ఆల్ఫ్రెడ్ నోబెల్ 21 అక్టోబర్1833లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ లో జన్మించారు. ఆయన అనేక భాషల్లో నిష్ణాతులే కాక కవిత్వం, నాటకాలు రాశారు. సామాజిక, శాంతి సంబంధిత సమస్యలపై ఆయనకు ఆసక్తి ఉండేది. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, ఇంజనీర్, వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త కూడా ఆయిన ఆల్ఫ్రెడ్ నోబెల్1896 లో మరణించేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా 355 పేటెంట్లను పొందారు. డైనమైట్‌ను కనుగొన్నారు. సింథటిక్ రబ్బరు, తోలు, కృత్రిమ పట్టును తయారు చేయడంలో అనేక ప్రయోగాలు చేశారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ తన ఎస్టేట్‌లో ఎక్కువ భాగం 31 మిలియన్ల స్వీడిష్ క్రోన్లకు పైగా(నేడు దాదాపు1,702 మిలియన్ల స్వీడిష్ క్రోన్) ఫండ్‌గా మార్చి, దాన్ని సేఫ్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టి, తద్వారా వచ్చే ఆదాయాన్ని బహుమతుల రూపంలో ఏటా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. 1895 నవంబర్ 27న ఆల్ర్ఫెడ్ నోబెల్ ప్యారిస్‌లోని స్వీడిష్ నార్వేజియన్ క్లబ్లో తన చివరి వీలునామాపై సంతకం చేశారు. అతని మరణం తర్వాత దాన్ని తెరిచి చదివినప్పుడు స్వీడన్‌తో పాటు అంతర్జాతీయంగా అనేక వివాదాలు తలెత్తాయి. నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని బహుమతుల స్థాపన కోసం విడిచిపెట్టడంపై అతని కుటుంబం అభ్యంతరం తెలిపింది. నోబెల్ బహుమతిని స్థాపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. చివరకు ఐదేండ్ల తర్వాత1901లో మొదటి నోబెల్ బహుమతి ప్రదానం జరిగింది.
ఆరు రంగాల్లోనే ఎందుకు?
ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ/మెడిసిన్, లిటరేచర్, శాంతి వంటి ఐదు రంగాల్లో మాత్రమే విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు/సంస్థలకు నోబెల్ బహుమతులు అందించడానికే తన సంపదలో ఆయన అత్యధిక వాటా కేటాయించారు. ఎందుకంటే ఈ ఆరు రంగాలతో ఆయనకు ఎక్కడో విధంగా పరిచయం ఉంది. ఆయన సొంత రీసెర్చ్ ఫిజిక్స్‌తో ముడిపడి ఉంది. తాను ఉపయోగించిన పారిశ్రామిక ప్రక్రియలు కెమిస్ట్రీ పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. ఆయనకు వైద్య పరిశోధనలోనూ చురుకైన ఆసక్తి ఉంది. ఆయనకు సాహిత్య అభిరుచి కూడా ఉండేది. లైబ్రరీలో వివిధ భాషల్లో ఉన్న గొప్ప సాహిత్య గ్రంథాలు ఆయన చదివారు. వీటితోపాటు ఐరోపాలో అంతర్జాతీయ శాంతి ఉద్యమకారుడైన బెర్తా వాన్ సుట్నర్‌తో నోబెల్ పరిచయం శాంతిపై ఆయనకున్న అభిప్రాయాలను ప్రభావితం చేసింది. ఇలా నోబెల్ తన స్వానుభవాలతోపాటు, సమాజ అభివృద్ధికి చోదక శక్తులైన ప్రధాన రంగాల్లో బహుమతులు ప్రదానం చేయాలని సంకల్పించారు. అయితే 1968 లో, స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ (స్వీడన్ సెంట్రల్ బ్యాంక్) నోబెల్ బహుమతి స్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో బహుమతిని స్థాపించింది. ఆ బ్యాంక్ 300 వ వార్షికోత్సవం సందర్భంగా 1968 లో నోబెల్ ఫౌండేషన్ స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ నుంచి అందుకున్న విరాళం ఆధారంగా ఈ బహుమతి ఇస్తున్నారు. ఎకనామిక్స్‌లో మొదటి బహుమతి1969లో రాగ్నర్ ఫ్రిష్, జాన్ టిన్‌బెర్గెన్‌లకు దక్కింది. 1901 నుంచి 2021 వరకు నోబెల్, ఎకనామిక్స్బహుమతులు మొత్తం కలిపి 609 సార్లు ప్రదానం చేశారు. వాటిని ఎక్కువసార్లు ఒక్కరికి, కొన్నిసార్లు ఇద్దరికి, మరికొన్నిసార్లు ముగ్గురికి అందజేశారు. ఇప్పటివరకు 947 మంది గ్రహీతలు, 28 సంస్థలను నోబెల్ బహుమతి వరించింది, మహిళలకు నోబెల్ బహుమతి, ఆర్థిక శాస్త్రంలో బహుమతి 58 సార్లు ప్రదానం చేశారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో 49 బహుమతులు ఇవ్వలేకపోయారు. ఫిజిక్స్ లో 6 సార్లు, కెమిస్ట్రీలో 8సార్లు, మెడిసిన్ లో 9 సార్లు, లిటరేచర్ లో 7సార్లు, శాంతిలో 19సార్లు ఎవరినీ సత్కరించలేకపోయారు. ఈ ఏడాది ఆరు నోబెల్ ప్రైజులను13 మందికి డిసెంబర్ 6 నుంచి12వ తేదీ వరకు స్టాక్ హోమ్ లో జరగబోయే ఉత్సవాల్లో ప్రదానం చేస్తారు.
నోబెల్ ప్రైజుల్లో ఇండియా?
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం ‘నోబెల్ ప్రైజ్’. ప్రపంచ గతిని మార్చే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ ల్లో ఆవిష్కరణలకు, సామాజిక, సేవా రంగాల్లో ప్రముఖ వ్యక్తులను లేదా సంస్థలను గుర్తించి సత్కరించడంతో పాటు భారీ మొత్తంలో నగదును బహుమతిగా ‘నోబెల్ ఫౌండేషన్’ అందిస్తోంది. అలా ఇప్పటివరకు 975 మంది మొత్తం/పాక్షిక బహుమతి అందుకున్నారు. అయితే ఇండియా నుంచి సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్(1913), ఫిజిక్స్ లో సర్ సీవి రామన్ (1930), వైద్య శాస్త్రంలో హర్ గోవింద్ ఖురానా(1968), శాంతి విభాగంలో మదర్ థెరీసా(1979), ఫిజిక్స్ లో సుబ్రమణ్య చంద్రశేఖర్(1983), ఎకనామిక్స్‌లో అమర్త్యసేన్(1998), కెమిస్ట్రీ లో వెంకట్రామన్ రామకృష్ణన్(2009), శాంతి విభాగంలో కైలాష్ సత్యార్థి(2014), ఆర్థిక శాస్త్రాల్లో అభిజిత్ బెనర్జీ(2019) నోబెల్ ప్రైజులు సాధించారు. అంటే మన దేశం నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు ఒక్క శాతం కంటే తక్కువగానే ఉన్నారు. ప్రపంచంలో ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉండటమే కాకుండా జనాభాలో రెండో స్థానంలో ఉన్న ఇండియా నోబెల్ బహుమతుల సాధన విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోకతప్పదు.
నిధులు పెంచాలె
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సీలు, ఐఐఎస్ఈఆర్లు, ఎన్ఐపీఈఆర్లు, రీసెర్చ్ సెంటర్స్, సెంట్రల్ యూనివర్సిటీల్లో పరిశోధనలకు నిధులు పెంచాలి. సమాజానికి, పరిశ్రమలకు, పరిశోధనకు మధ్య వారధి ఏర్పర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో ‘ఐఐటి జపం-, నీట్ మంత్రం’ తప్ప మరేమీ వినబడటం లేదు. ఈ నేపథ్యంలోనే మానవీయ, సామాజిక శాస్త్రాలు వాటి ప్రాభవాన్ని కోల్పోయాయి. ఎన్‌ఈపీ-2020, సైన్స్, నాన్-సైన్స్ సబ్జెక్ట్స్ మధ్య తేడా లేకుండా, ఉన్నత విద్యలో మల్టీ డిసిప్లీనరి/ఇంటర్ డిసిప్లీనరి ప్రవేశపెట్టాలని రికమెండ్ చేసింది. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్, విభిన్న ఆలోచనా సామర్థ్యాలు, నైతిక విలువలు, సామాజిక స్పృహ, సేవా భావం చిన్నతనం నుంచి అలవర్చినప్పుడే, వారు వారికి నచ్చిన అంశంలో ప్రావీణ్యం పొంది, దేశం గర్వించేలా కృషి చేస్తారు. ప్రభుత్వాల చొరవతో, తల్లిదండ్రుల ప్రోద్భలంతో, ఉపాధ్యాయుల కృషితో, విద్యార్థుల లాజికల్ థింకింగ్ తో ‘వేద భూమి’ని ప్రపంచాన్ని మరింత ముందుకు నడిపించే ‘జ్ణాన భాండాగారం’ గా చేయవచ్చు. తద్వారా మన దేశం కూడా మున్ముందు ఎక్కువ సంఖ్యలో నోబెల్ బహుమతులు పొందేలా ఎదుగుతుంది.
1913లో సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలు.. 2019 ఎకనామిక్స్‌లో అభిజిత్ బెనర్జీ వరకు ఇండియా నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు ఒక్క శాతం కంటే తక్కువగానే ఉన్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. బహుమతుల్లో దూసుకుపోతుంటే మన దేశం అరకొర ప్రైజ్‌లతో సరిపెట్టుకుంటోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో నైనా ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్, పరిశోధనలకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది.
పరిశోధనలు పెరగాలి..
ఇండియా సాధించిన మూడు నోబెల్ ప్రైజ్‌లు సైన్స్ కి చెందినవి కాగా మరో మూడు మానవీయ, -సామాజిక శాస్త్రాలకు సంబంధించినవి. అంటే సమాజ సర్వతోముఖాభివృద్ధికి సైన్స్ ఒక్కటే సరిపోదు. మనిషి ఎంత సంతోషంగా జీవిస్తున్నాడు అనేది కూడా చాలా ముఖ్యం. సైన్స్, సోషల్ సైన్స్ ఒకే నాణానికి ఉన్న బొమ్మాబొరుసు లాంటివి. సైన్స్‌తోపాటు సామాజిక, మానవీయ శాస్త్రల్లో పరిశోధనలకు ప్రాధాన్యం పెరగాలి. ఇందులో భాగంగానే ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యూనివర్సిటీల్లో సంస్కృత విభాగాలను నెలకొల్పి, మన చరిత్రలో దాగివున్న సైన్స్ ను వెలికితీయాలని సంకల్పించింది. ఇంకా ‘ఆయుష్’ (ఆయుర్వేద, యోగా-నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగంలో పరిశోధన కొత్త పుంతలు తొక్కాలి.