పూజలు లేని పండుగ ఏదో తెలుసా...

భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అనాదిగా జరుపుకొనే ప్రతి పండుగ కార్యంలో ఏదో ఒక సైన్స్‌ ఉంటుందనే విషయం నమ్మం ... కానీ ఇది నిజం. ఇప్పటికే పలు పండుగలు వాటి వెనుక ఉండే  సైన్స్‌ విషయాలను శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు.  ఇక మార్చి 25న జరుపుకొనే రంగుల పండుగ ... హోలీ పండుగ  గురించి వాటి వెనుక ఉన్న కథలు, సైన్స్‌ విషయాలు తెలుసుకుందాం…

 తెలుగు పంచాంగం ప్రకారం  కొద్ది రోజుల్లో శిశిర రుతువు  పూర్తయి  వసంత రుతువు ప్రారంభమవుతుంది. పాల్గుణం అంటే తెలుగు మాసాలలో  చివరి నెల . ఫాల్గుణ పౌర్ణమి రోజున ( మార్చి25) హోలీ పండుగ జరుపుకుంటాం. ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులకు ప్రతీకగా ఈ పండుగను అభివర్ణించవచ్చు. పండుటాకులు రాలిపోయి లేత ఆకుపచ్చ నుంచి మొదలు రకరకాల రంగుల మిశ్రమంతో కొత్త ఆకులు చిగురించే వేళ ఆసన్నమవుతుంది. ఈ సమయంలో ఆ వసంతానికి స్వాగతం పలికేలా ఈ పండుగను దేశంలో అద్భుతంగా చేసుకుంటారు. పేద, బడుగు, బలహీన, చిన్నా, పెద్ద,ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఆనందోత్సవాలతో ఆడుకునే పండుగ హోలీ. ఈ పండుగనాడు సంబురం మాటల్లో వర్ణించలేం. ప్రకృతి సిద్ధమైన రంగులతో ఈ ఆట ఆడుకుంటే అన్నిరకాలుగా మంచిది.

దేవతా పూజలతో సంబంధం లేని పండుగ 

హోళీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది సామాజికమైన పండుగ. ఇందులో పిండివంటలు చేసుకున్నామా, దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు. గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకుని, ఇరుగుపొరుగుతో సంతోషాలను పంచుకునే పండుగ. హోళీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం మూడు ఉన్నాయి అవి తెలుసుకుందాం…

రాధాకృష్ణుల సంబురాల పండుగ

రాధాకృష్ణుల సంబంధంగా చెప్పుకొనే హోళీ కథ చాలా సరదాగా ఉంటుంది. కృష్ణుడు నల్లనివాడు. తన చిన్నప్పుడు పూతన పాలు తాగడం వల్ల, కృష్ణుని మేని నీలమేఘపు రంగులోకి మారిపోయిందంటారు. మరి రాధేమో కృష్ణునికంటే కాస్త చాయగా ఉండేది. ఈ విషయమై కృష్ణునికి కాస్త ఈర్ష్యగా ఉండేదట. ఓసారి తన తల్లి యశోద చెంతకు చేరి తన మనసులో విషయం చెప్పాడట కన్నయ్య. దాంతో యశోద ‘మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి’ అని సలహా ఇచ్చిందట.

యశోద అలా చెప్పడం ఆలస్యం, చిలిపి కృష్ణుడు ఇలా రంగంలోకి దిగిపోయాడు. యశోదతో పాటుగా గోపికలదంరినీ రంగు నీళ్లలో ముంచెత్తాడు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా నిర్వహించుకుంటారు. హోళీ రోజున రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తరభారతదేశంలో చూడవచ్చు. హోళీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ కూడా ఈ సంబరాలు సాగుతాయి.

 హిరణ్యకశ్యపుడి …

 హోళికా దహనం అని కూడా అంటారు.  హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుల కథ చాలా మందికి తెలుసు.   నేలమీద కానీ.. నింగిలోకానీ.. ఇంటగానీ... బయటగానీ.. రాత్రిగానీ ...పగలుకానీ.. మనిషిచేత కానీ ...పశువు చేతకానీ... ఆయుధాలతోగానీ.... తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడనే రాక్షసునికి ఉన్న వరం. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషికాగా, అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు. ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాల మార్చాలని ప్రయత్నించిన హిరణ్యకశిపుడు, అన్నివిధాలా విఫలమై చివరికి ఉక్రోషంతో అతనికి మరణదండనను విధించాడు. హిరణ్యకశిపునికి హోళిక అనే చెల్లెలు ఉండేది. ఆమెను అగ్ని దహింపజాలదని ఓ వరం ఉంది.

హోళిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్లో కూర్చోపెట్టుకున్నట్లు నటించగానే, వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నారు. కానీ ఇతరులకు హాని తలపెడితే, హోళికకు ఉన్న వరం పనిచేయదనే విషయాన్ని మరచిపోయారు. దాంతో హోళిక వరం బెడిసికొట్టి, ఆమే అగ్నికి ఆహుతైపోయింది. హోళికా దహనం పేరట జరుపుకొనే ఆ పండుగే హోళీ.

కాముడి దహనం

 తెలుగునాట హోళీని కామదహనం అనీ, కాముడి పున్నమి అని పిలుస్తారు.  ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రుషులను, సత్పురుషులను, దేవతలను, ప్రజలను…. వాళ్లూ వీళ్లూ అని లేకుండా రాక్షసులు కాని వారందరినీ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుడు అమిత బలవంతుడు. పైగా శివుని సంతానం చేత తప్ప అతనికి మృత్యువు లేదన్న వరం కూడా ఒకటి ఉంది. ఇంకేం.. తారకాసురుని రాక్షసత్వానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. శివుడు చూస్తేనేమో ఘోర తపస్సులో ఉన్నాడు. కనీసం కళ్లు కూడా తెరవని సమాధిస్థితిలో ఉన్నాడు. మరి శివ సతి అయిన పార్వతి మీద అతనిలో మోహాన్ని పలికించడం ఎలా.

అందుకు స్వయంగా మన్మథుడే (కాముడు) పూనుకొన్నాడు. ఒక వసంతకాలాన, శివుడు యోగనిద్రలో ఉన్న వనాన… పార్వతీదేవి పూలు కోసుకుంటుండగా, కాముడు ఆయనను కమ్ముకున్నాడు. కళ్లు తెరిచి చూసిన శివుడు పార్వతిని చూసి ఎంతగా మోహించాడో, తన తపస్సుని భంగపరచిన మన్మథుని మీద అంతే కోపగించాడు. పట్టలేని కోపంతో శివుడు, తన మూడో కంటిని తెరవగా మన్మథుడు భస్మమైపోయాడు. ఆ ఇతివృత్తాన్ని గుర్తుచేసుకుంటూ, కామదహనం పేరుతో ఈ పండుగనాడు మంటలు వేసుకుంటారు.

కారణాలు ఏవైనా… రంగులతోనూ, మంటలతోనూ జరుపుకొనే ఆ రోజు హోళీ  పండుగ రోజు.  కామదహనం పేరుతో మంటలు వేసి, ఆ మంటల చుట్టూ నలుగురూ కలిసి ఆడిపాడే సంప్రదాయం ప్రపంచమంతా ఉన్నదే. కానీ ఆ సంప్రదాయానికి భోగిపేరుతోనో, హోళీ పేరుతోనో ఓ అందమైన రూపాన్నిస్తారు.  అంతేకాని ఈ పండుగకు పలానా దేవుడికి పూజ చేయాలనే  నియమం కాని.. ఆచారం కానీ.. పురాణ గాథ కాని ఎక్కడా లేదు.  అనాదిగా ఓ పండుగలా కొనసాగిస్తున్న ఘనత మాత్రం భారతీయ సంస్కృతికి మాత్రమే దక్కింది. ఇక అరమరికలు లేకుండా రంగులు చల్లుకునే ఆచారం కూడా, ఏ ఆధునిక ఉత్సవానికీ తీసిపోదు.

ఈ పండుగను ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన రంగులతో, పదార్థాలతో తయారుచేసిన సహజ రంగులనే వాడాలి. కానీ ఆధునిక పోకడలు విపరీతమై రసాయనాలు, కృత్రిమ పదార్థాలతో తయారుచేసిన వాటిని వాడి అనేక రోగాలు, కండ్లుపోవడం వంటి దుష్పరిమాణాలు కొని తెచ్చుకుంటున్నారు. వీటిని వీడి మన పూర్వీకల బాటలో పండుగ చేసకుంటే ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి.