రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. శాంతి చొరవకు ఒక్క భారత్ తప్ప ఏ దేశం ముందుకురావడం లేదు. ఉక్రెయిన్మాత్రం యుద్ధం ఆగిపోతుందనే ఆశతో ఉంది. కానీ, రష్యా ఖండాంతర క్షిపణి దాడితో ఉక్రెయిన్ను బెంబేలెత్తించింది. దీనికితోడు ఉత్తర కొరియా సేనలు కూడా రష్యాకు బాసటగా నిలిచాయి. కిమ్సైన్యం రష్యాకు రావడంతో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా, ఉక్రెయిన్‌కు అండగా నిలబడటంతో రష్యా తెలివిగా ఉత్తర కొరియాను తెరపైకి తెచ్చింది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య సత్సంబంధాలు లేవు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కార్యాచరణకు పూనుకున్నాడు. దానికి తగ్గట్లుగానే ఉత్తర కొరియా ఉక్రెయిన్‌పై దాడికి సహకరిస్తోంది.
రష్యా ఎంత తీవ్రమైన క్షిపణులు ప్రయోగిస్తే దానికి రెట్టింపుగా అమెరికా ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు సరఫరా చేస్తోంది. అమెరికా అండతోనే రష్యాపై ఉక్రెయిన్ దాడి చేస్తోంది. ఇలా అగ్రదేశాలు అభివృద్ధిపై దృష్టి సారించకుండా, పౌరుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రపంచ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఉత్తర కొరియా ఎప్పుడైతే రష్యాకు మద్దతు ఇచ్చిందో చైనా కూడా రష్యాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఉత్తర కొరియా, చైనా.. అమెరికాతో నేరుగా యుద్ధంచేసే సాహసం చేయలేక పరోక్షంగా రష్యాకు సహాయం చేస్తుండటంతో యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం స్థాయికి చేరుకుంటోంది. ఇది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామం. ‘ఉత్తర కొరియా సైన్యం మా ప్రాంతంలోని అతి పెద్దదైనా నిప్రో నగరంపై దాడి చేసింది. ఉక్రెయిన్‌లో నిప్రో అతిపెద్ద ప్రాంతం. దానిపై ఉత్తర కొరియా, రష్యాసేనలు మిళితమై దాడిచేసి పరిస్థితులను అస్తవ్యస్తం చేశాయి. ఇది మాకు తీరని నష్టం’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించాడు.
కీవ్‌లో ఖాళీ అవుతున్న ఎంబసీలు
రష్యా ఒకవైపు శాంతికి మేము సిద్ధం అంటూనే దాడులు కొనసాగిస్తోంది. నిజానికి రష్యాకు యుద్ధం ఆపాలని, శాంతికి బాటలు వేయాలనే తలంపు లేనే లేదు. రష్యా శాంతికి విఘాతం కలిగిస్తుందని, యుద్ధ విస్తరణే దానికి ముఖ్యమని ఉక్రెయిన్ వాదిస్తున్నది. మరోపక్క శాంతి పునరుద్ధరణకు భారత్ చేపట్టే చర్యలు ఓ కొలిక్కి రావడం లేదు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నారు. ఈ పరిణామం యుద్ధ నివారణకు ఆటంకంగా తయారైంది. ఈ నేపథ్యంలో రష్యా క్షిపణి దాడులు ఉధృతం చేసింది. రష్యా కీవ్‌లోని అమెరికా కార్యాలయంపై దాడికి ఉపక్రమిస్తుందని పక్కా సమాచారంతో తమ కార్యాలయాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేసింది. ఇతర దేశాల రాయబార కార్యాలయాలపై కూడా దాడి చేయవచ్చనే మిగతా దేశాలు కూడా తమ ఎంబసీలను ఖాళీ చేస్తున్నాయి. సంబంధాలు మెరుగుపరచుకోవాలనే సంకల్పంతో ఏర్పాటైనా కార్యాలయాలు ఇలా యుద్ధ భయంతో మూసుకుపోవటం శోచనీయం. వివిధ శిఖరాగ్ర సమావేశాల్లోనూ నాయకులు తమ ప్రసంగాలలో ప్రపంచ అభివృద్ధి తమ ప్రాధాన్యం అని చెపుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఒక్క భారత్ మాత్రమే చిత్తశుద్ధితో ముందడగు వేస్తోంది. ఏది ఏమైనా యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం భయానక పరిస్థితులు నెలకొంటాయి. ప్రపంచం ఆర్థిక, ఆహార సంక్షోభంలో పడిపోతుంది. అందుకే శాంతిని కాంక్షించే ప్రతి దేశం ముందుకు రావాలి. 20 జనవరి 2025న అమెరికా నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపి శాంతిబాట పట్టిస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేసే కృషి ద్వారా యుద్ధం తీవ్రం కాకుండా శాంతి ప్రక్రియకు మార్గం సుగమం అయితే ప్రపంచ దేశాలకు ప్రత్యక్ష, పరోక్ష ప్రమాదం తప్పుతుంది. యుద్ధం ఆగిపోతేనే ప్రపంచ దేశాల పురోగతికి బాటలు పరుచుకుంటాయి.
- కనుమ ఎల్లారెడ్డి