ఇపుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఫక్తూ రాజకీయమే

ఇపుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఫక్తూ రాజకీయమే

దేశంలోని రైతు సంఘాలను పిలిపించుకొని ప్రగతి భవన్‌‌లో చర్చించారు. జాతీయ పార్టీ పెట్టాలా? అని బహిరంగ సభల్లో ప్రజలను ప్రశ్నిచారు, కర్ణాటక నుంచి కుమారస్వామి, గుజరాత్ నుంచి శంకర్సింగ్ వాఘేలా  ప్రగతి భవన్ వచ్చి వెళ్లారు. పార్లమెంటులో టేబుల్ పైకి రాని విద్యుత్ బిల్లుపై  అసెంబ్లీలో చర్చ పెట్టారు. ప్రధానిని టార్గెట్ చేస్తూ సీఎం  కేసీఆర్ సుధీర్ఘ ప్రసంగమూ చేశారు. జాతీయ పార్టీ పెట్టమని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నదని కూడా చెప్పుకుంటున్నారు. నిజంగా ఫక్తూ రాజకీయంతో, బ్లేమ్ గేమ్  ల తో ఒక జాతీయ పార్టీ తయారవుతుందని అనుకుంటే, అఖిలేష్ లు, లాలూలు, మమతాలు ఎప్పుడో జాతీయ పార్టీలు పెట్టుకునేవారు కదా? జాతీయ పార్టీ  ప్రచారంపై ఉన్న ఆసక్తి, రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం కేసీఆర్‌‌‌‌కు ఎందుకు లేదనేదే ప్రజల్లో ఉన్న చర్చ.

ప్రొటోకాల్‌‌ అనేదే లే..

ఏడాది కాలంగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన  ఏ ఆహ్వానానికీ హాజరు కాకపోవడం. రాష్ట్రానికి స్వయాన ప్రధాన మంత్రి వచ్చినా ఆహ్వానించడానికి వెళ్లకపోవడం.. గవర్నర్‌‌‌‌కు ప్రొటోకాల్ పాటించకపోవడం, కేంద్ర మంత్రులకూ ప్రొటోకాల్ ఇవ్వకపోవడం..దేనికి సంకేతం? ఒక ప్రజాప్రభుత్వానికి, రాజకీయానికి ఉండే సన్నని గీతను పూర్తిగా చెరిపేయడమే కదా! అదంతా రాష్ట్ర ప్రయోజనానికే అని ప్రజలు భావిస్తున్నారా?  ప్రభుత్వం వేరు, రాజకీయం వేరు అనే వివేచనతో నడిచిన గత ప్రభుత్వాలను చూశాం. కానీ ఇపుడు ప్రభుత్వాన్ని ఫక్తూ రాజకీయమే నడుపుతుండడం చూస్తున్నాం. గతంలో కేంద్ర పాలకులను ధిక్కరించిన రాష్ట్ర పాలకులనూ చూశాం.

కానీ ప్రొటోకాల్ ఇవ్వకుండా రాజకీయం చేసిన పాలకులను చూడలేదనే చెప్పాలె. ‘కేంద్రం మిథ్య’ అన్న ఎన్టీఆర్ సైతం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ప్రొటోకాల్ పాటించారు.  సైద్ధాంతిక ప్రత్యర్థులైన కమ్యూనిస్టు పాలకులు (కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర) సైతం అప్పటి ప్రధాని వాజ్‌‌పేయికి ప్రొటోకాల్ పాటించారే తప్ప అవమానించలేదు. నేటి ప్రధాని మోదీకి కేరళ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటిస్తోంది.  ప్రొటోకాల్ పాటించడమంటే, మన రాజ్యంగం కల్పించిన పాలనా వ్యవస్థను గౌరవించడమే. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఆయన ఈదేశ నూటానలభై కోట్ల భారతీయులకు ప్రధామంత్రి అనే విషయాన్నే  మరవడం ఒక  రాష్ట్ర ముఖ్యమంత్రికి తగిన పనేనా? వైరుధ్య రాజకీయాలను చాటుకోవడానికి అనేక ఇతర మార్గాలూ ఉన్నాయి. ఎన్నికలు ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని ఎత్తిచూపే మార్గాలూ ఉన్నాయి. కానీ, ఏకపక్షంగా కేంద్ర పాలకులకు ప్రొటోకాల్ పాటించక పోవడమే మార్గమా? వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. 

గైర్హాజరు కావడం..

కనీసం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సమావేశాలకు కూడా సీఎం  గైర్హాజరు కావడాన్ని ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలేదనో, అప్పులకు అనుమతులు ఇవ్వడం లేదనో ఆరోపణలు నిరంతరం వినిపిస్తున్నవే. హైదరాబాద్‌‌లో కూర్చొని  ఆరోపణలు చేసే కన్నా, కేంద్రం ఆహ్వానించిన అనేక సమావేశాలకు హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడవచ్చు, నిలదీయవచ్చు. సమావేశాలకు వెళితే ప్రధానమంత్రి ముఖం చూడాల్సి వస్తుందని సీఎం గైర్హాజర్ అవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం..  నీతి ఆయోగ్ సమావేశానికీ సీఎం వెళ్లలేదు. కానీ, హైదరాబాద్‌‌లో కూర్చొని ‘రాష్ట్రం కేంద్రానికి రూపాయి ఇస్తోంది, కేంద్రం రాష్ట్రానికి యాభై పైసలే ఇస్తున్నద’ని మాత్రం లెక్కలు చెపుతున్నారు.  ఆ లెక్కలేవో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానికే చెప్పి నిలదీయొచ్చు కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశనికి కూడా సీఎం వెళ్లలేదు. దక్షిణాది సీఎంల సమావేశంలో రాష్ట్ర సమస్యలపై బలంగా వాదించే అవకాశం ఉండింది. విభజన చట్టం లో మిగిలిపోయిన హామీలపై, కృష్ణా  జాలాలపై చర్చించేందుకు అవకాశం ఉండింది. కానీ సమస్యల పట్ల  అవగాహన లేని హోం మంత్రి మహమూద్ అలీని ఆ సమావేశాలకు పంపి మొక్కు తీర్చుకున్నారు. పాలకుడి వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై రాష్ట్ర ప్రయోజనాలు ఆధారపడి ఉండటం దేశంలో ఎక్కడా చూసి ఉండమేమో?

సమస్యలపై చర్చలేవి?

పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. సెక్రటేరియట్‌‌కు అదే పేరు పెట్టారు. మంచిదే.  కానీ రాష్ట్రంలో ఇచ్చిన హామీ నెరవేర్చి ఉంటే, దళితుల మూడు ఎకరాల భూమిలో అంబేద్కర్ కనిపించేవాడు కాదా? ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల ఆర్తనాదాలు, పురుగుల భోజనాలు, అనారోగ్యాలు, మరణాలు, కనీస వసతులు కరువు. వీఆర్ఏల ఆందోళనలు. వికటించిన కు.ని ఆపరేషన్లు. ధరణి బాధితులు, రైతు ఆత్మహత్యలు ఇలా రాష్ట్రంలో ఏటు చూసినా, ఎక్కడ చూసినా సమస్యలే సమస్యలు. అయినా ప్రభుత్వ రివ్యూలు కరువు. ఫక్తూ రాజకీయానికి మాత్రం సమయం బోలెడు! మూడు రోజుల అసెంబ్లీలోనైనా ప్రజల సమస్యలపై చర్చ జరిగిన దాఖలాలేదు. ఆ మూడు రోజులూ కేంద్రంపై బ్లేమ్‌‌ గేమ్ లు తప్ప, ఒక్క ప్రజా సమస్యకైనా పరిష్కారం చూపారా? బ్లేమ్‌‌ గేమ్స్‌‌ తో  రాష్ట్రప్రయోజనాలు, ప్రజల సమస్యలు సమిధలవుతున్నాయి. జాతీయ పార్టీని నిర్మించేది ఇలాంటి సమిధలపైనేనా?

l  ప్రొటోకాల్ ఉల్లంఘనలు, ఫక్తూ రాజకీయం, దేశ సరిహద్దులను సైతం దాటుతున్న విమర్శలు.. వంటివన్నీ హద్దులు దాటుతున్న  ధిక్కారాలే తప్ప అవి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగ పడేవి మాత్రం కావు. నిత్యం బ్లేమ్ గేమ్​లలో  మునిగి తేలుతూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టని వారు, జాతీయపార్టీతో దేశాన్ని ఉద్దరిస్తామనడమే ప్రజలకు అశ్చర్యం కలిగిస్తున్న విషయం! రాష్టంలో అంతా బాగుందనే భ్రమలు కల్పించడానికే, చర్చను జాతీయపార్టీ వైపు మళ్లిస్తున్నారా అని విశ్లేషకులు అభిప్రాయం వెలుబుచ్చుతండటం గమనార్హం.

బ్లేమ్​ గేమ్​లు..

గడువు లోపల దరఖాస్తు ఉండదు. గడువు అయిపోయాక ఇవ్వలేదనే ఆరోపణలకు ట్విటర్లు,  ప్రెస్ మీ ట్లు వేదికలవుతాయి! ఆ మధ్య కేంద్రమంత్రి కిషన్‌‌ రెడ్డి హైదరాబాద్‌‌కు సైన్స్ సిటీ ఇస్తాం, 25 ఎకరాలు భూమి కేటాయించండని రాష్ట్ర సీఎంకు 4 సార్లు లేఖలు రాసినట్లు మీడియా ముఖంగా చెప్పారు.  ఇంతవరకూ జవాబు లేదని కూడా చెప్పారు. అలాగే, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పదే పదే ట్విటర్‌‌‌‌లో రాస్తుంటారు. గడువు లోపల రాష్ట్రం దరఖాస్తు చేసుకోలేదని స్వయాన కేంద్ర మంత్రులు చెపుతుంటారు. లోపం ఎక్కడుంది? కేంద్రం ఏది ఇచ్చినా రాష్ట్రం వాటాగా భూములు కేటాయించడమో, లేదా  రాష్ట్ర వాటా షేర్ చేయడమో జరగుతుంటుంది. సర్వశిక్షా అభియాన్ కింద రాష్టానికి కేంద్రం రూ. 6 వేల కోట్లు కేటాయించినా, రాష్ట్రం తన వాటా చెల్లించని ఫలితంగా కేంద్ర నిధులు నిరుపయోగంగా మారాయంటే తప్పు ఎక్కడుందని అనుకోవచ్చు? కేంద్ర పథకాలకు రాష్ట్రం షేర్ ఇస్తే మనకొచ్చే ప్రచారం ఏమిటి? అనేదే ప్రశ్నా? అందుకే సొంత పబ్లిసీటి పథకాల మీద ఉన్న యావ, కేంద్రం ఇచ్చే పథకాల మీద ఉండదేమో!  కేంద్రం ఇవ్వడం లేదనే ఆరోపణల్లో ఇలాంటి లోగుట్టులు కూడా ఉంటే ఇక చెప్పేదేముంటది?

l  కొన్ని విమర్శలు దేశ సరిహద్దులను సైతం దాటుతున్నాయి. ‘అరుణాచల్ ప్రదేశ్‌‌లో చైనావాడు దంచుడు దంచుతున్నాడు, అక్కడ చేతకాదు.’ ‌‌‌‌ అంటూ ఆ మధ్య ప్రధానిపై  సీఎం చేసిన కామెంట్ విన్నాం. దేశం లోపల విధాన పరంగా ఎంత వైరుధ్య రాజకీయాలు నడుపుకున్నా తప్పు  లేదు. కానీ అంతర్జాతీయ సమాజంలో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగేలా స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం సరైనదేనా? గతంలో చొరబాటు ప్రయత్నం చేసిన 200 మంది చైనా సైనికులను పిడిగుద్దులు గుద్ది బందీలుగా మార్చిన భారత సైనికుల గొప్పతనం మరిచిపోయి మాట్లాడడం ఫక్తూ రాజకీయమే కదా? దేశప్రతిష్ఠను  ఫక్తూ రాజకీయానికి వాడుకోవచ్చా? - కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్‌‌