దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి 2022(ఎనిమిదేండ్లు) వరకు ఏటా సుమారు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ మంది సూసైడ్ చేసుకున్నారు. ఏటా సూసైడ్ చేసుకుంటున్న మహిళల సంఖ్య సగటున 43,314 మాత్రమే ఉంది. సూసైడ్ రేటు ప్రతి లక్షమంది పురుషులకు 14.2 కాగా.. మహిళల్లో ఇది 6.6గా ఉంది. 2015 నుంచి 2022 వరకు మొత్తం 11,56, 023 మంది సూసైడ్ చేసుకున్నారు. అందులో పురుషులు 8,09,506 మందికాగా.. మహిళలు 3,46,517 మంది ఉన్నారు. అంటే ఈ 8 ఏండ్లలో మగాళ్ల సూసైడ్స్ 34.08% పెరగగా..ఆడవాళ్ల సూసైడ్స్14.45% పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రిపోర్ట్ వెల్లడించింది.
మగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?
ఆడవాళ్ల కంటే మగాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. కుటుంబ సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2015 నుంచి 2022 వరకు కుటుంబ సమస్యల కారణంగా 242,909(23.06% ) మంది మగాళ్లు సూసైడ్ చేసుకున్నట్లు చెప్పింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యతో 1,40,441(21.05%)మంది పురుషులు సూసైడ్ చేసుకున్నట్లు వివరించింది. డ్రగ్స్, లిక్కర్ అలవాటుతో 60,571మంది, అప్పుల వల్ల 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహ సంబంధిత సమస్యలతో 26,588 మంది పురుషులు తమ ప్రాణాలు తీసుకున్నారు. వివాహ సంబంధిత సమస్యలతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా సూసైడ్ చేసుకున్నట్లు తేలింది. మగాళ్లు 26,588(3.28%) సూసైడ్ చేసుకుంటే..మహిళలు 33,480(9.66%) ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు కూడా పురుషులే ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సంఖ్య 10,532గా ఉంది. ఏ కారణం లేకుండా 87,101 మంది మగాళ్లు సూసైడ్ చేసుకున్నారు. 2015 నుంచి 2022 మధ్య 81,402 (10% )మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలి?
పురుషుల్లో అయినా, మహిళల్లో అయినా ఆత్మహత్యల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ వెల్లడించింది. ప్రతిఒక్కరిలో మానసిక స్థైర్యాన్ని పెంచాలని సూచించింది. వివిధ కార్యక్రమాల ద్వారా భావోద్వేగ నియంత్రణకు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం అందించాలని తెలిపింది. సామాజిక ఆర్థిక ఒత్తిళ్లు, విద్యాపరమైన వైఫల్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రణాళికలతో పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించింది. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు వంటి కమ్యూనిటీ ప్రదేశాలను సురక్షిత ప్రదేశాలుగా మార్చాలని చెప్పింది. పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి ఎలా ట్రైన్ చేస్తామో..మనుషులకూ అన్ని స్థాయిలలో ఆత్మహత్య నివారణ శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయాన్ని అందించేందుకు హెల్ప్‌లైన్‌ల ఏర్పాటు తప్పనిసరని తెలిపింది. ఆత్మహత్యల నివారణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఎన్సీఆర్బీ అభిప్రాయపడింది.