ఈడీ, సీబీఐ వస్తే సీఎం కేసీఆర్‌కి భయమెందుకని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డా.మహేంద్ర నాథ్ పాండే ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల పేరు వింటే ముఖ్యమంత్రి కాళ్ళ కింద భూమి కదులుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే తన కుటుంబ అవినీతి బయటపడుతుంది సీఎం కేసీఆర్ కు భయమేస్తోందని విమర్శించారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్ ఛార్జుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలు ఎక్కడ అవినీతి జరిగినా అక్కడికి వెళ్లి వాటి పని అవి చేసుకుంటూ పోతాయని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ అన్నారు. కేంద్రం సీబీఐని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. సీబీఐ పారదర్శకంగా విచారణ జరుపుతుందన్న నమ్మకంతోనే కోర్టు ఫాం హౌస్ కేసును దానికి అప్పగించిందని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్ళలో 1150 కోట్ల అవినీతి...
‘బీజేపీ ప్రభుత్వంలో నల్లగొండ లోక్ సభ పరిధికి అత్యధిక నిధులు వచ్చాయి. రాష్రంలో పేదలకు ఇళ్ళు కావాలని ఏకంగా ప్రధానికి అర్జీ పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ళు ఇచ్చే క్రమంలో రాష్ట్రం అడ్డుకుంటుంది. సీఎంలు కేసీఆర్ , మమత బెనర్జీ లు వారి తెలివి ఉపయోగించి కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. కేంద్ర నిధులు పక్కదారి పట్టించడంతోనే తెలంగాణాలో అభివృద్ధి దూరమౌతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికే పర్యటనలు చేస్తున్నం.. బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుండడం వల్లే 3 రాష్ట్రాల నుండి నేడు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. సూర్యాపేట జిల్లా ధాన్యం కొనుగోళ్ళలో 1150 కోట్ల అవినీతి జరిగింది. జరిగిన అవినీతి పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోళ్ళ అవినీతి మీదే మొదటి విచారణ. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో రాష్ట్రం విఫలం. ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. అనేక శాఖల్లో భారీ ఖాళీలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగట్లేదు. స్థానికంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ మోడీ ఇస్తానన్న ఉద్యోగాల మీద ఎలా మాట్లాడతారు ? కేంద్రంలో , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగులకు అత్యధిక ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రపంచంలో భారత దేశంలో మాత్రమే మోడీ చలవతో అత్యధిక స్టార్ట్ అప్ కంపెనీలు వచ్చాయి. మోడీ ఆధ్వర్యంలో అధిక ఉద్యోగాలు వస్తుంటే కేసీఆర్ రాజ్యంలో మాత్రం అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలే. రాష్ట్రాల గ్రామాల అభివృద్ధికి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే ఇక్కడ అభివృద్ధి జరగడంలేదని సర్పంచులు రాజీనామా చేస్తున్నారు’. అని వ్యాఖ్యానించారు.