ఆ ఫ్యాన్లు 10 నిమిషాలు పని చేసినా పొగంతా పోయేది
పవర్ ప్లాంట్ ప్రమాదంపై ‘వీ6 – వెలుగు’తో రిటైర్డ్ ఇంజినీర్ తిరుపతి రెడ్డి
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ఎడమ గట్టు పవర్ ప్లాంట్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కు లోపలి నుంచి కాకుండా బయట నుంచి కూడా ఆల్టర్నేట్ పవర్ సప్లైకు ఒక డీసీ ఉంటుందని, అది ఎందుకు ఆన్ కాలేదో తెలియడం లేదని రిటైర్డ్ ఇంజనీర్ తిరుపతి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ 10 నిమిషాలు పనిచేసినా పవర్ ప్లాంట్ లో పొగ ఖాళీ అయ్యేదన్నారు. శ్రీశైలం డ్యాం వెనకాల రివర్ సైడ్ రెండు పెద్ద జనరేటర్లు ఉంటాయని, ఇవి ఆటో సిస్టంలో పనిచేస్తాయని, ఇవి ఎందుకు ఆన్ కాలేదో అర్థం కావడంలేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. లైటింగ్ పర్పస్‌కు మాత్రమే యూపీఎస్ ఉపయోగిస్తారని, అదీ పోయిందని, మెయిన్ డీసీ సప్లైతోపాటు యూపీఎస్ పోయిందని పేర్కొన్నారు. లైట్ ఫెయిల్యూర్ కాకపోతే ఉద్యోగులంతా బతికేవాళ్లని చెప్పారు. పవర్ ప్లాంట్ ప్రమాద ఘటనపై వీ6–వెలుగుతో తి రుపతిరెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఆయన అక్కడ పనిచేశారు. తిరుపతిరెడ్డి మాటల్లోనే..
నాలుగు ఎస్కేప్ చానళ్లు ఉన్నయ్ ..
పవర్ ప్లాంట్ లో మొత్తం నాలుగు ఎస్కేప్ చానళ్లు ఉన్నాయి. లోపల చిక్కుకున్నవాళ్లు కిందికి దిగకుండా, వెనక్కి తిరిగి వెళ్లిపోతే బాగుండేది. కిందికి దిగడంతో చీకట్లో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఇంక్లాండ్ టన్నెల్ దాకా పైకి ఎక్కారు. అక్కడే వారు పడిపోయినట్లు అనిపిస్తోంది. అక్కడి వరకు రావడానికి చాలా స్ట్రైన్ తీసుకున్నారు. ఫైర్ మిషన్ ఉపయోగించలేదు. ఫైర్ క్రాష్ కాగానే సీవోటీ సిలిండర్స్ అప్లై చేశారు. అక్కడే ఫైర్ మిషన్ ఉంటుంది. అది ఆన్ చేయాల్సింది. అది చేయడానికి ఆలోచన రాకపోయి ఉండవచ్చు. సాధారణంగా పవర్ జనరేట్ చేసి, పవర్ గ్రిడ్ కు ఇస్తుంటారు. అదే మిషన్.. గ్రిడ్ నుంచి తీసుకుంటే రివర్స్ పవర్ అంటారు. అప్పుడు మిషన్ కచ్చితంగా కాలిపోతుంది. ఇక్కడ ఒకటి, రెండు, మూడు మిషన్లు అయితే ఏం కాకపోయేది. వీటిని పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో చూస్తే గానీ తెలియదు.
కాళేశ్వరానికి ఈ ముప్పు
టర్బైన్ల వద్ద డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరమణ సూచించారు. కాళేశ్వరంలో బాహుబలి పంపులు పెట్టారని, అవి కూడా చాలా హైట్‌కు పోవాల్సి వచ్చిందన్నారు. దానికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ లో అరెంజ్‌మెంట్స్ లేకపోవడం శోచనీయమన్నారు. పవర్ ప్లాంట్ ను కాపాడాలని ఉద్యోగులు ప్రయత్నిం చి ప్రాణాలు విడిచారని, వాళ్లు అలా చేసి ఉండకపోతే మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉండేదన్నారు.