సీఎంను విమర్శిస్తే ‘బండి’ కెందుకు కోపం? : జగదీశ్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బండి సంజయ్ కు ఎందుకొస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిలదీశారు. సీఎంరేవంత్ రెడ్డి, కేసీఆర్ కు మధ్య చీకటి ఒప్పందాలున్నాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం సూర్యాపేటలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంపై ఒక్కమాట కూడా పడనీయంత ప్రేమ బండికి ఎందుకు పొంగుకొస్తుందని ప్రశ్నించారు.

హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తుంటే బండి.. కేటీఆర్ ను అరెస్ట్ చేయమని అడగడం దురదృష్టకరమన్నారు. రైతులు, మహిళలను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్న కాంగ్రెస్ దుర్మార్గాలను ఏనాడూ బీజేపీ నిలదీయలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ మా శత్రువంటున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం ఎందుకు స్పందించడంలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్​నిజమైన ఏజెంటని ఆరోపించారు.