కష్టమే.. కానీ తప్పదు.. ఈ మాట చెప్పి ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..?

కష్టమే.. కానీ తప్పదు.. ఈ మాట చెప్పి ట్రంప్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..?
  • కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్​ వార్
  • అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్​
  • కెనడా, మెక్సికో వస్తువులపై 25%, చైనా గూడ్స్పై 10% టారిఫ్లు 
  • అమెరికాపై తామూ అంతే సుంకాలు విధిస్తామన్న కెనడా, మెక్సికో 
  • ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీవోలో సవాల్ చేస్తామన్న చైనా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్టుగానే టారిఫ్ వార్కు తెరతీశారు. కెనడా, మెక్సికో, చైనా దేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. కెనడా, మెక్సికో వస్తువులపై 25 శాతం, చైనా గూడ్స్ పై 10 శాతం టారిఫ్​లు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, నేచురల్ గ్యాస్, కరెంట్ పై మాత్రం 10 శాతం టారిఫ్​లే ఉంటాయని, ఈ టారిఫ్ లు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకూ కెనడా నుంచి 800 డాలర్ల కంటే తక్కువ విలువైన దిగుమతులపై ఎలాంటి సుంకాలు లేకపోగా.. ఇక నుంచి వాటిపైనా టారిఫ్​లు విధిస్తామన్నారు.

ఏటా వేలాది మంది అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న ఫెంటనిల్ డ్రగ్​ను, అమెరికా పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కొనసాగుతున్న అక్రమ వలసలను అడ్డుకోనందుకే ఈ సుంకాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్ బామ్ మండిపడ్డారు. అమెరికా చర్యకు ప్రతీకారంగా తాము కూడా యూఎస్ గూడ్స్ పై 25 శాతం టారిఫ్ లు విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాల్ చేస్తామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.దీంతో ఈ టారిఫ్ వార్ కారణంగా ఉత్తర అమెరికాలోని మూడు మిత్రదేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించడంతోపాటు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఫెంటనిల్ డ్రగ్, అక్రమ వలసలే కారణం.. 
ప్రాణాంతకమైన ఫెంటనిల్ డ్రగ్ ను చైనా పెద్ద ఎత్తున తయారు చేస్తూ తమ దేశంలోకి డంప్ చేస్తోందని, ఫలితంగా ఏటా వేలాది మంది అమెరికన్లు ఈ డ్రగ్ వల్ల చనిపోతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. కెనడా, మెక్సికో సరిహద్దుల గుండా కూడా ఈ డ్రగ్ అమెరికాలోకి చేరుతోందని అంటున్నారు. అలాగే కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలు జరుగుతున్నాయని.. ఇటు డ్రగ్స్ ను, అటు అక్రమ వలసలను ఆపేందుకు ఆ దేశాలు చర్యలు తీసుకోవడంలేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఈ విషయంపై ఆయన అనేక సార్లు స్పందించారు. ఫెంటనిల్ డ్రగ్, అక్రమ వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆ మూడు దేశాలపై టారిఫ్ లు విధిస్తామని పలు సార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ చెప్పినట్టే టారిఫ్ లు ప్రకటించి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. 

కష్టమే.. కానీ తప్పదు: ట్రంప్
కీలక మిత్ర దేశాలపై టారిఫ్ లు విధించడంతో అమెరికన్లకు ఆర్థికంగా కష్టాలు వస్తాయని, కానీ తన నిర్ణయం సరైనదేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. టారిఫ్ ల విధింపు అంశంపై ఆయన ఆదివారం ఉదయం ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా స్పందించారు. ‘‘మీకు కష్టంగా అనిపిస్తోందా? అవును. కొంత కష్టం కావచ్చు. కానీ ఆ కష్టాన్ని భరించడం సహేతుకమైనదే. మనం మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఈ మూల్యం చెల్లించక తప్పదు” అని అమెరికన్లను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘‘కెనడాకు వందల కోట్ల డాలర్ల సబ్సిడీలు ఇచ్చాం. ఇంత భారీ సబ్సిడీలు లేకపోతే ఒక సమర్థమైన దేశంగా మనగలిగి ఉండేది కాదు. అందుకే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరిపోవాలి. అప్పుడు ప్రజలపై తక్కువ ట్యాక్స్ లు, మిలిటరీపరంగా గట్టి రక్షణ ఉంటాయి. ఇక టారిఫ్ లు అనేవి అసలే ఉండవు” అని ట్రంప్ కామెంట్ చేశారు.

మీకోసం ప్రాణాలిచ్చాం.. మోసపోయాం: ట్రూడో 
కెనడా వస్తువులపై టారిఫ్ లు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. అమెరికన్ లను ఉద్దేశించి ఆయన ఒట్టావాలో మీడియా సమావేశంలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘‘నేడు అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనల్ని ఒక్కటిగా కలిపి ఉంచడానికి బదులుగా.. వేర్వేరుగా విడదీసింది” అని అమెరికన్లను ఉద్దేశించి ట్రూడో అన్నారు. ‘‘ఇరాన్ లో బందీల సంక్షోభం కానీ, అఫ్గానిస్థాన్ లో యుద్ధం కానీ.. మేం మీతోనే కలిసి పోరాడినం. మీకోసం ప్రాణాలు అర్పించాం. కాలిఫోర్నియా కార్చిచ్చుల నుంచి కత్రినా హరికేన్ వరకూ ప్రకృతి విపత్తులలో మీకు అండగా నిలిచాం. అమెరికా ప్రజలారా.. మేం ఎల్లప్పుడూ మీ పక్కనే నిలబడ్డాం. మీకు కష్టమొస్తే బాధపడ్డాం. కానీ ఇప్పుడు అమెరికన్ల చేతిలో మోసపోయామని కెనడియన్ ప్రజలం భావిస్తున్నాం” అని ఆయన అన్నారు.

‘‘ఈ నిర్ణయం సరిహద్దుకు రెండు వైపులా ఉన్న ప్రజలు, కార్మికులపై పెను ప్రభావం చూపిస్తుంది. దీనిని మేం కోరుకోలేదు” అని స్పష్టం చేశారు. అయితే, అమెరికా నిర్ణయానికి ప్రతిస్పందనగా తామూ అంతే స్థాయిలో టారిఫ్ లు విధిస్తామని ట్రూడో ప్రకటించారు. అమెరికా నుంచి కెనడాకు దిగుమతి అయ్యే ఆల్కహాల్, పండ్లు సహా 155 బిలియన్ డాలర్ల దిగుమతులపై 25% టారిఫ్ లు విధిస్తామని, ఇవి కూడా మంగళవారం నుంచే అమలులోకి వస్తాయన్నారు.

మెక్సికోకు క్రిమినల్ గ్యాంగులతో లింక్ పెడ్తరా?: క్లాడియా షేన్ బామ్   
అమెరికాలోకి డ్రగ్స్, అక్రమ వలసలకు తమను బాధ్యులను చేయడం దారుణమని మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్ బామ్ కూడా ఘాటుగా స్పందించారు. ‘‘మెక్సికన్ ప్రభుత్వానికి క్రిమినల్ ఆర్గనైజేషన్లతో లింకులు ఉన్నాయన్న అమెరికా వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ అమెరికాలో ఫెంటనిల్ ను నిజంగా అరికట్టాలని అనుకుంటే ఆ దేశ ప్రధాన నగరాల్లోని వీధుల్లో డ్రగ్స్ అమ్మకాన్ని అడ్డుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని క్లాడియా ఫైర్ అయ్యారు. అమెరికా నిర్ణయానికి ప్రతీకారంగా ఆ దేశ వస్తువులపై కూడా 25% టారిఫ్లు విధించాలని ఆర్థిక మంత్రిని ఆదేశించినట్టు పేర్కొన్నారు.