గౌరవెల్లి’కి నీళ్లు ఎట్ల వస్తాయో కేసీఆర్​ చెప్పాలి: పొన్నం ప్రభాకర్​

గౌరవెల్లి’కి నీళ్లు ఎట్ల వస్తాయో కేసీఆర్​ చెప్పాలి:  పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : తెలంగాణలో ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరుకు కాళేశ్వరం నీళ్లే వస్తున్నాయని చెప్పుకునే  కేసీఆర్​ కుటుంబం ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టులోకి నీళ్లు ఎట్ల వస్తాయో చెప్పాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంతో నీళ్లన్నీ ఖాళీ చేశారని, మరి హుస్నాబాద్​ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో అర్థంకావడంలేదన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్​ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుందని, భారీ ఎత్తున అవినీతి జరగడంతోనే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కుంగిపోయిందన్నారు.

ఈ అవినీతి బాగోతాన్ని స్వయంగా చూపించేందుకు హుస్నాబాద్​ నియోజకవర్గ ప్రజలను బుధవారం మేడిగడ్డ ప్రాంతానికి తీసుకెళ్తుండగా 12 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లతో గౌరవెల్లి ప్రాజెక్టును నింపామని గొప్పలు చెప్పుకున్న మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే సతీశ్​కుమార్​, బీఆర్​ఎస్​ నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. మేధావులు, ఇంజినీర్ల సలహాలు కాదని, తానే అద్భుతమైన ఇంజినీర్‌ అని చెప్పుకున్న కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిలో మొదటి దోషి అని ఆరోపించారు.

రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఇంత జరిగినా కేంద్రం మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇన్నేండ్లైనా చెక్కుచెదరకుండా ఉక్కులెక్క ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి కాంగ్రెస్​ను ఆదరించాలని కోరారు.

ALS0 READ: అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత