పార్లమెంట్ సమావేశాలు గత రెండు రోజులుగా ప్రధాని మోడీ వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా సాగుతున్నాయి. అదానీ ఇష్యూపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తూ మోడీ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోడీ మాట్లాడేప్పుడు కూడా విపక్షాలు అడ్డుచెప్పాయి. విపక్షాల ప్రశ్నలకు మోడీ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.
అయితే ఈ రోజు రాజ్యసభలో ప్రధాని మోడీ గాంధీ ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపించారు. భారతదేశ తొలి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ పేరును గాంధీ కుటుంబ సభ్యులు తమ పేరు చివర్లో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. వాళ్లు ఎందుకంత అవమానకరంగా భావిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. తామెక్కడైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తే గాంధీ కుటుంబ సభ్యులు అవమానకరంగా భావిస్తారని వ్యాఖ్యానించారు. నెహ్రూ అంత గొప్ప వ్యక్తి అయితే గాంధీ కుటుంబ సభ్యులు నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోరు..పెట్టుకుంటే వారికి సిగ్గు చేటా.? అని మోడీ ప్రశ్నించారు.
‘ప్రభుత్వ పథకాలకు కొందరి వ్యక్తుల పేర్లు, సంస్కృత పదాలు ఉండటంతో సమస్యలు ఉన్నాయి. గాంధీ, నెహ్రూ కుటుంబం పేరు మీద 600 ప్రభుత్వ పథకాలు ఉన్నాయని నేను ఒక రిపోర్టులో చదివాను. మరి వారి తరం నుండి వచ్చిన వారు నెహ్రూని ఇంటిపేరుగా ఎందుకు పెట్టుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. భయమా? లేక అవమానమా?’ అని మోడీ ప్రశ్నించారు.