2024లో బిగ్ స్క్రీన్ పై కనిపించని తారలు వీళ్లే...

  2024లో బిగ్ స్క్రీన్ పై కనిపించని తారలు వీళ్లే...

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య స్టార్స్ అంతా కెరీర్‌‌‌‌  స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రతి హీరో హీరోయిన్ ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో  ఫ్యాన్స్‌‌ను పలకరించాలనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో అది వీలుపడటం లేదు.  అలా ఈ ఏడాది కనీసం ఒక్క మూవీతో కూడా బిగ్ స్ర్కీన్‌‌పై కనిపించని వారు చాలామందే ఉన్నారు.  ఈ లిస్టులో  స్టార్ హీరోల దగ్గర్నుంచీ యంగ్‌‌స్టర్స్, క్రేజీ  హీరోయిన్స్ సైతం ఉన్నారు. ఈ గ్యాప్ కావాలని ఇచ్చారా, తెలియకుండా వచ్చిందా అనేది  తెలుసుకుందాం. 

ఆచితూచి..

మెగాస్టార్ చిరంజీవి గతేడాది రెండు సినిమాలతో ఫ్యాన్స్‌‌ను ఖుషీ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని, అదే జోష్‌‌తో ‘భోళా శంకర్’గా ప్రేక్షకుల  ముందుకొచ్చారు. కానీ ఈ చిత్రానికి అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో  నెక్స్ట్ ప్రాజెక్టుపై మరింత దృష్టిపెట్టారు. దీంతో ఈ ఏడాది ఆయన నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌‌డ్రాప్ కావడంతో షూటింగ్‌‌తో పాటు విజువల్ వర్క్స్‌‌కు ఆలస్యమైంది.  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌‌తో  నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

శంకర్ డైరెక్షన్ కావడంతో.. 

ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ నుంచి మరే సినిమా రాలేదు. రెండేళ్లుగా ‘గేమ్ చేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. భారీతనానికి మారుపేరుగా సినిమాలు తెరకెక్కించే శంకర్ డైరెక్టర్ కావడంతో ఈ మూవీ రిలీజ్‌‌కు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టును  దిల్ రాజు నిర్మిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. రీసెంట్‌‌గా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీని చరణ్ స్టార్ట్ చేశాడు. ఇది కూడా వచ్చే యేడు  రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

పరిస్థితుల ప్రభావం

హీరోలతోపాటు పలువురు స్టార్ హీరోయిన్స్‌‌  సైతం  పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌‌పై  కనిపించలేదు. గతేడాది శాకుంతలం, ఖుషి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సమంత.. ఈ ఏడాది ఒక్క మూవీలోనూ  కనిపించలేదు. అయితే ప్రైమ్ వీడియోలో వచ్చిన  ‘సిటాడెల్‌‌ హనీ బన్నీ’  వెబ్‌‌ సిరీస్‌‌తో ఎంటర్‌‌‌‌టైన్ చేసింది. మరో స్టార్ హీరోయిన్ అనుష్క గతేడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా మళ్లీ ఈ ఏడాది బ్రేక్ తీసుకుంది. వచ్చే ఏడాది మాత్రం ఘాటీ, కథనార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అలాగే రీసెంట్‌‌ టైమ్స్‌‌లో తెలుగులో   ఓ వెలుగు వెలిగిన  పూజ హెగ్డే జోరు కూడా బాగా తగ్గింది. ఈ మధ్య కాలంలో  బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చేసినా అవి కూడా ఈ ఇయర్ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.  వచ్చే ఏడాది మాత్రం  బాలీవుడ్ మూవీ ‘దేవా’తో పాటు తమిళంలో సూర్య 44వ సినిమాలో కనిపించనుంది. ఇక తన పెళ్లి డాక్యుమెంటరీతో నయనతార ఓటీటీలో పలకరించగా ఒక్క సినిమాతోనూ ఆడియెన్స్ ముందుకు రాలేదు.  అలాగే విజయ్ నటించిన ‘గోట్’ మూవీలో స్పెషల్ సాంగ్‌‌తో అలరించిన త్రిష కూడా ఫుల్‌‌లెంగ్త్ సినిమాతో కనిపించలేదు. చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

ఎన్నికల కారణంగా.. 

బాలకృష్ణ గతేడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నా.. ఈ యేడు మాత్రం ఒక్క సినిమాని  కూడా విడుదల చేయలేకపోయారు.  ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగిన ఎన్నికలే దీనికి కారణం. ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, పార్టీ తరపున ప్రచారానికి సమయం కేటాయించడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినా ఏ మాత్రం స్పీడ్ తగ్గించకుండా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్‌‌’గా సంక్రాంతికి రాబోతున్నారు. అలాగే బోయపాటితో ‘అఖండ2’ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయడంతో వచ్చే ఏడాది బాలయ్య నుంచి రెండు సినిమాలు రావడం ఖాయం అని తెలుస్తోంది.  

అలాగే పవన్ కళ్యాణ్ గతేడాది ‘బ్రో’ తర్వాత ఏ మూవీతోనూ ఆడియెన్స్ ముందుకు రాలేదు. ఏపీలో జరిగిన ఎన్నికల కారణంగా షూటింగ్‌‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే ఆయన కమిట్ అయిన  హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌‌సింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.  

కావాలని కాదు.. 

యంగ్ హీరోల చాలామంది సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాలేదు.   అలాగని వీళ్లంతా ఖాళీగా లేరు. షూటింగ్స్‌‌తో బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది వీరి సినిమాలన్నీ వరుసగా విడుదల కానున్నాయి.  ప్రస్తుతం  నాగ చైతన్య ‘తండేల్’చిత్రంతో బిజీగా ఉన్నాడు.  చందూ మొండేటి రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇక నితిన్ హీరోగా రూపొందిన ‘రాబిన్ హుడ్‌‌’ కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల  కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా చివరి  నిమిషంలో వాయిదా వేశారు. అలాగే అడివి శేష్‌‌ నుంచి  గూఢచారికి సీక్వెల్‌‌గా జి2, డెకాయిట్‌‌ సినిమాలు రానున్నాయి.

ఇక కళ్యాణ్ రామ్ హీరోగా  ప్రదీప్‌‌ చిలుకూరి డైరెక్షన్‌‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇది వచ్చే ఏడాది ఫస్టాఫ్‌‌లో రిలీజ్ కానుంది.  ఇక సాయి దుర్గ తేజ్‌‌ నుంచి కూడా ఈ ఏడాది సినిమా రాలేదు. ప్రస్తుతం అతడు కె.పి.రోహిత్‌‌ దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య నుంచి కూడా కొత్త చిత్రమేదీ ఈయేడు రాలేదు. ఆయన రీసెంట్​గానే రామ్‌‌ దేశిన దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టాడు.  మంచు విష్ణు కూడా తన డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’  కోసం చాలా టైమ్ తీసుకుని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌‌ తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు అవుతుంది. ప్రస్తుతం తను  టైసన్‌‌ నాయుడు, భైరవం చిత్రాల్లో నటిస్తున్నాడు. యూత్‌‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టికి ఈ ఏడాది చేయికి గాయమవడంతో తననుంచి కూడా ఏ సినిమా రాలేదు. త్వరలోనే ‘అనగనగ ఒక రాజు’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న  అఖిల్‌‌ అక్కినేని  ప్రస్తుతం ఓ యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటిస్తున్నాడు. మురళీ కిశోర్‌‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే  ఉప్పెన, కొండపొలం సినిమాలతో ఆకట్టుకున్న  వైష్ణవ్‌‌ తేజ్‌‌ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నాడు.