Mahasivaratri 2025: శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. జాగారం ఎందుకు చేస్తారు..

Mahasivaratri 2025: శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. జాగారం ఎందుకు చేస్తారు..

శివరాత్రి.. హిందువులకు అతి పెద్ద పండుగ.. ఆ రోజున శివుడిని ఆరాధిస్తారు.  అంతేకాదు.. అభిషేకాలు.. పూజలు..శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు.  ఇక ఆరోజు ఉపవాసం ఉండి..  రాత్రివేళ జాగారం ఉంటారు.  ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు. జాగారం ఎందుకు చేస్తారు. జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు.  శివరాత్రి జాగారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.. . .

హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఈ ఏడాది (2025)  శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది.  ఆరోజున శివుడిని ప్రత్యేకంగా పూజించి.. ఉపవాసం.. జాగారం చేస్తారు. 

మహాశివరాత్రి రోజున ... రోజంతా ప్రత్యేక  పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన  చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం  ముఖ్యమని పండితులు చెబుతున్నారు. 

పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు  మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. 

దేవతలు.. రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగాడని అనేక పురాణాల ద్వారా తెలిసిన విషయమే.  పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగడంలో కంఠం నీలంగా మారడంతో ఆయనను అప్పటి నుంచి నీలకంఠేశ్వర స్వామిగా పిలుస్తారు. 

శివుడి కంఠంలో హాలాహలం ఉండటంతో శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు  మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట.పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంతవరకు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.   మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి 12 గంటలకు స్వామి స్పృహలోనివచ్చారని.. అప్పుడు దేవతలు అందరూ సంతోషించి.. స్వామి వారికి కృతఙ్ఞతగా .. స్వామి కళ్యాణం జరిపించారని శివ పురాణంలో ఉంది.  

మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి,  జాగారం ఉంటారు.  జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. శివారాధనలో మూర్తి రూపం, లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు  ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.