తెలంగాణ ఉద్యమ సారథి, సకల జనసేనాని ప్రొఫెసర్ కోదండరాం విషయంలో బీఆర్ఎస్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ఉద్యమకారులందరినీ అవమానించేలా ఉంది. బతికి ఉన్నప్పుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ ను అవమానించిన సదరు నాయకులే.. ఇప్పుడు కోదండరాం విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కోదండరాం వయసుకు, ఉద్యమ చరిత్రకు ఏమాత్రం గౌరవం ఇవ్వకపోగా ఇంటి తలుపులు బద్దలు కొట్టించి, అవమానాలకు గురి చేసినట్లుగానే.. ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ వెంటాడుతున్నారు.
జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ సమాజంలో అంతటి గౌరవం దక్కిన మేధావిని ఒక పార్టీకి పరిమితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కోదండరాం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, ఎలా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారనే వాదనను తెరపైకి తెచ్చి.. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా, అంతకుముందు అణగారిన వర్గాల గొంతుకగా, పౌర హక్కుల కార్యకర్తగా ఆయన తెలంగాణ సమాజానికి చేసిన సేవను తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారు.
ప్రజల గోస తెలిసిన మేధావి
కోదండరాం అంటే కేటీఆర్ చెప్తున్నట్లుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగానే చూడలేం. రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు ఆయనకు సుమారు 35 ఏండ్ల ప్రజా జీవితం ఉంది. కోదండరాం ఓయూలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్.. అనేక సామాజికాంశాలపై లోతైన అవగాహన కలిగిన మేధావి. తెలంగాణ ప్రజల గోస తెలిసిన మనిషి. హక్కుల కార్యకర్తగా 20 ఏండ్లు, తెలంగాణ ఉద్యకారుడిగా దశాబ్దంన్నర పని చేసిన అనుభవం ఆయనకుంది. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా విద్యార్థులకు క్లాస్ రూమ్ ల్లో రాజ్యాంగ పాఠాలు చెప్తూనే.. అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలను యూనివర్సిటీ బయటికొచ్చి ప్రశ్నించారు.
దేశంలో ఆహార భద్రత సమస్యపై పనిచేసిన సుప్రీంకోర్టు కమిషనర్‌కు సలహాదారుగా పనిచేశారు. హక్కుల కార్యకర్తగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం(ఏపీసీఎల్సీ), మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్)లో పనిచేసే క్రమంలో ఆదివాసీల సమస్యలు, ఎన్ కౌంటర్ హత్యలు, పటాన్ చెరు, జీడిమెట్ల చిన్నపరిశ్రమల కార్మికుల వెతలు, మెదక్, పాలమూరు కరువు ప్రాంతాల్లో ఆకలి చావులు, సిరిసిల్ల, ప్రకాశం జిల్లా చీరాలలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వరంగల్ లో పత్తి రైతుల ఆత్మహత్యలపై లోతైన అధ్యయనం చేసి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. హక్కుల కార్యకర్తగా ఆయన బృందం చర్చకు పెట్టిన అంశాలే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎజెండాగా మారాయి.
తెలంగాణ ఉద్యమ చోదకశక్తి
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో చోదక శక్తిగా పనిచేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా కోదండరాం వ్యవహరించారు. అధ్యయనం, ఆచరణ కలగలిసిన ఆయనకు రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ప్రకటిస్తే తెలంగాణ సమాజమంతా హర్షించింది. సార్ కు పదవి రావడమంటే తమందరికీ పదవి వచ్చినట్లుగా ఉందని అప్పటి జేఏసీ నేతలు సగర్వంగా చెప్పుకున్నారు.
సర్కార్ కు తమకు మధ్య వారధిగా కోదండరాం ఉంటారని భావించి.. అనేక సంఘాల నాయకులు, అభాగ్యులు రోజూ వివిధ సమస్యలపై ఆయన దగ్గరకు వస్తున్నారు. కానీ, కొమ్ములు వచ్చి చెవులను వెక్కిరించినట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు ఉంది. కేటీఆర్ మాట్లాడటం నేర్చుకునే కాలం నాటికే ప్రజాఉద్యమాల్లో భాగమైన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను కేటీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనను ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకోవడం ద్వారా తెలంగాణ సమాజంలో కేటీఆర్ అండ్ టీమ్ మరింత పలచనవుతోంది. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నాయకులే కేటీఆర్ కామెంట్స్ ను తప్పుబడుతున్నారు.
నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీక
ఇన్నాళ్లూ తెలంగాణ వాదం అన్నా, తెలంగాణ ఉద్యమం అన్నా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ పెద్దలకు.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా మారబోతుండడం ఏమాత్రం రుచించడం లేదు. అంతేగాక టీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అణచివేతకు, అవమానాలకు గురైన నిజమైన ఉద్యమకారులు, అప్పటి జేఏసీ నాయకులు మళ్లీ కోదండరాం వెంట ర్యాలీ అవుతుండడం కూడా వారిని ఆందోళనకు గురిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ ప్రపోజల్ గవర్నర్ ఎందుకు తిరస్కరించారనే విషయం చర్చకు పెట్టాల్సిందే. కానీ, వీరి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాంను అవమానించేలా వ్యవహరించడం సరికాదు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవమానించడమే. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో పెద్ద ప్రాజెక్టులన్నింటిని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పజెప్పడమేగాక కరోనా టైంలో రెమిడిసివర్ ఇంజక్షన్ల బిజినెస్ తో తెలంగాణ ప్రజల రక్తం తాగిన ఫార్మా కంపెనీల అధిపతులను, గ్రానైట్ బిజినెస్ పేరిట ఇక్కడి సహజ సంపదను కొల్లగొడుతున్న వ్యాపారులను పెద్దల సభకు పంపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఇంతకు మించిన స్పందనను ఊహించలేం.
కోదండరాం పాత్ర కీలకం కావాలి
కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినా, చేయకపోయినా తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన గళమెత్తుతూనే ఉంటారు. ఉద్యమ సందర్భంలో కేసీఆర్ చెప్పినట్లే అప్పటికీ.. ఇప్పటికీ కోదండరాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీకనే. కొత్త ప్రభుత్వంలో ప్రజల ప్రత్యేక ప్రతినిధిగా కోదండరాంను యావత్ తెలంగాణ కోరుకుంటున్నది.
అలాంటి కోదండరాంను ఖచ్చితంగా ప్రభుత్వంలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెనుకడుగు వేయరనే నమ్మకం ప్రజల్లోనూ ఉంది. బీఆర్ఎస్ ఆటంకాలు కలిగించినా.. కోదండరాం పాత్ర కొత్త ప్రభుత్వంలో ఉండాల్సిందే అని ప్రజలు మాత్రం బలంగా కోరుకుంటున్నారనడంలో సందేహం లేదు.
డా. ఎన్. యాకయ్య,సీనియర్ జర్నలిస్ట్