సీఈసీ నియామకం .. అర్ధరాత్రి వేళా? కోర్టు విచారణకు ముందు ఎట్లా చేస్తరన్న రాహుల్​

సీఈసీ నియామకం .. అర్ధరాత్రి వేళా? కోర్టు విచారణకు ముందు ఎట్లా చేస్తరన్న రాహుల్​
  • నేను అభ్యంతరం తెలుపుతూ నివేదిక అందించా
  • ఈ ఎంపిక ప్రజల్లో మరింత ఆందోళన పెంచిందని కామెంట్​

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్ (సీఈసీ)​ జ్ఞానేశ్​కుమార్​ నియామకాన్ని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ తప్పుబట్టారు. ఈ ఎంపికపై ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా  తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. 

ఈ విషయంలో వారిద్దరూ అగౌరవంగా, అమర్యాదపూర్వకంగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘తదుపరి సీఈసీ ఎంపికకు నిర్వహించిన కమిటీ మీటింగ్​లో  మోదీ, అమిత్​షాకు మా అభ్యంతరాల నివేదికను అందజేశాం. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషన్‌‌లో ఈసీ, సీఈసీని ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత ప్రాథమిక అంశం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ.. అర్ధరాత్రి వేళ కొత్త సీఈసీని ఎంపిక చేశారు” అని పేర్కొన్నారు. 

సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కింది

సీఈసీ ఎంపికలో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర సర్కారు తుంగలో తొక్కిందని రాహుల్​గాంధీ మండిపడ్డారు. ఈ సెలక్షన్ ప్రాసెస్​లో చీఫ్​జస్టిస్​ఆఫ్​ ఇండియా (సీజేఐ) లేకుండానే హడావుడిగా సీఈసీ పేరును ప్రకటించారని అన్నారు.  ఈ నియామక ప్రక్రియపై విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉన్నదని చెప్పారు. మరో 48 గంటల్లో ఈ అంశంపై కోర్టులో విచారణ ఉండగా.. కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం సరికాదని తెలిపారు. నియామ‌‌క ప్యాన‌‌ల్ నుంచి సీజేఐని తొల‌‌గించ‌‌డం వ‌‌ల్ల ఎన్నికల వ్యవస్థపై కోట్లాది మంది ఓట‌‌ర్లలో ఆందోళ‌‌న‌‌ల‌‌ను మ‌‌రింత తీవ్రతరం చేసిందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ఆశయాలను కాపాడడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత​అని, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి 
ఉంటుందని అన్నారు.

రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్​

కొత్త సీఈసీగా జ్ఞానేశ్​ కుమార్​ నియామకంపై కాంగ్రెస్​అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్​ను హడావుడిగా ఎంపిక చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని, స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తుందని తెలిపింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కాంగ్రెస్​ నేత మాణికం ఠాగూర్​అన్నారు. అలాగే, మరో సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్​ ఎక్స్​ వేదికగా కేంద్ర సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్‌‌ నుంచి సీజేఐని తొలగించడంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్రం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో​ కనిపిస్తున్నది’’ అని దుయ్యబట్టారు. దీన్ని బట్టి ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తున్నదో అర్థమైపోతున్నదని అన్నారు.