- ఆమె వ్యాఖ్యలు ప్రభుత్వ వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నాం
- బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : సినీనటులు సమంత, నాగచైతన్య డైవర్స్‌ను కేటీఆర్‌తో ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కొండా వ్యాఖ్యలపై సినీ, రాజకీయ రంగంలో అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నా సీఎం మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు.
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్‌గూడెంనకు చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య ఇంట్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. మహిళా మంత్రి అయిన కొండా సురేఖ మరో మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. మంత్రి హోదాలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నామని చెప్పారు.
కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఆజ్యం పోసిందే బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు. కొండా సురేఖకు ఎంపీ రఘునందన్‌రావు శాలువా కప్పి, పూలమాల వేసిన ఫొటోకు బీఆర్‌ఎస్ వర్గాలు అసభ్యకర పోస్టులు పెట్టి ఇష్యూకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఈ ఇష్యూకు తెరదించాలని కోరారు. హైడ్రా పేరుతో చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల పేదలు రోడ్డున పడ్డారని, దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీలు అశోక్‌గౌడ్, మహేందర్, యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, మండల అధ్యక్షుడు గుంటుపల్లి సత్యం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి పాల్గొన్నారు.