క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా..పెట్రో ధరలు పెరగడం వెనుక మతలబేంటి.?

క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా..పెట్రో ధరలు పెరగడం వెనుక మతలబేంటి.?
  • 61 డాలర్లకు పడిన బ్యారెల్ క్రూడాయిల్
  • పెట్రోల్ మాత్రం లీటర్ రూ.107
  • లీటర్​పై రూ.2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం
  • 20‌‌10లో క్రూడాయిల్ 110 డాలర్లు ఉన్నా.. లీటర్ పెట్రోల్ రూ.55
  • 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు.. పెట్రోల్ మాత్రం రూ.109
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ
  • ఖజానాను నింపుకునేందుకేనని విమర్శలు

సెంట్రల్​డెస్క్, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ రేట్లు భారీగా పడిపోతున్నా దేశీయంగా మాత్రం ఇంధన ధరలు తగ్గడం లేవు. తాజాగా లీటర్‌‌ పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచే ఎక్సైజ్ సుంకం అమల్లోకి వచ్చింది. వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఈ పెంపు అనేది ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ అనేవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ట్యాక్స్ ఇన్​కమ్ తెచ్చి పెడ్తుంటాయి. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ ఆదాయం పొందుతున్నది. 2010లో బ్యారెల్ క్రూడాయిల్ 110 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ రూ.55 పలికింది. 2024 నాటికి బ్యారెల్ రేటు సగానికి పడిపోయినా.. పెట్రోల్ ధర మాత్రం రూ.109 పలుకుతున్నది. 2022 నుంచి క్రమంగా క్రూడాయిల్ ధరలు పతనమైనప్పటికీ.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేవు. సార్వత్రిక ఎన్నికల ముందు 2024, మార్చి 15న ఇంధన ధరలను తగ్గించిన కేంద్రం.. నాటి నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చినా.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయిలోనే ఉన్నాయి.

ఎక్సైజ్ సుంకంతో భారీగా పెరిగిన వసూళ్లు

ముడి చమురు ధరల తగ్గుదలను ఆసరాగా చేసుకుని, 2014, నవంబర్- నుంచి 2016, జనవరి మధ్య ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ సుంకాన్ని 9 సార్లు పెంచింది. ఈ 15 నెలల కాలంలో పెట్రోల్‌‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 11.77 పెంచగా, డీజిల్‌‌పై లీటరుకు రూ.13.47 పెంచారు. దీంతో ఎక్సైజ్ సుంకం వసూళ్లు 2015 ఆర్థిక సంవత్సరంలో రూ.99,000 కోట్లు ఉంటే.. 2017 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.42 లక్షల కోట్లకు పెరిగాయి. అప్పటి నుంచి క్రూడాయిల్​ ధరలతో ఫ్యూయెల్ ట్యాక్స్ విధానం మారుతున్నది. 2017, అక్టోబర్‌‌లో ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 తగ్గించింది. 2018లో మళ్లీ రూ.1.50 తగ్గించింది. కానీ.. 2019 జులైలో మళ్లీ లీటరుకు రూ.2 పెంచింది. మార్చి 2020లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్​కు రూ.3 పెంచింది.  

నాలుగేండ్ల కనిష్టానికి క్రూడాయిల్ ధరలు

ట్రంప్ టారిఫ్ ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే సుమారుగా బ్యారెల్ క్రూడాయిల్​ ధర 10 డాలర్ల వరకు పతనమైంది. మంగళవారం బ్యారెల్ ధర 61.22 డాలర్లు పలికింది. ట్రంప్ దెబ్బకు నాలుగేండ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ 2.28 డాలర్లు పడిపోయి (3.5 శాతం) 63.30 డాలర్లకు దిగొచ్చింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (డబ్ల్యూటీఐ) 2.20 డాలర్లు (3.6 శాతం) తగ్గిపోయి 59.79 డాలర్లకు చేరింది. 2021 తర్వాత ఇంత భారీగా క్రూడాయిల్​ ధరలు పడిపోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ టారిఫ్‌‌లతో గ్లోబల్​గా ట్రేడ్ వార్ తీవ్రమైంది. దీంతో ఆర్థిక మాంద్యం భయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే.. ఆయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు తెలిపారు. దీంతో.. ఒకే వారంలో బ్రెంట్ 10.9 శాతం, డబ్ల్యూటీఐ 10.6%  శాతం పతనం అయ్యాయి. స్టాక్ మార్కెట్లు మరింత పతనమైతే.. క్రూడాయిల్ ధర భారీగా పడిపోతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

2014 నుంచి 2025 వరకు క్రూడాయిల్ ధరలు

2014లో బ్యారెల్ క్రూడాయిల్ 100 డాలర్లు పలికింది. తర్వాత డిసెంబర్ నాటికి 55 నుంచి 60 డాలర్లకు పడిపోయాయి. 2015లో బ్యారెల్ 55 డాలర్లు, 2016లో 43 డాలర్లు పలికింది. 2017లో 57 డాలర్లు, 2018లో 71 డాలర్లు, 2019లో 64 డాలర్లు పలికింది. 2020లో 41 డాలర్లు, 2021లో 71 డాలర్లు నమోదైంది. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యారెల్ క్రూడాయిల్ గరిష్టం 130 డాలర్లు పలికింది. 2023లో 85 డాలర్లు, 2024లో 83 డాలర్లకు చేరుకున్నది. ఆ తర్వాత 2025 ప్రారంభంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 76.58 డాలర్లు పలికింది. జనవరి చివరి నాటికి 72.62 డాలర్ల వద్ద స్థిరపడింది. 3 నెలల్లో ధరలు 14.94% పతనం అయ్యాయి. గడిచిన పదేండ్లలో 2022లో గరిష్టంగా బ్యారెల్ 130 డాలర్లు పలకగా.. 2016లో కనిష్టంగా 26 డాలర్లుగా నమోదైంది.

పదేండ్లలో భారీగా తగ్గిన రూపాయి విలువ

2014 నుంచి 2025 మధ్య రూపాయి విలువ డాలర్‌‌తో పోలిస్తే చాలా తగ్గింది. 2014 ప్రారంభంలో డాలర్ సుమారు రూ.62 ఉండగా, మే, 2014 నాటికి (మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం) రూ.59.5 రూపాయల వద్ద ఉంది. ఏడాది చివరి నాటికి రూ.63కు చేరింది. 2014లో 59.5 రూపాయల వద్ద ఉన్న డాలర్ విలువ 2025 ఏప్రిల్ నాటికి 86.25 రూపాయలకు చేరింది. అంటే రూపాయి విలువ సుమారు 45% తగ్గింది.

సంవత్సరం    రూపాయి

2014    62
2015    66
2016    68
2017    65
2018    74
2019    71
2020    76
2021    75
2022    82
2023    83
2024    84
2025 (ఏప్రిల్ 8)    86


క్రూడాయిల్ 40 డాలర్లకు పడిపోవచ్చు: గోల్డ్​మన్ 

సాచ్స్ తాజాగా క్రూడాయిల్ ధరల అంచనాను వారంలో రెండు సార్లు సవరించింది. ట్రేడ్ వార్ ఇలాగే కొనసాగితే.. 2026 నాటికి బ్యారెల్ క్రూడాయిల్ ధర 40 డాలర్లకు పడిపోతుందని తెలిపింది. 2025లో బ్రెంట్ క్రూడ్ సగటు ధర 69 డాలర్లు, డబ్ల్యూటీఐ 66 డాలర్లుగా ఉంటుందని గోల్డ్‌‌మన్ సాచ్స్ అంచనా వేసింది. 2026లో ఈ ధరలు మరింత తగ్గి, బ్రెంట్ 58 డాలర్లు, డబ్ల్యూటీఐ 55 డాలర్లకు చేరొచ్చని సవరించింది. ఒపెక్ ఉత్పత్తిని పెంచితే బ్యారెల్ క్రూడాయిల్ 40 డాలర్ల కంటే తక్కువకు కూడా పడిపోవచ్చని హెచ్చరించింది.

అసలు లీటర్ పెట్రోల్ రూ.55.66కే..

ముడి చమురు ధరలు, డీలర్ ఫీజులు, ఎక్సైజ్ సుంకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయి. అయితే, వ్యాట్ మాత్రం ఒక్కో రాష్ట్రంలో మారుతూ ఉంటుంది. అందుకే, పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా కొద్దిపాటి తేడాలు కనిపిస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకు ముందు పెట్రోల్ ధర లీటరుకు కేవలం 55 రూపాయలు మాత్రమే. ఇక్కడ కూడా, ఒకటి లేదా రెండు రకాల పన్నుల తర్వాత పెట్రోల్ ధర పెరుగుతుంది. వాస్తవానికి, ముడి చమురు ధర లీటరుకు రూ.40. దీనిపై ఓఎంసీ ప్రాసెసింగ్ కాస్ట్ లీటర్​ పెట్రోల్ కు రూ.5.66, బఫర్ ఫర్ ఇన్​ఫ్లేషన్ రూ.10 విధిస్తారు. మొత్తం కలిపితే లీటర్ పెట్రోల్ కేవలం రూ.55.66కే రావాలి. కానీ.. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ (రూ.19.90), రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ (35% పెట్రోల్), డీలర్ కమీషన్ అండ్ చార్జెస్ (రూ.3.77) కలిపితే ధర 107.46కు పెరుగుతుంది. 

సంవత్సరం    క్రూడాయిల్ (డాలర్లలో)    పెట్రోల్    డీజిల్

2010‌‌‌‌    80    రూ.55    రూ.40
2011    110    రూ.65    రూ.45
2012    115    రూ.75    రూ.50
2013    110    రూ.80    రూ.55
2014    55    రూ.76    రూ.60
2017    57    రూ.75    రూ.62
2019    70    రూ.80    రూ.72
2020    30    రూ.90    రూ.80
2022    130    రూ.118    రూ.104
2023    85    రూ.110    రూ.98
2024    85    రూ.109    రూ.97
2025    60    రూ.107    రూ.95