కొత్త ఇల్లు కట్టినా... అద్దె ఇల్లు మారినా సాధారణంగా పాలు పొంగించి పరమన్నం తయారు చేసి... పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత.. మిగతా పనులు చేసుకుంటారు. ఇల్లు మారినప్పుడు చేసినా.. చేయకపోయినా.. కొత్త ఇంటిలోకి గృహప్రవేశం అయిన సందర్భంలో కచ్చితంగా ఇంటి ఆడపడుచు పాలు పొంగించే సంప్రదాయాన్ని పాటిస్తారు. దీని వెనుక ఉన్న నమ్మకం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం
కొత్త ఇంట్లో అడుగు పెట్టె సమయంలో పాలు పొంగిచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుందని నమ్ముతారు. అలాగే గృహ ప్రవేశం పూజ రోజున కొత్త వంటశాలలో కొత్త పాత్రలో పాలు పోసి ముందుగా వాయువుకు పూజ చేసి ఆ తర్వాత పాలు మరిగించాలి. పాలు పొంగిన తర్వాత క్షీరాన్నం తయారు చేసి సత్యనారాణ వ్రత కథ పూజలో దేవతకు నైవేద్యంగా సమర్పించాలి. హోమం పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణులకు కూడా పరమాన్నం ప్రసాదంగా పెట్టి.. వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆహూతులకు ప్రసాదంగా పంచండి.
కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారంటే
ఇల్లు వేడెక్కుతున్న సమయంలో స్త్రీలు కొత్త ఇంటి వంటగదిలో కొత్త పాత్రలో పాలు కాచాలని పురాణాలు చెబుతున్నాయి. అలా కాచేటప్పుడు మరుగుతున్న పాలలో బియ్యం చేర్చి క్షీరాన్ని ప్రసాదంగా తయారు చేస్తారు. ఇది పూజ చేసే సమయంలో నైవేద్యంగా సమర్పించబడుతుంది. తరువాత అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. సాంప్రదాయ భారతీయ హౌస్ వార్మింగ్ వేడుకకు పాలు మరిగించడం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అందుకే పాలు పొంగిస్తారు.
కొత్త ఇల్లు ప్రతి ఒక్కరి కల. చిన్నదో పెద్దదో సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు. తమ ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకుంటారు. అయితే తమ కలల పంట సొంత ఇంట్లో అడుగు పెట్టడం అనేక గృహస్తులకు ప్రత్యేక అనుభూతి. ప్రతి ఒకరి జీవితంలో కొత్త ప్రారంభానికి ప్రతీక. ఇల్లు కొనుక్కోవడానికి లేదా కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయడానికి గృహ యజమానులు సాధారణంగా ముఖ్యమైన తిథిని ఎంచుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇంట్లోకి వెళ్లే ముందు గృహ ప్రవేశ పూజ చేస్తారు. గృహ ప్రవేశం అనేది ఒక హిందూ ఆచారం. ఇక్కడ ఒక వ్యక్తి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు ఒక శుభ సమయంలో పూజ కార్యక్రమం నిర్వహిస్తారు.
గృహ ప్రవేశ పూజ ప్రాముఖ్యత
గృహ ప్రవేశ పూజ వేడుక ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి.. ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు నిర్వహించబడే హిందూ పూజా కార్యక్రమం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. శుభ ముహూర్తంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జీవితం సుఖ సంతోషాలు నిండి ఉంటాయని విశ్వాసం. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కుటుంబ సభ్యుల సమస్యలు తేలికవుతాయని నమ్మకం.
గృహ ప్రవేశ పూజ రోజున పాలు పొంగించడం
కొత్త పాత్రలో పాలు పొంగించడం హిందూ సంప్రదాయం, ఆచారంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం గృహ ప్రవేశ సమయంలో పాలు పొంగిస్తే ఇంటిలో సుఖ సంతోషాలు కూడా అలా పొంగుతూ ఉంటాయని విశ్వాసం. క్షీరాన్నం చేస్తారు. పొంగిన పాలల్లో బియ్యం, బెల్లంవేసి తయారు చేస్తారు. దీనిని దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గృహప్రవేశం సమయంలో పాలు పొంగితే ఆ ఇంటిపై ఇంటి సభ్యులపై దేవుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం. అందుచేత కొత్త ఇంట్లోని వంటగదిలో తప్పనిసరిగా పాలు పొంగించాలి.