మణిపూర్ లో ఇద్దరు మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించినా ప్రధాని మోదీ మౌనం వీడట్లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా లోక్ సభలో అవిశ్వాసం పెట్టింది. చర్చ సందర్భంగా అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రధాని మోడీపై మాటల దాడి చేశారు. మణిపూర్ లో 150 మంది చనిపోయినా ఇప్పటి వరకు ప్రధాని ఎందుకు మౌనం వీడట్లేదని ప్రశ్నించారు. 80 రోజుల తర్వాత అది కూడా 30 సెకన్లే మాట్లడారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైనందుకే మోదీ మాట్లాడటం లేదన్నారు. ఎంత మంది మాట్లాడినా ప్రధాని మాట్లాడితే వేరుగా ఉంటుందన్నారు. మణిపూర్ కు రాహుల్ వెళ్లారు, విపక్ష ఎంపీలు వెళ్లారు మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
మణిపూర్ లో వందలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయని .. వేలాది మంది శిబిరాల్లో ఉన్నారని గొగొయ్ చెప్పారు. మణిపూర్ లో కేంద్ర ఇంటిలిజెన్స్ పూర్తిగా విఫలమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మణిపూర్ పరిస్థితులు చూసి చలించిపోయామని..అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టామని చెప్పారు గొగొయ్. మణిపూర్ సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. వాళ్ల బాధలను చూసేందుకు వెళితే ఫోటో సెషన్ కు వెళ్లారని ఎద్దేవా చేశారని విమర్శించారు. మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.
ALSO READ :తల్లిదండ్రులూ బీ కేర్ ఫుల్ : మీ పిల్లలకు ఈ సిరప్ ఇవ్వొద్దు..
మణిపూర్ లో ఇప్పటి వరకూ ఇంటర్నెట్ లేదు పిల్లలు స్కూల్ కు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజలు న్యాయం కోరుతున్నారన్నారు. పోలీస్ స్టేషన్లో చొరబడి ఆయుధాలు ఎత్తుకెళితే.. మణిపూర్ లో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మణిపూర్ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు,పిల్లలే ఉన్నారన్నారు. ప్రధాని తప్పు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరని.. మణిపూర్ ప్రజలకు న్యాయం జరగాలని కోరారు. ఎన్నికలున్నప్పుడల్లా రాష్ట్రాల్లో మోడీ సీఎంలను మార్చారని తెలిపారు.
రెజ్లర్లు రోడ్డెక్కినప్పుడు, అదానీ, చైనా ,రైతుల ఆందోళన, ఢిల్లీ అల్లర్లు, పుల్వామా దాడి ఇలా సమస్యలు వచ్చినప్పుడల్లా మోడీ మౌనం వహిస్తున్నారని అన్నారు. సంక్షోభ సమయంలో మౌనమే మోదీ సమాధానామా అని ప్రశ్నించారు. మణిపూర్ కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. తాము అధికారాన్ని కోరుకోవడం లేదని.. శాంతిని కోరుకుంటున్నామని అన్నారు.