- కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట
- దేశం విడిచేందుకు వేలాదిగా పోటెత్తిన జనం
- రన్ వేపై విమానం కదుల్తున్నా.. ఎక్కేందుకు ప్రయత్నం
- విమానం చక్రాల వద్ద నిలబడి వెళ్లేందుకు సాహసం
- ఫ్లైట్ గాలిలోకి ఎగరగానే కిందపడి ముగ్గురు మృతి
- ఎయిర్ పోర్టులో కాల్పులు, తొక్కిసలాట.. మరో నలుగురు బలి
- కాబూల్‌లో ఇండ్లల్లోనే బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న జనం
- ఎట్లన్నా సరే.. దేశం దాటాలె!
- కాబూల్ ఎయిర్ పోర్టుకు అఫ్గాన్ల పరుగులు
అఫ్గాన్ గడ్డపై మళ్లీ తాలిబాన్ల రాజ్యం వస్తోందంటేనే వణికిపోతున్న జనం విదేశాలకు పరుగులు పెడుతున్నారు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు సోమవారం వేలాది ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. ఇండ్లను వదిలేసి.. అందిన కాడికి లగేజీ తీసుకుని, భార్యాబిడ్డలతో పరుగులు పెట్టారు. ఏ విమానం దొరికితే అది ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. విమానాలు కదులుతున్నా.. డోర్లు, వీల్స్ పట్టుకుని వేలాడి మరీ వెళ్లేందుకు సాహసించారు. ఓ విమానం వీల్స్ వద్ద తాళ్లతో కట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు ఫ్లైట్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే కిందకు జారిపడి చనిపోయారు. ఎయిర్ పోర్టులో కాల్పులు, తొక్కిసలాటతో మరో నలుగురు బలైపోయారు.
కాబూల్: అందరిదీ ఒకటే ప్రయత్నం. ఎట్లన్నా సరే.. విమానం ఎక్కి అవతల పడాలె. తాలిబాన్ మూకల అరాచక పాలన నుంచి తప్పించుకుని పారిపోవాలె. ఆస్తులు పోయినా సరే, ప్రాణాలు దక్కితే చాలు.. ఏదో ఒక దేశంలో కలోగంజో తాగి బతకొచ్చు.. కాబూల్ లోకి తాలిబాన్ ఫైటర్లు ఎంటరైన తర్వాత వేలాది మంది అఫ్గాన్ ప్రజల మనసుల్లో మెదిలిన ఆలోచనలివి! అందుకే.. తాలిబాన్ రాజ్యం అంటేనే వణికిపోతున్న అఫ్గాన్ ప్రజలు ప్రాణభయంతో విదేశాలకు పరుగులు పెడుతున్నారు. కాబూల్ లోకి తాలిబాన్ లు ఎంటర్ కావడం.. అధ్యక్షుడు అష్రఫ్‌ఘని దేశం విడిచి పారిపోవడంతో సోమవారం వేలాది మంది ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. ఇండ్లను వదిలేసి.. దొరికిన కాడికి లగేజీ తీసుకుని, పెళ్లాం పిల్లలతో ఎయిర్ పోర్టుకు పరుగులు పెట్టారు. వీసాల్లేవ్.. పాస్ పోర్టుల్లేవ్.. ఏ విమానం దొరికితే అది ఎక్కి అఫ్గాన్ నుంచి బయటపడితే చాలు అన్నట్లుగా ఎయిర్ పోర్టుకు వేలాదిగా పరుగులు పెట్టారు. ఒక్కో విమానంలోకి ఎక్కడానికి వందలాది మంది ఎగబడ్డారు. ఆర్టీసీ బస్సులకు జనం ఎగబడ్డట్లుగా.. తోసుకుంటూ, తొక్కుకుంటూ విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. కొంతమందైతే ఏకంగా విమానాల మీదకే ఎక్కి నిలబడ్డారు.
చక్రాల మీద నిలబడి..
విమానం చక్రాల వద్ద నిలబడి ప్రయాణించాలని ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు.. విమానం గాలిలోకి లేచిన కొద్దిసేపటికే పిట్టల్లా కిందకు జారిపడి బలైపోయారు. వేలాది మంది దూసుకు రావడంతో కాబూల్ ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది. చాలా మంది ఎయిర్ పోర్టు గోడలు ఎక్కి, కంచెలు తొలగించి లోపలికి ప్రవేశించారు. విమానాల వద్ద గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. తొక్కిసలాట వల్లనో.. లేక బుల్లెట్ గాయాల వల్లనో మరో నలుగురు మృత్యువాత పడ్డారు.
విమానాల రాకపోకలు బంద్
అఫ్గాన్ గగనతలం మీదుగా విమానాల రాకపోకలను కంట్రోల్ చేసే వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని కాబూల్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. దీంతో మన దేశంతో పాటు అమెరికా, తదితర దేశాల విమానాల రాకపోకలన్నీ బంద్ అయ్యాయి.
ఇండ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ..
తాలిబాన్ ఫైటర్లు కాబూల్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, పార్లమెంట్ భవనంలోనూ తిష్ట వేశారు. సిటీలోని అన్ని కూడళ్లలో కాపు కాస్తూ, వెహికల్స్ తనిఖీ చేస్తున్నారు. దీంతో జనం భయంతో ఇండ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
చచ్చినా పట్టించుకోరు.. ఎందుకంటే మేం అఫ్గాన్లం
తాలిబాన్ల ఆక్రమణతో అఫ్గానిస్తాన్ ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడే పరిస్థితి వస్తుందోనని భయపడుతు న్నారు. వీలైనోళ్లు పక్క దేశాలకు వలస పోతుంటే.. అక్కడ ఉన్నోళ్ల విష్యత్తు ఏంటని ఏడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచ దేశాలు పెదవి విప్పట్లేదని ఆవేదన చెందుతున్నారు. అఫ్గాన్ల బాధను ఓ బాలిక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మమ్నల్ని ఎవరూ పట్టించుకోరు. మనుషుల్లా కూడా చూడరు. ఎందుకంటే మేం అఫ్గాన్లం. నాకు ఏడుపు ఆగట్లేదు. మెల్లమెల్లగా మేమందరం చనిపోతాం. చరిత్రలో మేమంటూ ఉండం’ అని కన్నీరు మున్నీరైంది. 45 సెకన్ల ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.
మనోళ్లు 400 మంది చిక్కుకున్నరు..
కాబూల్ ఎయిర్ పోర్టులో ఇండియన్ అధికారులతో సహా 200 మందికి పైగా పౌరులు చిక్కుకుపోయినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే అఫ్గాన్ లోని ఓ గురుద్వారాలో 200 మంది సిక్కులు చిక్కుకున్నారని, వారిని వెనక్కి తీసుకొచ్చేందు కు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
రెఫ్యూజీలను అడ్డుకోవద్దు.. యూఎన్
అఫ్గానిస్తాన్ మళ్లీ టెర్రరిస్టు సంస్థలకు వేదికగా మారకుండా అంతర్జాతీయ సమాజం వీలైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పిలుపు నిచ్చారు. సోమవారం అఫ్గానిస్తాన్ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశం అధ్యక్షతన జరిగిన ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అఫ్గాన్ ప్రజలను ఒంటరివాళ్లను చేసి వదిలేయరాదని స్పష్టం చేశారు. అఫ్గన్లు రెఫ్యూజీ లుగా వస్తే వద్దనొద్దు, వెనక్కి పంపొద్దని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలను బరువెక్కిన హృదయంతో చూస్తున్నాం. ప్రజల ఆశలు, అభివృద్ధి, యంగ్ అఫ్గాన్ల కలలను నెరవేర్చే దిశగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది” అని గుటెర్రస్ చెప్పారు.
జనం ఎందుకు పారిపోతున్రు?
తాలిబాన్ల పాలనలో దేశంలో మళ్లీ అరాచకాలు మొదలవుతాయని అఫ్గాన్ ప్రజలు బెదురుకుం టున్నరు. ఇన్నిరోజులు అమెరికన్ బలగాలు, ప్రభుత్వంతో కలిసి తాలిబాన్లకు వ్యతిరేకంగా పనిచేసినోళ్లపై ప్రతీకార దాడులు జరుగుతాయ ని భయపడుతున్నరు. కఠినమైన ఇస్లామిక్ చట్టాన్ని మళ్లీ తెచ్చి, అడుగడుగునా ఆంక్షలు పెడతారని భయాందోళనకు గురవుతున్నరు. అప్పట్లో మహిళలకు చదువును నిషేధించారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లి పని చేయరాదని ఆంక్షలు పెట్టారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోబో మని, మహిళలకు స్వేచ్ఛనిస్తామని, చదువుకోవ చ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని తాలిబాన్లు చెప్తున్నా.. అధికారంలోకి వచ్చాక వారు మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం అఫ్గాన్ ప్రజలకు కలగడం లేదు. అందుకే.. వేలాది మంది దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.