బంగారం రేటు ఎందుకు పెరిగిందంటే..

బంగారం రేటు ఎందుకు పెరిగిందంటే..

తులం 45 వేలకు పైనే

లాక్డౌన్ ముందు 39 వేలే

49 వేలు దాటిన బిస్కెట్​ బంగారం రేటు

ఇంకా పెరుగుతుందంటున్న ఎక్స్‌‌ పర్ట్​లు

పెండ్లిళ్లు, ఫంక్షన్లు లేకున్నా పెరుగుతున్న ధరలు

ఏడాదిలో తులం 52 వేలు దాటుతుందని అంచనాలు

‘ఈ మధ్య నీ మొహం బంగారమైంది’.. ‘ఇల్లంటే ఈసమెత్తు బంగారమైన ఉండాలె’ అంటరు.. బాగా నచ్చితే ‘మా బంగారమే’ అంటూ మురిసిపోతరు.. ఏమైనా బంగారం విలువ అసొంటిది. మళ్ల ఇప్పుడేమో బంగారం రేటు ఇంకిత బంగారమైపోతున్నది. రోజు రోజుకు పెరుగుతనే ఉన్నది. నగలకు వాడే బంగారం రేటు​ 45 వేలు దాటింది. బిస్కెట్​ బంగారం ధర అయితే 49 వేలు దాటేసింది. ఇంకొన్ని రోజుల్ల ఆర్నమెంట్ బంగారం ధర 50 వేలు దాటుతదని మార్కెట్​ ఎక్స్​పర్టులు చెప్తున్నరు.

ధర ఇంకా పెరగొచ్చు

లాక్ డౌన్ తో చాలా పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఆగిపోయాయి. ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్‌‌ దొరికింది కాబట్టి చాలా మంది ఫంక్షన్లు చేయాలనుకుంటున్నారు. బంగారం కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందు నగల బంగారం గ్రాము ధర 3,966 ఉండేది. ఇప్పుడు 4,566 దాటింది. గోల్డ్ రింగ్స్, నెక్లెస్​లు కొనేందుకు ఎక్కువగా వస్తున్నారు. ఫ్యూచర్ లో బంగారం ధర 50వేల దాకా పోవచ్చని అనుకుంటున్నం.

– మల్లెబాబు, సీఎంఆర్ గోల్డ్ మేనేజర్

హైదరాబాద్‌‌, వెలుగు: బంగారం రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్, లాక్​డౌన్, బంగారం ఉత్పత్తి ఆగిపోవడం, అమెరికా–చైనా మధ్య లొల్లి, క్రూడాయిల్​ రేట్లు పడిపోవడం.. ఇట్లా ఎన్నో కారణాలు బంగారం రేట్లను చుక్కలకు తీసుకుపోతున్నాయి. లాక్​డౌన్​ రిలాక్సేషన్స్​ వచ్చినా ఇంకా పెండ్లిళ్లు, ఫంక్షన్లు మొదలుకాలేదు. అయినా బంగారం రేటు మోత మోగుతోంది. ఆదివారం హైదరాబాద్‌‌లో పది గ్రాముల ఆర్నమెంట్​ బంగారం (22 క్యారెట్లు) రేటు 45 వేలు దాటింది. కొద్దిరోజుల్లోనే 50 వేలు దాటుందని షోరూముల మేనేజర్లు చెప్తుంటే.. మార్కెట్​ ఎక్స్‌‌పర్టులేమో అంతకన్నా పెరగొచ్చని అంటున్నారు. ఇక సేఫ్​ పెట్టుబడిగా చాలా మంది బిస్కెట్​ బంగారం కొనిపెట్టుకుంటున్నరని, అందుకే 24 క్యారెట్ల బంగారం రేటు 49 వేలు దాటిందని  ఎనలిస్టులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్​ పరిస్థితుల్లో తేడా వస్తే ఇది రూ.80 వేలకు కూడా చేరొచ్చంటున్నారు. మొత్తంగా మామూలు జనానికి బంగారం ముచ్చటెత్తుడే బంగారమయ్యేట్టు కనిపిస్తున్నది.

బంగారం ధర మామూలుగానే పెరుగుతూ ఉంటుంది. 1964లో తులం 63.25 రూపాయలున్న రేటు ఇప్పుడు 49 వేలు దాటింది. జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం రేటు 46 వేలకు చేరింది. బంగారాన్ని జ్యువెలరీతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇతర ఇండస్ట్రీలలో వినియోగిస్తారు. రేట్లలో అప్పుడప్పుడు ఎక్కువ, తక్కువలు ఉన్నా మొత్తంగా పెరుగుతూనే ఉంటుంది. వినియోగం పెరుగుతుండటమే దానికి కారణం. అయితే ఇప్పుడు వినియోగం బాగా తగ్గినా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దానికి కారణం ఇప్పుడు బంగారాన్ని ఇన్వెస్ట్​మెంట్​గా చూడటం పెరిగిందని మార్కెట్​ ఎక్స్​పర్టులు చెప్తున్నారు. ప్రపంచంలో టాప్​ఐదు ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ ఆప్షన్స్‌‌లో గోల్డ్‌‌ ఒకటని.. జ్యువెలరీ కంటే కాయిన్స్‌‌, బిస్కట్స్​ రూపంలో బంగారం కొనడం పెరిగిందని అంటున్నారు. డాలర్​ తో రూపాయి మారకం రేట్లు పడిపోవడం కూడా మన దేశంలో రేట్లు పెరగడానికి కారణమైందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం డాలర్‌‌ తో రూపాయి మారకం 75.98 రూపాయలుగా ఉంది. ఇంటర్నేషనల్​గా బంగారం రేట్లను డాలర్లలో నిర్ణయిస్తారు. రూపాయితో డాలర్​ రేటు పెరిగినప్పుడల్లా బంగారం రేటు కూడా పెరుగుతుంటుంది.

పెట్టుబడి ప్లాన్​తో..

వరల్డ్‌‌ గోల్డ్‌‌ కౌన్సిల్‌‌ అంచనా ప్రకారం భవిష్యత్తులో జనం బంగారం కొనుగోళ్లపై భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. 2016లో బంగారంపై ఇన్వెస్ట్​మెంట్లు 28 శాతం పెరిగితే.. అది 2019 నాటికి 33 శాతానికి చేరిందని గోల్డ్‌‌ కౌన్సిల్‌‌ చెబుతోంది. త్వరలోనే 52 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. గోల్డ్​ కౌన్సిల్‌‌ చేసిన ఒక సర్వే ప్రకారం.. 21 శాతం జనం బంగారంపై పెట్టుబడులు పెడితే దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయని నమ్ముతున్నారు. మరో 24 శాతం మంది ఎప్పుడైనా అమ్ముకునేందుకు వీలుంటుందని, మరో 27 శాతం గ్యారంటీ ఇన్‌‌కం ఉండే ఇన్వెస్ట్​మెంట్​అని భావిస్తున్నారు. 28 శాతం మాత్రం హైరిస్క్‌‌, హైరిటర్న్స్‌‌ ఉండే ఇన్వెస్ట్​మెంట్​గా చూస్తున్నారు. లాక్‌‌ డౌన్‌‌ రిలాక్సేషన్‌‌ తో తెరుచుకున్న గోల్డ్‌‌ షాపులకు వస్తున్న కస్టమర్లను పలకరిస్తే.. ‘ఎందుకైనా మంచిదని కొనిపెట్టుకుంటున్నా’మని చాలా మంది చెప్తుండటం గమనార్హం. కొందరు మాత్రం ఫంక్షన్ల కోసం కొంటున్నామని చెప్తున్నారు.

ఎప్పుడెంత పెరిగింది?

1970–80 సమయం నుంచీ బంగారానికి డిమాండ్​ పెరిగింది. అయితే 2000వ సంవత్సరం నుంచి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 2001 ఏప్రిల్‌‌ లో ఇంటర్నేషనల్​గా ఒక ఔన్స్‌‌ (28.35 గ్రాములు) 250 డాలర్లు ఉంటే.. 2011 నాటికి 1,900 డాలర్లకు చేరుకుంది. అదే మన దగ్గర 10 గ్రాముల బంగారం రేటు 2001లో రూ.4,300 ఉండగా.. 2011 నాటికి రూ. 26,400కు చేరుకుంది. 2012లో 31 వేలు దాటింది. తర్వాతి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. 2018లో రూ. 31,438కు.. 2019లో సగటున రూ. 35,220కు చేరింది. ఈ ఏడాది లాక్‌‌డౌన్‌‌కు ముందు రూ.40 వేల దగ్గర ఉండేది. ఈ రెండు నెలల్లోనే ఏకంగా 25 శాతం వరకు పెరిగి ఆదివారం నాటికి రూ.49 వేలకు చేరింది. ఆర్నమెంట్‌ గోల్డ్‌ రూ. 46 వేలు దాటింది.

కరోనాతో గట్టి ఎఫెక్ట్

బంగారం ధరలు బాగా పెరగడానికి కరోనా ఎఫెక్ట్​ కారణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ వ్యాప్తి, ఇండస్ట్రీలు మూతపడటం, ఫైనాన్షియల్​ పరిస్థితులు, దేశాల మధ్య విభేదాలు వంటివన్నీ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి.

కరోనా వ్యాప్తితో చాలా దేశాలు లాక్​డౌన్​ ప్రకటించడం, కంపెనీలు మూతపడటంతో బంగారం ఉత్పత్తి మరింతగా తగ్గిపోయింది. ఖనిజాన్ని తవ్వి తీసినా.. దాని ప్రాసెసింగ్, బిస్కట్లు, కాయిన్లుగా మార్చడం వంటివేవీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్న బంగారాన్నే అమ్మడం, కొనడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గోల్డ్‌‌ రిజర్వులు 26 శాతం తగ్గాయని వరల్డ్‌‌  గోల్డ్‌‌  కౌన్సిల్‌‌ అంచనా వేసింది.

లాక్​డౌన్​తో ఇండస్ట్రీలు మూతపడటం, నష్టాల్లోకి వెళ్తుండటంతో వాటి షేర్ల ధరలు పడిపోయాయి. ఇదే టైమ్ లో రియల్​ఎస్టేట్​ రంగంపైనా ఆశలు తగ్గిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లంతా గోల్డ్​ కొంటున్నారు. దీంతో డిమాండ్​ పెరిగి రేట్లు చుక్కలను తాకుతున్నాయి.

అమెరికా–చైనా మధ్య విభేదాలు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా బంగారం రేట్లపై ఎఫెక్ట్​ చూపుతోంది. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌లో బంగారు బిస్కెట్లు, కాయిన్లపై పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు ఆరు శాతం తగ్గగా.. ఇప్పుడు ఏకంగా 36 శాతం పెరగడం గమనార్హం. మన దేశంలోనూ బంగారు ఆభరణాల కంటే బిస్కెట్లు, కాయిన్లను కొనడం పెరుగుతోందని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు.

For More News..

టెస్టుల నుంచి మరణాల దాకా అన్నీ దాచుడే..

మరో ఐదురోజులు వడగాడ్పులు

బర్త్‌‌ డేకు పిలిచి.. మత్తు మందు కలిపి