
ఈ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అందుకే రోడ్ల పక్కన అట్రాక్షన్, గార్డెన్లలో అందం కోసం కోనో కార్పస్ చెట్లను పెంచడం మొదలుపెట్టారు. కానీ.. అవి పెరిగి పెద్దయ్యాకే అసలు సమస్యలు మొదలయ్యాయి. దాంతో చాలా ప్రాంతాల్లో వాటిని నరికేసే పనిలో పడ్డారు. ఇంతకీ వాటివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఎక్స్పర్ట్స్ ఎందుకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?
కోనో కార్పస్ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. దాని మీద పిట్ట కూడా కూర్చోదు. అవి ఎక్కడ కనిపించినా తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా” ఇవి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో అన్న మాటలు. ఆయనే కాదు.. ఎంతోమంది పర్యావరణవేత్తలు ఈ చెట్ల విషయంలో ఆందోళనలు వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఈ చెట్టు వల్ల కలిగే ముప్పు అలాంటిది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వేల కోనోకార్పస్ చెట్లను నరికేశారు.
విదేశీ మొక్క
శంఖు రూపంలో(కోన్ ఆకారం)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండే కోనోకార్పస్ చెట్టు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, కరేబియన్‌లోని తీర ప్రాంతాల్లో సహజంగా పెరుగుతుంది. దీనికి ఉప్పు నీటిని తట్టుకుని పెరిగే సామర్థ్యం ఉంటుంది. మొదట్లో ఇది ఫ్లోరిడా, మెక్సికో, బ్రెజిల్లో ఎక్కువగా కనిపించేది. అందమైన రూపం, ఎప్పుడూ పచ్చగా ఉండే స్వభావం వల్ల ప్రపంచాన్ని ఆకర్షించింది. దాంతో చాలా దేశాలు అట్రాక్షన్ కోసం ఈ మొక్కలని పెంచడం మొదలుపెట్టాయి.
అర్బన్ ఏరియాల్లో..
మన దగ్గర రోడ్ల పక్కన పచ్చదనం, చల్లదనం కోసం నాటడం మొదలుపెట్టారు. గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా నాటారు. ముఖ్యంగా మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. తక్కువ నీళ్లున్నా బతుకుతాయి. ఎండాకాలంలో కూడా ఆకుపచ్చగా కనిపిస్తాయి. పైగా ఈ చెట్లకు కనీస సంరక్షణ కూడా అవసరం లేదు.
అప్పుడప్పుడు నీళ్లు పెడితే సరిపోతుంది. మన దేశంలోనే కాదు.. చాలా అరబ్ దేశాల్లో వీటిని నాటారు. పచ్చదనంతో పాటు వాతావరణంలో వేడిని కంట్రోల్ చేస్తాయని, ఎడారిలో దుమ్ము, ధూళి, గాలితో పాటు వచ్చే ఇసుకను అడ్డుకుంటాయని కోనోకార్పస్‌ను పెంచడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వీటి గురించి పూర్తిగా తెలుసుకుని కువైట్, ఖతార్ లాంటి దేశాలు దీని పెంపకం, దిగుమతులను తగ్గించేశాయి.
ఆందోళన ఎందుకు?
ఇది మాంగ్రూవ్(మడ అడవులు) జాతికి చెందిన మొక్క. సాధారణంగా ఇలాంటి మొక్కలకు బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది. వేర్లు భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. వీటిని ఎక్కువగా రోడ్ల మధ్యలో, ఇరువైపులా నాటుతుంటారు. అంటే వీటి కిందే అండర్ గ్రౌండ్లో కమ్యూనికేషన్ కోసం వేసిన టెలిఫోన్ లైన్లు, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లు ఉంటాయి. కాబట్టి కోనోకార్పస్ బలమైన వేర్లు వాటి గుండా చొచ్చుకుని మరీ భూమి లోపలికి వెళ్తాయి. దాంతో పదే పదే రిపేర్లు చేయాల్సి వస్తుంది. అంతేకాదు.. వీటి వేర్లు గోడలు, పునాదులను కూడా డ్యామేజ్ చేస్తాయి.
భూగర్భ జలాలు
వీటివల్ల తలెత్తే మరో పెద్ద సమస్య ఏంటంటే.. వీటి వేర్లు లోతుల్లోకి వెళ్లి మరీ ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతాయి. ఏడేళ్ల క్రితం వడోదరలో కొన్ని వేల కోనో కార్పస్ చెట్లను నాటారు. కొన్ని రోజులకే అక్కడ భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోయాయి. అంతేకాదు.. నీళ్లన్నీ ఇదే తీసుకోవడం వల్ల దాని చుట్టు పక్కల ఇతర స్థానిక మొక్కలు, గడ్డి జాతులు పెరగవు. దాంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఈ చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు నీరు అందక, పంటల దిగుబడి కూడా తగ్గే ప్రమాదం ఉంది.
శ్వాసకోశ వ్యాధులు
కోనోకార్పస్ మొక్కలు పర్యావరణం మీదే కాదు.. మనుషుల ఆరోగ్యం మీద కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతాయని పరిశోధ నల్లో తేలింది. ఇవి సాధారణంగా సంవత్స రంలో రెండుసార్లు పుష్పిస్తాయి. వీటి పుప్పొడి చిన్న పరిమాణంలో ఉండటం వల్ల గాలిలో సులభంగా కలిసిపోతుంది. ఆ రేణువులను గాలితోపాటు పీల్చినప్పుడు జలుబు, దగ్గు, ఉబ్బసం, అలెర్జీలు వస్తాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవాళ్లు, పిల్లలు, వృద్ధుల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్లు ఎక్కువగా ఉండే ఏరియాలో ఇవి పుష్పించే సీజన్లో అలెర్జీల కేసులు పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతెందుకు ఇవి ఇతర జీవులకు కూడా అనుకూలమైనవి కావు.
పశువులు వీటి ఆకులను తినవు. తేనెటీగలు, సీతాకోక చిలుకలు కూడా వీటి దగ్గరకు వెళ్లవు. పక్షులు వీటిపై గూళ్లు కట్టుకోవడం పెద్దగా కనిపించదు. ఇలాంటి కారణాల వల్ల స్థానిక జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కోనో కార్పస్‌కు బదులు స్థానిక చెట్లను నాటాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రావి, వేప, కానుగ, జమ్మి లాంటివి ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేయడంతోపాటు పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి.