ఆశించిన స్థాయిలో కాంగ్రెస్‌ పుంజుకోవటం లేదెందుకు?

ఆశించిన స్థాయిలో కాంగ్రెస్‌ పుంజుకోవటం లేదెందుకు?

అసెంబ్లీకి అరకిలోమీటర్‌ దూరంలో కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌ ఉంది. కానీ, దాన్ని దాటి వందల గజాల దూరంలోని బీజేపీ ఆఫీసుకు ఎందుకు నాయకులు వరుస కడుతున్నారు? ఇది కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచించాల్సిన అంశం! బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఒంటరి అభ్యర్థినే పోటీలో ఉంచాలనే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ కేంద్రకంగా ఓ యత్నం జాతీయ స్థాయిలో జరుగుతుంటే.. తెలంగాణలో ‘డివైడెడ్‌ హౌస్‌’గా ఉన్న కాంగ్రెస్‌ సొంత ఇల్లు ఎందుకు చక్కదిద్దుకోలేకపోతోంది? సవాళ్లు అధికంగా, సామర్థ్యం అల్పంగా ఉన్నందునే ఈ దుస్థితా? ఎన్నికలలోపు అధిగమించగలదా? కోటి రూకల ప్రశ్న! రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ పరిస్థితిని చాలాసార్లు ప్రజలు మెరుగుపరుస్తారు, నాయకులు దిగజారుస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడూ జరుగుతున్నదదే! తెలంగాణలో 2014, 2018 రెండు వరుస ఓటముల తర్వాత కూడా ఆశించిన స్థాయిలో కాంగ్రెస్‌ పుంజుకోవటం లేదెందుకు? అన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో తరచూ చర్చకు వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీగా ఆంధ్రప్రదేశ్‌లో సర్వం పోగొట్టుకున్న కాంగ్రెస్‌ తెలంగాణలో బావుకున్నదేమీ లేదు. లభించిన అరకొర ప్రజామద్దతును కూడా ఎన్నికైన ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం వల్ల కోల్పోయింది.

తప్పున్నది ఇరువైపులా!

తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులందరినీ నెలరోజులు, ‘బిగ్‌ బాస్‌ హౌస్‌’లో ఉంచాలనే ఓ రాజకీయ పండితుడి సూచనలో సహేతుకత ఉంది. సహనం పెరగొచ్చు! భావోద్వేగాలు, కోపతాపాలు చక్కగా అర్థమై పరస్పర అవగాహన పెరగటమే కాక సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు దొరకుతాయేమో? గిట్టని వాళ్లను పార్టీ నుంచి పంపించే ఎత్తుగడలు కాంగ్రెస్‌లో సహజం. మహేశ్వర రెడ్డిది ఒక తాజా ఉదాహరణ మాత్రమే! టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి వర్సెస్‌ సీనియర్లు అని సాగుతున్న ఆధిపత్య పోరు ఫలితం కాకుంటే, షోకాజ్‌ నోటీసుకు గంటలో సమాధానం ఇమ్మనడంలో అర్థమేంటి? ఇంతటి దుందుడుకు చర్యలే లేకుంటే, తానెందుకు కాంగ్రెస్‌ వీడి బీజేపీలో చేరింది చెప్పుకునే కారణమే ఆయనకు ఉండేది కాదు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఓ రోజు ప్రధానిని కలుస్తారు, మరుసటి రోజు కాంగ్రెస్‌ కీలక సమావేశంలో పాల్గొంటారు, మరో రోజు ఓ వివాదాస్పద ప్రకటన చేస్తారు. ఇలాంటివి ఇంకే పార్టీలోనూ సాధ్యపడవేమో! పేరుకే ‘హాత్​సే హాత్​ జోడో’ కానీ, నాయకుల విషయంలో జరుగుతున్నది మాత్రం ‘కరచాలనాలు– కడుపులో కత్తులు!’ ఏదో రూపంలో సీనియర్లకు కత్తెర వేయాలని పీసీసీ నేత అనుచరవర్గం చూస్తుంటే, పార్టీ ప్రయోజనాలు పణంగా పెట్టయినా ఆయన ఆధిపత్యం సాగనీయొద్దని ప్రత్యర్థి వర్గం యోచిస్తోంది. ఠాగూర్‌ వెళ్లి ఠాక్రే వచ్చినా పరిస్థితిలో మార్పేమీ లేదు. ఠాక్రే వచ్చాకే, పీఏసీ సమావేశంలోనే, ‘పరిస్థితులు ఇలాగుంటే, మనకొచ్చే స్థానాలు సింగిల్‌ డిజిట్‌(గరిష్టంగా 9) ఖాయమ’ని ఓ ముఖ్యనాయకుడే వ్యాఖ్యానించారన్న వార్త పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టించింది.1983,1994 లలో కూడా పార్టీలో ఇలాంటి అనైక్యతే ఉన్నా, అప్పుడు కనీసం నాయకులైన ఉద్దండులుండేవారు. అందుకే, విభేదాలున్నా... 1989లో, 2004లో పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఐక్యతా లేదు, ఉద్దండులూ లేరు!

పొత్తు మాటతో చిత్తు

తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు లాభమెంత? నష్టమెంత? అనే విషయమై సరైన కసరత్తు లేకుండానే అంశాన్ని వీధులకీడ్చారు. సీనియర్‌ నాయకుడు జానారెడ్డి చేసిన ఓ వ్యాఖ్య తర్వాత ఇది పెద్ద రాద్ధాంతమే అయింది. పొత్తు ఆలోచనకు వ్యతిరేకంగా(టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి అనుకూలురు), అనుకూలంగా(ఆయన వ్యతిరేకులు) వాదనలు పెంచారు. రాష్ట్రంలో పాలక బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్‌కు పొత్తుంటే, ఇక పార్టీ ఎదుగుదల ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా కష్టమనే వాదన మొదలైంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అయినా ‘పొత్తు చర్చ’తో కాంగ్రెస్‌ పలుచనవడమే కోరుకుంటారు తప్ప పొత్తు కోరుకోరు. త్రిముఖ పోటీయే తనకు లాభిస్తుందని ఆయనకి తెలుసు! బీజేపీ వ్యతిరేక ఓటును చీలనీయకుండా దేశమంతా విపక్షాల ఒంటరి అభ్యర్థుల్ని నిలిపే యత్నాలకు బీహార్‌ సీఎం నితీష్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, మరాఠా యోధుడు శరద్‌ పవార్‌ తదితరుల చొరవ వల్ల విపక్ష సయోధ్యకు కమ్యూనిస్టుల్లోనూ ఓ కదలిక మొదలైంది. ఇలాంటి తరుణంలో పొత్తుల అంశం నిజంగానే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఓ అయోమయాన్ని, అలజడిని రేపుతోంది. దీనిపై అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. పైపెచ్చు, అందుకు గల సాధ్యాసాధ్యాలను సీనియర్‌ నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌, జైరామ్‌ రమేష్‌ వంటి నాయకుల బృందమొకటి పరిశీలిస్తోంది. విపక్ష ఐక్యతా యత్నాలు మెరుగవుతుంటే, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ సొంతింటి వ్యవహారం అంత బాగోలేదు. అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో సొంతపార్టీ నేత సచిన్‌ పైలెట్‌ నడివీధిలో అవినీతిపై దీక్ష చేస్తారు. కేరళలో ఆంతోనీ వంటి విశ్వసనీయతగల సీనియర్‌ నేత తనయుడు బీజేపీకి మారడం పలువురిని విస్మయపరచింది. పొత్తుల్లేకుండా పోటీ చేసినంత మాత్రాన తెలంగాణలో అంతా అయిపోదు. లోగడ లక్ష్మీపార్వతి పార్టీ, మొన్న వైఎస్సార్సీపీ, నిన్న కమ్యూనిస్టుల ప్రయోగం బీఎస్సెల్లెఫ్‌ కూడా దాదాపు అన్ని స్థానాలకు పోటీ చేసి ఏం బావుకున్నాయి? 2018లో బీజేపీ119 చోట్ల పోటీ చేస్తే, పరువు సంగతి తర్వాత..105 చోట్ల దరావత్తే దక్కలేదు. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా తప్పులు దిద్దుకొని కాలపరీక్షకు నిలవడమా? కాలగర్భంలో కలవడమా? కాంగ్రెస్‌ నిర్ణయించుకోవాలి.

ఆత్మశోధన లేకే!

ఎక్కడ లోపముంది? ఎలా సరిదిద్దుకోవచ్చన్న ఆత్మపరిశీలన కాంగ్రెస్‌లో లోపిస్తోంది. జరిగినా, అది మొక్కుబడిగానే తప్ప నిజాయితీతో జరగట్లేదు. ఎన్నికల శైలిలోనే పెద్ద ఎత్తున మార్పులొచ్చిన ఈ తరుణంలో ఒకపార్టీ ‘గెలుస్తోంది’ అని ఎన్నికల ముందు ఊపొస్తే, ఓటమి తీరంలో మిగిలిన సరిహద్దుల్లో కొట్టుమిట్టాడే వారంతా గెలిచేస్తారు. అలాగే, పార్టీ ‘ఓడిపోతోంది’ అనే ప్రచారం పెరిగితే, గెలుపు అంచులు తాకి ఉవ్విళ్లూరే వాళ్లూ ఓడిపోతారు. తటస్థ ఓటర్ల నిర్ణయాన్ని ఒక వాతావరణం ప్రభావితం చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇదే కాంగ్రెస్‌కు వరుసగా నష్టం కలిగిస్తోంది. గాంధీభవన్‌ లోపల, బయట పెద్దమ్మగుడి దగ్గరి కార్యాలయంలో ఎన్ని అధికారిక మంతనాలు జరిపినా, ఫతేమైదాన్‌ క్లబ్‌లో మరెన్ని ప్రచ్ఛన్న భేటీలు చేసినా, అవి ప్రజల్లో పార్టీని మెరుగుపరిచేవి కావాలి. అంతే తప్ప, తమ ఆధిపత్యం కోసం కాంగ్రెస్‌ను పలుచన చేసేవి కాకూడదు. ముఖ్యంగా ఓ మూడు సవాళ్లు తెలంగాణ కాంగ్రెస్‌ను సంక్షోభంలోకి నెడుతున్నాయి. దిగజారిన విశ్వసనీయత, పెచ్చుమీరిన అనైక్యత, పొసగని పొత్తుల చర్చ వంటివి.

ఇలా ఉంటే నమ్ముతారా?

అధికారంలోకి రాకపోయినా.. గట్టి ప్రతిపక్షంగానైనా నిలువరు, గెలిపిస్తే కూడా పాలకపక్షానికి అమ్ముడుపోయే వారిని గెలిపించడం ఎందుకు? అనే భావన నాయకులు, కార్యకర్తల స్థాయి దాటి పౌరసమాజంలోకి విస్తరించింది. కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయతపై ఇది పెద్ద దెబ్బ! కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాలను పగలూ, రేయి దుమ్మెత్తిపోసే కాంగ్రెస్‌ నాయకులు, అంతకన్నా మేలైన ప్రభుత్వాల్ని ఎలా ఇవ్వగలరో చెప్పరు. చెప్పి జనానికి విశ్వాసం కలిగించరు. ఏ ఆశ, నమ్మకంతో ప్రజలు వీరివైపు రావాలి? 2018 ఎన్నికల ముందు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ ఓ సభ పెట్టి మేధావులు, ఆలోచనాపరుల్ని పిలిచి సలహాలడిగింది. ‘డా.వైఎస్సార్​ అనుసరించిన సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల్ని పరిశీలించి, అవసరమైన మార్పులతో మానిఫెస్టో చేసి ప్రజల్లోకి వెళ్లండి, మీకు మేలు జరుగుతుంది’ అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ వంటి మేధావులు సూచించారు. ‘దేశంలో ఎక్కడా లేని వ్యవసాయ విధానాలు ఏపీలో ఎలా అమలయ్యాయి? జనం ఎలా లబ్ధిపొందారు?’ ఆలోచించండి అని చెప్పారు. ‘భారత్‌ జోడో’కు ముందే రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించి ‘వరంగల్‌ డిక్లరేషన్‌’ ప్రకటించారు. దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకుపోయేంత సమయముందా, తగాదాల్లో మునిగితేలే స్థానిక నాయకులకు? ప్రజలకు కొత్త విశ్వాసం కలిగించడం అటుంచి, సొంత పార్టీ నాయకులే నమ్మకం కోల్పోతున్నారు. దిగ్గజ ముఖ్యమంత్రిగా పేరున్న మర్రి చెన్నారెడ్డి తనయుడు, మాజీ మంత్రి శశిధర్‌ రెడ్డి, ఉమ్మడి ఏపీకి దాదాపు నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి చడీచప్పుడు లేకుండా కాంగ్రెస్‌ను వీడి ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లారు. ఎందుకని? ఎప్పుడైనా ఆలోచించారా? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఒకవైపు ఉత్తర తెలంగాణకు వస్తుంటే, అదే ప్రాంతానికి చెందిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి పార్టీ వీడి బీజేపీ బాట పట్టారు.

 

ఆర్ దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్ 
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ