుట్టూ పచ్చటి పొలాలు, చేలు ఊరికి చల్లగాలిని మోసుకొస్తే ఆ పచ్చదాన్ని పల్లె ప్రేమను వదిలి పట్నం తిరుగు ప్రయాణమై వస్తుంటే మనసంతా భారంగా మారిపోతది.

-వెలుగు, లైఫ్​‌–