వామ్మో.. ఎయిర్​ పొల్యూషన్​తో ఇన్ని రకాల వ్యాధులు వస్తాయా?

వామ్మో.. ఎయిర్​ పొల్యూషన్​తో ఇన్ని రకాల వ్యాధులు వస్తాయా?

కల్తీ ఫుడ్, కలుషిత నీళ్లు, అన్​హెల్దీ అలవాట్లతో ప్రపంచం ఎన్నో ఇబ్బందులు పడుతోంది. వాటికితోడు గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మన దేశంలోని చాలా నగరాల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి కరువైందని ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్ట్‌‌‌‌లో తేలింది. సిటీల్లోని ప్రజలు ప్రాణవాయువు కోసం గాలి పీలిస్తే.. దాంతోపాటే ప్రాణాలను హరించే విష వాయువులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతున్నాయి. 

స్విట్జర్లాండ్‌‌కు చెందిన గాలి నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూఎయిర్ ఈ మధ్య విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2024 ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 వాయు కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. అస్సాంలోని బైర్నిహాట్​ని ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా గుర్తించింది. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత రాజధాని నగరం కూడా ఇదే. అయితే.. 2023తో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఎయిర్​ పొల్యూషన్​ ఎక్కువగా ఉన్న దేశాల లిస్ట్‌‌లో 2023లో మన దేశం మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానం ఐదుకి చేరింది. 

17 శాతం మాత్రమే 

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో గాలి కలుషితం అవుతోంది. మన దేశంలోని 35 శాతం నగరాల్లో పీఎం2.5 స్థాయిలు డబ్ల్యూ హెచ్​వో సిఫార్సు చేసిన పరిమితి కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 17శాతం నగరాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఐక్యూఎయిర్​ సంస్థ 138 దేశాల్లోని 40,000 ఎయిర్​ క్వాలిటీ స్టేషన్స్​ నుంచి డేటాను సేకరించి, విశ్లేషించింది. దీని ప్రకారం.. చాడ్, కాంగో , బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా దేశాల్లో అత్యంత కలుషితమైన గాలి ఉంది. 

ఆయుర్దాయం తగ్గుతుంది 

పొగాకు తాగితే ఆయుర్దాయం తగ్గినట్టే.. నాణ్యమైన గాలి పీల్చకపోయినా తగ్గుతుంది. మన దేశంలో గాలి కాలుష్యం వల్ల ప్రతి మనిషి ఆయుష్షు 5.2 సంవత్సరాలు తగ్గుతోందని ఒక అంచనా. రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, పోషకాహారలోపంతో బాధపడే వాళ్ల మీద ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. గర్భస్థ శిశువుల ఆరోగ్యంపైనా విషవాయువు ప్రభావం ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల  ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది తమ ఆయుర్దాయం కన్నా ముందే చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ స్టడీ ప్రకారం.. 2009 –2019 మధ్య ఇండియాలో ఏటా 1.5 మిలియన్ల మంది గాలి కాలుష్యం వల్ల రోగాల పాలయ్యారు. 

శ్వాసకోశ వ్యాధులు

గాలి కాలుష్యం ఎఫెక్ట్‌ కొంతమంది ఆరోగ్యంపై వెంటనే పడినా.. చాలామందిలో ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువమందిలో నాసికా రంధ్రాల వాపు, ఇన్​ఫ్లమేషన్​ లాంటి సమస్యలు కనిపిస్తాయి. దీనివల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ఇక అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవాళ్లలో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఆస్తమా ఎటాక్స్, క్రానిక్​ అబ్​స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ)కి దారి తీస్తుంది. పిల్లల విషయానికి వస్తే.. కలుషితమైన గాలిలోని టాక్సిన్స్​ పిల్లల ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఆ తర్వాత ఊపిరితిత్తుల పెరుగుదలను అడ్డుకుంటాయి. చిన్నతనం నుంచి కలుషితమైన గాలి పీల్చేవాళ్లలో కొందరికి పెద్దయ్యాక ఉబ్బసం, సీవోపీడీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంటే.. దాని ఎఫెక్ట్‌ చూపించడానికి  కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. గాలి నాణ్యత కాస్త మెరుగ్గా ఉండే వేళల్లోనే బయటి పనులు చేసుకోవాలి. అంటే ఉదయం ట్రాఫిక్​ పెరగకముందే ఇంట్లో నుంచి బయల్దేరాలి. నెమ్మదిగా కదిలే ట్రాఫిక్‌లో కారులో వెళ్తున్నప్పుడు కిటికీలను మూసి ఉంచాలి.

గుండెపోటు

గాలి కాలుష్యం గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సూక్ష్మ కణాలు (పీఎం2.5), నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్​ఓ2) లాంటివి శరీరంలో ఇన్​ఫ్లమేషన్​కి కారణం అవుతాయి. దాంతో రక్త నాళాలు గట్టిపడి, సరిగా పనిచేయలేవు. దాంతోపాటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. 

గుండెను కాపాడుకోవడానికి పొల్యూషన్​ లెవల్స్​ ఎక్కువగా ఉన్నప్పుడు అవుట్​డోర్​ ఎక్సర్​సైజ్​ చేయకూడదు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌ పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. వీటివల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

నిస్తేజంగా..

గాలి కాలుష్యం చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాలుష్యం వల్ల చర్మం డీ హైడ్రేషన్​కు గురవుతుంది. నిస్తేజంగా, నీరసంగా మారుతుంది. ఎక్కువ కాలం గాలి కాలుష్యానికి గురైతే వృద్ధాప్య లక్షణాలు, స్కిన్​ సెన్సిటివిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు ముఖం మీద మొటిమలు కూడా వస్తుంటాయి. 

ఈ సమస్యల నుంచి బయటపడేందుకు రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి స్నానం చేయాలి. మాయిశ్చరైజర్​ వాడాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌‌గా ఉంచడానికి సరిపడా నీళ్లు తాగాలి. 

మెదడుకు దెబ్బ 

కొన్నిసార్లు గాలి కాలుష్యం మెదడులో ఇన్​ఫ్లమేషన్​కు కారణమవుతుంది. నాడీ సంబంధాల(న్యూరల్​ కనెక్షన్స్​)కు అంతరాయం కలుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దానివల్ల జ్ఞాపకశక్తి, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు దెబ్బతింటాయి.  కొందరిలో యాంగ్జైటీ, డిప్రెషన్​ పెరుగుతాయి. ట్రాఫిక్​ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌‌లు పెట్టుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కొంతైనా కాపాడుకోవచ్చు. 

కంటి అలెర్జీలు

ట్రాఫిక్, ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని గాలిలో పర్టిక్యులేట్​ మ్యాటర్​(కణిక పదార్థం), కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఉంటాయి. అవి కంటి అలెర్జీలను కలిగిస్తాయి. కండ్లకలక రావడంతోపాటు కంటిలోని రక్త నాళాలు ఉబ్బుతాయి. దాంతో కళ్ళు ఉబ్బి, ఎర్రగా కనిపిస్తాయి. కళ్లలో తరచూ దురదగా ఉంటుంది.