ప్రజల పక్షాన మాట్లాడితే  ఎందుకింత అసహనం

ప్రజల పక్షాన మాట్లాడితే  ఎందుకింత  అసహనం

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజల సమస్యలను పరిష్కరించే సంగతి అటుంచితే.. అసలు వాటిని చెప్పుకుందామన్నా వినే దిక్కు కనిపించడం లేదు. ప్రజల పక్షాన ఎవరు మాట్లాడినా అధికార పార్టీ తీవ్ర అసహనానికి లోనవుతోంది. ప్రజల గోస గురించి నోరు తెరిస్తే చాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వారే పెద్ద పెద్ద మందను వేసుకుని ఎదురుదాడికి దిగుతున్నారు. తమ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. ఎంతటి వారిని అయినా వ్యక్తిగతంగా, అసభ్యంగా ఇష్టం వచ్చినట్లు టీఆర్ఎస్​ నేతలు తిడుతున్నారు. కొంచెం మర్యాదస్తులు అయితే రాజకీయాలు అంటేనే అసహ్యించుకునే విధంగా అధికారంలో ఉన్న వారు వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణలో తిట్ల పురాణం కూడా మొదలయ్యిందంటే అతిశయోక్తి కాదు. ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న టీఆర్ఎస్, అది మొదలు పెట్టిన రాజకీయ తిట్ల పురాణానికి కూడా ద్విదశాబ్ది ఉత్సవాలు అంతకంటే ఘనంగా జరపాలేమో.
హామీలు అమలు చేయాలంటే తిడుతున్నరు 
చిలకమర్తి వారి ప్రహసనాల్లో ఒకచోట ఇలా రాస్తారు. ఒక ఊళ్లో పేరు మోసిన డాక్టర్​ ఒకరు ఉన్నారు. ఆయన ఆపరేషన్లు చేయడంలో ప్రావీణ్యుడు. నిపుణుడు కూడా. పెద్ద పెద్ద కణితులకు తన నైపుణ్యంతో శస్త్రచికిత్సలు చేసేవారు. లెక్కకు మించిన మందికి ఇలా ఆపరేషన్లు చేసి కణితులు తొలగించారు. అలాంటి పేరు మోసిన వైద్యుడికే ఒక కణితి వచ్చింది. కణితిని తానే తొలగించే శస్త్రచికిత్స చేసుకోలేరు కనుక.. మరో వైద్యుడిని ఆశ్రయించి, చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇది తెలిసి ఒక మిత్రుడు మన సుప్రసిద్ధ వైద్యుడిని పరామర్శించడానికి వెళ్లారు. అప్పుడాయన మాట్లాడుతూ ‘నేను లెక్కకు మించిన కణితులను తొలగించాను. ఎప్పుడూ ఇంత నొప్పి ఉంటుందని ఎరుగను’ అని అన్నాడట. ఆ డాక్టర్ అన్నట్టుగానే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ మాటలున్నాయి. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేస్తుంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత ఎన్ని తిట్లు తిట్టినా లేని నొప్పి, రేవంత్ రెడ్డి ప్రశ్నలకు కేసీఆర్ కు కలుగుతోందేమో. 
ఉద్యమ సమయంలోనూ ఇదే వైఖరి
ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్లు తిట్టడంలోనూ, వాటిని సమర్థించుకోవడంలోనూ సుప్రసిద్ధుడనే సంగతి లోకానికి తెలుసు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు చెప్పుకుంటే అటు ఆంధ్రా నాయకులు, ఇటు తెలంగాణ నాయకులు ఎందరో కేసీఆర్ నోటికి బలి అయ్యారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే కాకుండా అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు తెలంగాణకు చెందిన వారిని కూడా వదిలిపెట్టకుండా మన యాసలోనే తిట్టిన తిట్లు, వాడిన భాష ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడానికే ఆయన అలా మాట్లాడారని అప్పట్లో అన్ని వర్గాలు తమను తాము సమర్థించుకున్నాయి. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత, కేసీఆర్ సీఎం అయినా అదే ఒరవడిని కొనసాగిస్తున్నట్లుగా మనకు అనుభవంలోకి వచ్చింది.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించొద్దా?
ప్రభుత్వ వైఫల్యాలు, టీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఎవరు మాట్లాడినా బజారు భాష, అభ్యంతరకరమైన తిట్లు అందుకోవడానికి ఆ పార్టీ నేతలు సిద్ధం అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇంద్రవెల్లిలోనూ, రావిర్యాలలోనూ దళిత అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ రెండు సభల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మందలు మందలుగా తిట్ల దండకం అందుకున్నారు. ఇక కాంగ్రెస్ నిర్వహించిన మూడు చింతలపల్లి సభకు అనేక అవాంతరాలు కల్పించేందుకు మంత్రి మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ఎవరు ప్రశ్నించినా నోటికొచ్చినట్లుగా తిడతాం అనే సందేశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రులు ఇస్తున్నట్టుగా ఉంది. వీరి తిట్లు, శాపనార్థాలు వింటుంటే ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నవారికి అయినా ప్రస్తుత రాజకీయాల మీద విరక్తి కలగడం ఖాయం. తమ పార్టీని, తమ నాయకుడిని, తమను ఎవరూ విమర్శ చేయొద్దు, వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు అనే విధంగా టీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి ఉంది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు నిలయమైన ప్రగతిశీల తెలంగాణలో కేసీఆర్, ఆయన పరివారం అరాచకాలు ఇకపై సాగవని గ్రహిస్తే మంచిది.

ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకుంటున్నరు
తెలంగాణ ఏర్పాటైన వెంటనే రెండు మీడియా చానెళ్ల మీద, ఒక పత్రిక మీద కేసీఆర్ తీవ్ర అసహనం ప్రదర్శించారు. ప్రశ్నించిన పాపానికి ఏడు నిలువుల లోతు పాతిపెడ్తా అంటూ నిప్పులుగక్కారు. అదే క్రమంలో తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న స్వామి గౌడ్, సీఎల్పీ మాజీ నాయకుడు​ జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, గీతారెడ్డి లాంటి వారి మీద అనుచితంగా కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రజల పక్షాన ప్రశ్నించిన పాపానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా టీఆర్ఎస్ నేతలు వదల్లేదు. ఇక మందకృష్ణ మాదిగ, తీన్మార్ మల్లన్న వంటి వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారు. వీటి అన్నింటికీ కొనసాగింపుగానే బండి సంజయ్ మీద మైనంపల్లి హన్మంతరావు తిట్లు. ఇంద్రవెల్లి, రావిర్యాల, మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత దండోరా సభల తర్వాత రేవంత్ రెడ్డి మీద మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్​ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాలరాజు, సుమన్ వంటి వారి బూతులు. వీటిని ఏ ఒక్క అంశానికో పరిమితం చేసి చూడకుండా లోతుగా పరిశీలిస్తే కేసీఆర్, కేటీఆర్ అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతుంది. 

                                                                                                                                                                                        - బోరెడ్డి  అయోధ్యరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి