- రెండు విడతల్లోనూ డోర్నకల్ క్యాండిడేట్‌ను ప్రకటించని కాంగ్రెస్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కటే పెండింగ్
- టికెట్ దక్కించుకునేందుకు హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు
మహబూబాబాద్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన కాంగ్రెస్ డోర్నకల్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. రెండు లిస్ట్‌ల్లోనూ ఈ నియోజకవర్గం పేరు కనిపించలేదు. దీంతో డోర్నకల్ టికెట్ ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్, మాలోతు నెహ్రూనాయక్‌తో పాటు కిసాన్ పరివార్ సంస్థ వ్యవస్థాపకుడు నూనవత్ భూపాల్‌నాయక్ అప్లై చేసుకున్నారు. కానీ ప్రధానంగా రామచంద్రునాయక్, నెహ్రూనాయక్ మధ్య టికెట్ పోరు నెలకొంది.
లోకల్ కేటగిరిలో...
నెహ్రూనాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామ శివారు హఠ్యాతండాకు చెందిన వ్యక్తి. దీంతో లోకల్ కేటగిరిలో ఆయనకే టికెట్ కేటాయించేందుకు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహబూబాబాద్ టికెట్ దక్కకపోవడంతో తన అనుచరుడైన నెహ్రూ నాయక్‌కు డోర్నకల్ టికెట్ అయినా ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ హైకమాండ్‌ను కోరుతున్నారు. మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి సైతం నెహ్రూనాయక్‌కే మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు స్థానికుడు కావడంతో ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
సానుభూతి ఫలించేనా ?
డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్ పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చెందిన వ్యక్తి. ఈయన డోర్నకల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఒకసారి, కాంగ్రెస్ తరఫున మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రామచంద్రునాయక్ స్థానికుడు కాకపోవడం వల్లే గతంలో ఓడిపోయినట్లు పలువురు చెబుతున్నారు. రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఇద్దరు లీడర్లు ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ALSO READ : పాలమూరు కాంగ్రెస్‌లో కుదుపు
టికెట్‌పై జోరుగా కార్యకర్తల బెట్టింగ్
డోర్నకల్ కాంగ్రెస్ టికెట్‌పై ఆ పార్టీ కార్యకర్తల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఈ సారి టికెట్ నెహ్రూ నాయక్‌కే వస్తుందంటూ కొందరు, రామచంద్రునాయక్‌కే కేటాయిస్తారని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. నామినేషన్ల ప్రారంభానికి ఇంకా ఐదు రోజులే ఉండడం, ఇప్పటికీ క్యాండిడేట్ ఎవరో తేలకపోవడంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.