
ఒకవైపు టారిఫ్ లతో ప్రపంచ దేశాలకు షాక్ మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్ సొంత దేశాన్ని కూడా వదలటం లేదు. వివిధ దేశాలకు అందిస్తున్న సహాయక నిధులను నిలిపివేస్తూ, ఆయా ఏజెన్సీలలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించిన ట్రంప్.. ఈసారి సొంత దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి షాక్ ఇచ్చారు. సోమవారం (ఏప్రిల్ 14) హార్వార్డ్ యూనివర్సిటీకి నిధులు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వార్డ్ యూనివర్సిటీకి నిధులు నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌజ్ నిబంధనలను అంగీకరించని యూనివర్సిటీకి నిధులు నిలిపివేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. మొత్తం 2.2 బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేయడం షాకింగ్ కు గురిచేసింది. అంతేకాకుండా 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులను కూడా ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
యూనివర్సిటీలో జరుగుతున్న యూదు వ్యతిరేకతపై చర్యలు తీసుకోనందుకు, అదేవిధంగా వైట్ హౌజ్ సూచించిన నిబంధనలకు అంగీకరింక పోవడం వలన యూనివర్సిటీకి అందాల్సిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్లు యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగం ప్రకటించింది.
ఎందుకు నిధులు నిలిపి వేశారు?
యూనివర్సిటీలో భారీ ఎత్తున అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు, సంస్కరణలను సూచిస్తూ శుక్రవారం (ఏప్రిల్ 11) ట్రంప్ అధికారిక యంత్రాంగం హార్వార్డ్ యూనివర్సిటీకి లేఖ రాసింది. యూధు వ్యతిరేకతను (anti-Semitism activities) నిరోధించేందుకు పాలసీల్లో మార్పులు తీసుకురావాల్సిందిగా సూచించింది. అదేవిధంగా కొన్ని స్టూడెంట్ క్లబ్స్ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా కూడా సూచనల్లో పేర్కొంది. అయితే ఈ నిబంధనలను యూనివర్సిటీ అంగీకరించలేదు. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులోకోబోమని తేల్చిచెప్పింది.
మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్, ఉద్యోగుల నియామకం, స్టూడెంట్స్ పై ఆడిట్ నిర్వహించడం మొదలైన అంశాలలో మార్పులు సూచిస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీకి నిబంధనలు విధించింది. యూనివర్సిటీ స్యయంప్రతిపత్తిపై దెబ్బకొట్టేలా ఉన్న ఈ నిబంధనలకు యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో యూనివర్సిటీకి రావాల్సిన భారీ నిధులను నిలిపివేసింది ట్రంప్ పాలనా యంత్రాంగం.