న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపించిన యూఎస్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మూతబడుతోంది. పెట్టుకున్న గోల్స్ అన్నింటిని చేరుకున్నామని, అందుకే కంపెనీని మూసేస్తున్నామని హిండెన్‌బర్గ్ ఫౌండర్ నేట్ అండర్సన్ తాజాగా ప్రకటించారు. ‘అన్ని టార్గెట్లను పూర్తి చేశాం. గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న ఓ పోంజీ (ఫ్రాడ్) కేసుపై దర్యాప్తును తాజాగానే పూర్తి చేశాం. వివరాలను జనవరి 15 నఅధికారులతో పంచుకున్నాం’ అని వివరించారు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా హిండెన్‌బర్గ్‌ను మంచి స్థాయికి తీసుకెళ్లామని అన్నారు. స్టార్టింగ్ స్టేజ్‌లో కోర్టు కేసులతో ఇబ్బంది పడ్డామని గుర్తు చేసుకున్నారు.
ALSO READ | Hindenburg Research: అదానీని వణికించిన హిండెన్‌బర్గ్ సంస్థ మూసివేత
‘కంపెనీ మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. మూడు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాం. అప్పుడే తండ్రయ్యాను. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. భయమేసినా, ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నాను’ అని ఉద్యోగులకు రాసిన లెటర్‌లో అండర్సన్ పేర్కొన్నారు. తన టీమ్ 11 మందికి పెరిగిందని చెప్పారు. కాగా, అదానీ గ్రూప్ షేర్లను మానిప్యులేట్ చేసిందని, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని 2023 జనవరిలో హిండెన్ బర్గ్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు ఏకంగా 70 శాతం వరకు పడ్డాయి. గ్రూప్ మార్కెట్ క్యాప్ 150 బిలియన్ డాలర్లు (రూ.13 లక్షల కోట్లు) తగ్గింది.
అదానీ గ్రూప్ షేర్లు జూమ్..
హిండెన్ బర్గ్ మూతపడడంతో అదానీ గ్రూప్ షేర్లు గురువారం సెషన్‌లో భారీగా పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 9 శాతం లాభపడగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 8 శాతం, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 7 శాతం ర్యాలీ చేశాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్ షేర్లు కూడా గురువారం 6 శాతం వరకు లాభపడ్డాయి.