ఇంజనీరింగ్​ ఫీజులు  అడ్డగోలుగా పెంచుతరా!

రాష్ట్రంలో ఈ ఏడాది 172 ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతులు పొందాయి. అందులో 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కాగా, మిగిలిన 15 ప్రభుత్వ కాలేజీలు. ఇవి వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యను జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ యూనివర్సిటీలన్నింటిలో బోధించే విద్య ఒక్కటే అయినా, రెండు రకాల కోర్సుల పేరుతో ఫీజుల మోత మోగిస్తున్నాయి. అవి రెగ్యులర్ కోర్స్ లు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అండ్‌‌‌‌ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఈ రెండింటిలో బ్రాంచ్​లు, బోధనా విధానం, సబ్జెక్టులు అన్నీ సమానంగా ఉన్నా, వేర్వేరు కోర్సుల పేరు చెప్పి ఫీజులు పెంచడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులపై భారం పడుతోంది. విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సాధించిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ఎక్కువ ఫీజులు ఎలా కడతారు. యూనివర్సిటీ పరిధిలో కన్వీనర్ కోటాలో 3,645 సీట్లు ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రూ. 35 వేల నుంచి రూ.1,20,000 వరకూ పెంచారు. ఫీజులు ఇలా పెంచితే ఎవరి మీద భారం పడుతుంది? అది కట్టడం ఎలా సాధ్యం అవుతుంది? గతంలో ప్రభుత్వాలే ఫీజులు పెంచొద్దని జీవోలు జారీ చేసేవి. కానీ ఇప్పుడు ఇలా ఫీజులు పెంచుకుంటూ పోతే దానికి అర్థం ఏమిటి?
 యూనివర్సిటీల్లో ఈ వ్యత్యాసం ఎందుకు?
రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి. కానీ ఫీజుల చెల్లింపు ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధానం అనుసరిస్తున్నారు. ఒక్కో చోటా ఒక్కో ఫీజు వసూలు చేస్తున్నారు. జేఎన్టీయూహెచ్​ పరిధిలో ఒక్కో బ్రాంచీలో 60 సీట్ల చొప్పున ఏడు బ్రాంచీల్లో 420 సీట్లు ఉన్నాయి. అయితే ఈ బ్రాంచీల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ కోర్సులని, సెల్ఫ్​ ఫైనాన్స్‌‌‌‌ కోర్సులని కొత్తవి యాడ్‌‌‌‌ చేస్తూ ఏటా ఫీజులు పెంచేస్తున్నారు. మహిళా కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టడం ఏమిటి ? అంత ఫీజు ఎలా కడతారు? ప్రభుత్వమే వారి ఫీజులు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. లేదంటే ఆ కోర్సులను రెగ్యులర్ కోర్సుల కింద మార్చి విద్యార్థులపై ఫీజుల భారం తగ్గించాలి. రెగ్యులర్ కోర్సుల్లో సివిల్, ఐటీ వంటివి లేకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు.. సెల్ఫ్​ ఫైనాన్స్​ కోర్సుల్లో ఎక్కువ ఫీజులు చెల్లించి చేరలేకపోతున్నారు. దీంతో వారు ఆయా కోర్సుల్లో సీట్లు పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌‌‌‌లో రెగ్యులర్ కోర్స్ కింద 6 బ్రాంచీల్లో 320 సీట్లకుగాను ఏడాదికి రూ.35 వేల ఫీజు ఉంటే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద రెండు బ్రాంచీల్లో 120 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌‌‌‌కు రూ.1,20,000, మైనింగ్‌‌‌‌కు రూ.1,00,000కు ఫీజులు పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్‌‌‌‌ల్లో ఇలా లక్షల రూపాయల ఫీజు పెంచడంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌‌‌‌లో రెగ్యులర్ కోర్స్ కింద 3 బ్రాంచీల్లో 120 మంది విద్యార్థులకు ఏడాదికి రూ.35,000 ఫీజు ఉంటే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో రెండు బ్రాంచీల్లో 60 (30+30) మంది ఉంటే ఏడాదికి రూ.70 వేలు పెంచారు. ఇక్కడ చూస్తే రెగ్యులర్ కోర్స్‌‌‌‌లో రెండు బ్రాంచీల్లో (ఫుడ్ టెక్నాలజీ, టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ టెక్నాలజీ) 30 చొప్పున 60 సీట్లు, అదే బ్రాంచీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద 30 చొప్పున 60 సీట్లు పెట్టి అధిక ఫీజులు వసూలు పెట్టడం ఏమిటి ? అలాగే నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కూడా రెగ్యులర్ కోర్స్ కింద 3 బ్రాంచీల్లో 180 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35 వేల ఫీజు ఉంది. మొత్తంగా ఒకే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఫీజుల్లో ఇంత వ్యత్యాసం ఏమిటి? ఒక యూనివర్సిటీలో ఎక్కువగా ఫీజులు పెంచడం ఏమిటి? ఈ విషయంపై ఉన్నత విద్యా శాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఫీజుల పెంపును విరమించుకోవాలి. పాత ఫీజులనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేలు జరుగుతుంది.