మానవ జీవనంలో బాల్యం అందమైన, ఆహ్లాదకరమైన దశ. ప్రస్తుతం బాల్య దశలో ఉన్న బాల బాలికలు నూటికి నూరు శాతం సంతోషంతో ఉన్నారా? అంటే లేరు. లక్షలాది మంది పిల్లల బాల్యం రోడ్లపై, పరిశ్రమలు, కర్మాగారాలు, ఇటుక బట్టీలు, మైన్స్‌లో మగ్గిపోతోంది. వీళ్లకు పుట్‌పాత్‌లే అమ్మ ఒడి. పలకా బలపం పట్టాల్సిన చేతులతో పలుగు, పార, పానాలు పడుతున్నారు. తోటి పిల్లలతో బడిలో ఉండాల్సిన చాలా మంది బడి బయట యాచకులుగా, కార్మికులుగా జీవనం గడుపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో దాదాపు కోటి మంది బాలకార్మికులు ఉన్నారు.
ఎందుకు ఇలా?
బాలలు కార్మికులుగా ఎందుకు మారుతున్నారనే కారణాలను విశ్లేషిస్తే.. వివిధ కారణాలతో తల్లితండ్రుల్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ చనిపోవడం వల్ల వారి పిల్లలు అనాథలై బాల కార్మికులుగా మారుతున్నారు. కఠిన పేదరికం అనుభవిస్తున్న కుటుంబాల పిల్లలు కూడా బాలకార్మికులుగా మారాల్సి వస్తోంది. ఆరేడు ఏండ్ల పిల్లలు కూడా ఎంతో కొంత సంపాదిస్తేనే ఇల్లు గడిచే కడు పేదరికం వారిది. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలను రకరకాల పనుల్లో పెడుతున్నారు. తల్లిదండ్రులు తాగుడు, జూదం, డ్రగ్స్‌లాంటి వ్యసనాలకు అలవాటుపడిన సందర్భాల్లో కూడా వారి పిల్లలు బలవంతంగా బాల కార్మికులుగా మారుతున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
గురుపాదస్వామి కమిటీ సిఫార్సుల ఆధారంగా 1986లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చట్టం చేశారు. దీని ప్రకారం 14 ఏండ్ల లోపు పిల్లలను నిర్దిష్ట ప్రమాదకర వృత్తులు, ప్రక్రియల్లో పనిలో పెట్టుకోకూడదు. 2016లో ఈ చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం.. 14 ఏండ్ల లోపు పిల్లలతో ఎక్కడా పనిలో పెట్టుకోకూడదని, 14 నుంచి18 ఏండ్ల వయసు గల పిల్లలతో ప్రమాదకర ప్రాంతాల్లో పనులు చేయించొద్దని నిబంధనలను సవరించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఆరు నుంచి 14 ఏండ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. ఇలాంటి చట్టాలు ఎన్నో ఉన్నా.. రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో వాటి అమలులో చిత్త శుద్ధి చూపకపోవడంతో ఏటా లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. చైల్డ్ట్రాఫికింగ్మాఫియాలు పిల్లలను వివిధ దేశాలకు రవాణా చేస్తూ.. బలవంతపు పనులు చేయిస్తున్నారు. ఆడ పిల్లలు అయితే వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నార్కోటిక్స్, అక్రమ ఆయుధ రవాణా తర్వాత బలవంతపు పనులు, వ్యభిచారం కోసం చేస్తున్న పిల్లల రవాణా మూడో అతిపెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ గాపలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్లేబర్ఆర్గనైజేషన్నివేదిక ప్రకారం గత నాలుగేండ్లలో కరోనా కారణంగా 80.4 లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారు.
సత్వర చర్యలు అవసరం
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు భాగస్వామ్యంతో పనిచేయాలి. గ్రామ, పట్టణ స్థాయి నుంచే ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పరిచి బాలల హక్కుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. నిజానికి తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. బాలల హక్కులను పరిరక్షించడంలో తమిళనాడు ముందుంది. ఈ రాష్ట్రం పంచాయతీలు, పట్టణ సంస్థల స్థాయిలోనే పిల్లల రక్షణ విధానాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిరుడు బాలల హక్కుల రక్షణకు సంబంధించి ఆ రాష్ట్రం సీఎం స్టాలిన్పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాల కార్మికుల అక్రమ రవాణా సమస్యకు చెక్‌పెట్టేందుకు సింపుల్, సత్వర దారులేమీ లేవు. వినూత్న పరిష్కార మార్గాల అన్వేషణ అవసరం. సమయానుకూల బహుముఖ వ్యూహం కావాలి. కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ ఇంటెలిజెన్స్నెట్వర్క్బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ఎనిమిది రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో పనిచేస్తోంది. ఈ నెట్‌వర్క్ గ్రామాల్లోని సాధారణ ప్రజలతో కలిసి పనిచేస్తూనే.. గ్రామ పంచాయతీ సభ్యులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తూ.. బాల కార్మిక వ్యవస్థను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
- మునిగంటి శతృఘ్నచారి
కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం