గజ్వేల్ ​స్పోర్ట్స్​క్లబ్..ఉన్నట్టా.. లేనట్టా..!

గజ్వేల్ ​స్పోర్ట్స్​క్లబ్..ఉన్నట్టా.. లేనట్టా..!
  •     పట్టణ శివార్లలో 20 ఎకరాలు కేటాయింపు 
  •     నిధులు విడుదలచేయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : అంతర్జాతీయ  ప్రమాణాలతో గజ్వేల్​లో నిర్మించాలని భావించిన స్పోర్ట్స్ హబ్ ప్రతిపాదనలకే పరిమితమైంది. మూడేండ్ల కింద రూ.70 కోట్లతో నిర్మించాలని అనుకున్నా అప్పటి బీఆర్​ఎస్​ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఒక్క అడుగు ముందుకు పడలేదు. స్పోర్ట్స్ హబ్ కోసం గజ్వేల్  పట్టణ శివార్లలోని మినీ స్టేడియానికి ఆనుకుని ఇరు వైపులా 20 ఎకరాల భూమిని కేటాయించినా కేవలం భూమి చదును చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆర్టీఏ ఆఫీసు నిర్వహించడమే కాకుండా డ్రైవింగ్, ఫిట్​నెస్​టెస్ట్ లు చేస్తున్నారు. 

మల్టీపర్పస్ స్పోర్ట్స్ కు వేదికగా..

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్ లో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కు  అనుకూలమైన వేదికలను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని అనుకున్నారు. దాదాపు 40 కోట్ల వ్యయంతో అథ్లెటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, క్రికెట్ గ్రౌండ్, ఫుట్ బాల్ గ్రౌండ్ తో  పాటు ఇతర క్రీడలకు అనువైన విధంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.  స్పోర్ట్స్​హబ్ నిర్మాణం కోసం స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ డిపార్ట్​మెంట్​డిటైల్ రిపోర్టును తయారు

చేసి గజ్వేల్ ఏరియా  డెవలప్​మెంట్​అథారిటీ(గడా) కు సమర్పించింది. గడా నుంచి బీఆర్ఎస్​ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందు  కోసం 28 ఎకరాలు అవసరమవతుందని రిపోర్టులో ప్రతిపాదించగా మినీ స్టేడియానికి సమీపంలో  20 ఎకరాలను బీఆర్ఎస్​ ప్రభుత్వం కేటాయించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. 

తుప్రాన్​, ములుగులో మినీ స్టేడియాలు

అప్పటి ప్రభుత్వం రూ.70 కోట్ల  నిధులు విడుదల చేస్తే స్పోర్ట్స్ హబ్ కోసం రూ.40 కోట్లు, తుప్రాన్ , ములుగుల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి  మరో రూ.30 కోట్లు కేటాయించాలని గడా భావించింది.  హైదరాబాద్ కు సమీపాన ఉండే ములుగులో అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాన్ని నిర్మించాలని,  ముఖ్యమైన క్రీడా పోటీలను ఇక్కడ నిర్వహించడం వల్ల  హైదరాబాద్ లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావించారు. బీఆర్ఎస్​ప్రభుత్వం సరైన విధంగా నిధులు మంజూరు చేస్తే క్రీడాకారులకు ఎంతో మేలు జరిగేదని స్థానికులు వాపోతున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వమైనా దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కోసం బీఆర్​ఎస్​హయాంలో గడా ద్వారా ప్రతిపాదనలు పంపాం. అప్పటి  ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించినా ప్రస్తుతం అది పెండింగ్ లోనే ఉంది. 

- నాగేందర్, డిస్ట్రిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ ఆఫీసర్