పాకిస్తాన్​కు నీళ్లు బంద్ .. రావి నదీ జలాల పంపిణీని నిలిపివేసిన కేంద్రం

శ్రీనగర్: నలభై ఐదేండ్లుగా ఎదురుచూస్తున్న షాపూర్ కంది డ్యామ్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. దీంతో రావి నది నుంచి పాకిస్తాన్​కు వెళ్లే నీళ్లకు మన దేశం బ్రేక్ వేసింది. ఆ నీళ్లను ప్రస్తుతం  కాశ్మీర్​లోని కథువా, సాంబా జిల్లాలకు తరలిస్తోంది. 

ఇదీ అసలు స్టోరీ.. 

సింధూ నదీ జలాలపై 1960లో పాకిస్తాన్, భారత్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్​కు చెందాయి. ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ డీల్ ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలు పూర్తిగా మన దేశానికే దక్కాయి. అప్పటిదాకా పాకిస్తాన్​కు వెళ్తున్న రావి నదీ నీళ్లను మనమే వాడుకునేందుకు ఆ నదికి ఎగువన రంజిత్ సాగర్ డ్యామ్, దిగువన షాపూర్ కంది బ్యారేజీ నిర్మించాలని 1979లో పంజాబ్, జమ్మూకాశ్మీర్  ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్ట్​ల నిర్మాణానికి 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేయగా, 1998 నాటికి పూర్తికావాల్సింది. ఇందులో రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం 2001లోనే పూర్తయింది కానీ, షాపూర్​ కంది ప్రాజెక్ట్ పలు కారణాలతో నిలిచిపోయింది.

 దీంతో రావి నదీ నీళ్ల ప్రవాహం పాకిస్తాన్​కు కొనసాగింది. 2008లో షాపూర్ కంది ప్రాజెక్ట్​ను అప్పటి ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్​గా ప్రకటించి, నిర్మాణాన్ని తిరిగి 2013లో ప్రారంభించింది. 2014లో పంజాబ్, జమ్మూకాశ్మీర్ వివాదాల కారణంగా నిర్మాణం మరోసారి నిలిచిపోయింది. చివరకు 2018లో కేంద్రం మధ్యవర్తిత్వంతో ఇరు రాష్ట్రాలను ఒప్పించి నిర్మాణాన్ని స్పీడప్ చేసింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికావడంతో ఆదివారంనుంచి పాకిస్తాన్​కు రావి నదీ నీళ్లను కేంద్ర సర్కారు నిలిపివేసింది.ఇన్నేండ్లుగా పాక్​కు వెళ్తున్న 1,150 క్యూసెక్కుల నీళ్లను ఇప్పుడు కాశ్మీర్​లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్​లో 20% జమ్మూకాశ్మీర్​కు ఇవ్వనున్నారు.