![IND vs ENG: కోహ్లీ, పంత్‌లపై వేటు పడినట్టేనా..! అసలేం జరిగింది..?](https://static.v6velugu.com/uploads/2025/02/why-is-rishabh-pant-and-virat-kohli-not-playing-todays-ind-vs-eng-2025-1st-odi_6NidgHq18f.jpg)
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లకు తుది జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది. విరాట్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని టీమ్ మేనేజ్మెంట్ చెప్తున్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు వరకు అతను ప్రాక్టీస్‌లో పాల్గొనడం వేటు పడిందనడానికి అద్దం పడుతోంది.
నిజానికి తొలి వన్డే ప్రారంభానికి రెండ్రోజుల ముందే భారత తుది జట్టు గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. గంభీర్ మెచ్చిన యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా భారత జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారని అనేక కథనాలు వచ్చాయి. అయినప్పటికీ, ఆ సమయంలో కోహ్లీని పక్కనపెట్టే సాహసం చేయకపోవచ్చన్న మాటలు వినపడ్డాయి. తీరా టైం వచ్చాక చూస్తే.. అదే జరిగింది. తుది జట్టు నుంచి కోహ్లీని తప్పించారు.
ALSO READ | Tri-Series: ట్రై-సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఆరుగురు కొత్త ఆటగాళ్లకు చోటు
రోహిత్ జోడీగా జైస్వాల్ ఏ మేరకు రాణించగడు..? మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్.. నాలుగో స్థానంలో శుభమాన్ గిల్ సత్తా పరీక్షించాలనే టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లీని తప్పించామని నేరుగా చెప్తే.. విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున గాయాన్ని సాకుగా చూపారన్న టాక్ నడుస్తోంది.
పంత్‌పై వేటు..
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోలేదు, అతనిపై వేటు పడిందన్నది వంద శాతం నిజం. పంత్‌కు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయనే వార్తలు లేవు. కెఎల్ రాహుల్ తిరిగి రావడంతో పంత్‌పై వేటు వేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పంత్ ఆట తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా పంత్ అడ్డగోలు షాట్లు ఆడి ఔట్ అవుతున్నాడని.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద చర్చే నడిచింది. దాని ఫలితమే వేటుకు కారణమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.