టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎందుకు కల్పించట్లేదు?

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ (ఉపాధ్యాయుల కోటా) ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘానికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం బండకాడిపల్లికి చెందిన సెకండరీ గ్రేడ్‌‌‌‌ టీచర్‌‌‌‌ బి.కృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌‌‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారించింది.

 పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌‌‌ వాదిస్తూ.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని టీచర్లకు ఓటు హక్కు లేకుండా ప్రభుత్వం సర్క్యులర్‌‌‌‌ జారీచేసిందన్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా వీరిని పరిగణనలోకి తీసుకోకపోవడం వివక్షాపూరితమన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఓటు హక్కు కల్పించకపోవడంపై ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘాలకు, ఆయా జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.