విశ్లేషణ: చరిత్ర అంటే పాలకులకు భయమెందుకు?

తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు గడిచినా చరిత్ర రచనలోనూ, నిర్మాణంలోనూ ఎలాంటి చలనం కనిపించడం లేదు. నేలమాళిగల్లో, రాగి రేకులపై, రాతి పలకలపై మిణుకుమిణుకుమంటూ అగాధాల్లో కూరుకుపోయిన తెలంగాణ చారిత్రక ఆధారాలను వెలికితీసే ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. మన చరిత్రపై మరిన్ని పరిశోధనలు జరగాలని, మన సోయితో మన చరిత్రను రాసుకోవాలన్న చరిత్రకారుల ఆశలు స్వరాష్ట్రంలో కూడా నెరవేరలేదు. చరిత్ర నిండా తెలంగాణ మట్టి వాసనలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఉండాలని కోరుకున్న చరిత్రకారులకు.. ఇప్పటికీ పాత పుస్తకాల సారం, గత సంస్థల పరిశోధనలే మిగిలాయి తప్ప కొత్తగా కనుగొన్నది మాత్రం ఏమీ లేదు.

తెలంగాణ మట్టి పొరల్లో నిక్షిప్తమైన చారిత్రక సంపదను, స్థావరాలను, ఈ ప్రాంత గొప్పతనాన్ని చాటిచెప్పడం కోసం 1914లో హైదరాబాద్ పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో తెలంగాణ నలుమూలలా వందలాది ప్రాచీన చారిత్రక కట్టడాలను, స్థావరాలనూ గుర్తించారు. వాటిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆనాడు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి చరిత్ర పరిశోధకులు పాక్షిక ప్రయోగాలు మాత్రమే చేయగలిగారు. విశ్లేషించగలిగారు. కాలక్రమంలో కొత్తగా వచ్చిన పరిశోధనా పద్ధతులను, ప్రయోగ వస్తువులను, వనరులను ఉపయోగించుకొని వాటిపై లోతుగా జరగాల్సిన పరిశోధనలు మాత్రం చేయలేదు. 

ప్రాభవాన్ని కోల్పోయింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ పురావస్తు శాఖ తవ్వకాలపై గానీ, ఇక్కడ కనుగోబడ్డ కట్టడాలపైగానీ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. వాటిని కాపాడేందుకు ఆసక్తి కూడా చూపలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వీటికి మహర్దశ పడుతుందని చరిత్ర కారులు భావించారు. అలాగే మరిన్ని పరిశోధనలు జరిగి కొత్త అంశాలు, కట్టడాలు వెలుగులోకి వస్తాయని ఆశించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. పైగా అప్పటి వరకు కొనసాగుతున్న ‘పురావస్తు, మ్యూజియం శాఖ’ను అనవసర శాఖగా భావించి విస్మరించడం మొదలు పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శాఖ పేరునే మార్చివేసి ‘వారసత్వ శాఖ’గా నామకరణం చేశారు. అంతేగాకుండా ఆ శాఖకు కేటాయించే నిధులను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ఒకప్పుడు రమేశన్ లాంటి ఐఏఎస్ అధికారుల చేతుల్లో పురావస్తు శాఖ ఒక వెలుగు వెలిగింది. అలాంటి శాఖ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోయింది. అధికారులకు పనిష్మెంట్ లో భాగంగా కేటాయించే శాఖగా దిగజార్చారు. పురావస్తు శాఖ అనుబంధంగా ఉండే మ్యూజియంలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క హైదరాబాద్ మినహా ఎక్కడా కూడా కనీసం అందులోని పురావస్తు సంపదను, పరికరాలను, శిల్పాలను శుభ్రపరిచే ఉద్యోగులే దిక్కులేరు. ఇక అక్కడ పూర్తి స్థాయి ఉద్యోగులను కోరుకోవడం అత్యాశే అవుతుంది.

దేశ, విదేశాల నుంచి పరిశోధకులు వస్తరు

దక్షిణ భారతదేశ చారిత్రక సంపదకు నిలయం తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్. 1894లో హైదరాబాద్ పాలకుడైన ఆరో నిజాం హయాంలో ఇది ఏర్పాటైంది. నిజాం కాలంనాటి రికార్డులను భద్రపరచటానికి దప్తర్-ఇ-దివాని పేరుతో ఈ శాఖను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 14 విభాగాలకు సంబంధించిన పత్రాలను భద్రపరుస్తూ వచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1962లో దీనిని నేషనల్ ఆర్కైవ్స్ గుర్తించింది. 1965లో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రస్తుత స్టేట్​ ఆర్వైవ్స్ బిల్డింగ్​ను ప్రారంభించారు. ఇది దేశ, విదేశాల నుంచి వచ్చే చారిత్రక పరిశోధకులకు అనేక రకాలుగా ఉపయోగపడుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం దాదాపు మూడు, నాలుగు వందల మంది విదేశీ పరిశోధకులు సమాచార సేకరణ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. 

తరతరాల చరిత్రకు సాక్ష్యం

స్టేట్ ఆర్కైవ్స్ లో వివిధ రాజుల కాలాలకు చెందిన దాదాపు 43 మిలియన్ల ముద్రిత సమాచారంతో కూడిన పత్రాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో లక్షా యాభై వేల పత్రాలు ఒక్క మొగలుల కాలానికి చెందినవే. ఇక్కడి పత్రాల్లో ఆరు వందల సంవత్సరాల క్రితం చేతితో రాసిన ప్రతి కూడా ఉంది. క్రీస్తు శకం 1406 లో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన బహమనీ సుల్తాన్లకు చెందినది ఇది. అలాగే షాజహాన్, ఔరంగజేబు లాంటి మొగల్ పాలకులు జారీ చేసిన రాజపత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రతులన్నీ ఎక్కువగా ఉర్దూ, పర్షియన్ భాషల్లో ఉన్నాయి. ఆర్కైవ్స్ లో ఉన్న చారిత్రక సంపదతోపాటు వివిధ కాలాలకు చెందిన ఫొటోలు, భౌగోళిక పటాలు, ఆయుధాలు, వస్తువుల ప్రదర్శన కోసం మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆర్కైవ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. దీని నిర్వహణ కోసం ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ ప్రభుత్వం ఇన్​చార్జ్ లతోనే నెట్టుకుని వస్తోంది. 

డిస్ట్రిక్ట్ గెజిటీర్​ డిపార్ట్​మెంట్​ ను ఎత్తేశారు

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన అధికార సమాచారాన్ని ప్రచురించి, ప్రజలకు అందుబాటులో ఉంచే స్టేట్ డిస్ట్రిక్ట్ గెజిటీర్ డిపార్ట్​మెంట్ ఇప్పుడు కనబడటం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన అధికార సమాచారం నమోదు కోసం 1955లో కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ గెజిటీర్ రివిజన్ అండ్ రైటింగ్ స్కీంను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర గెజిటీర్ బోర్డులను, శాఖను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దాంతో 1958లో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ గెజిటీర్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1967లో దీనిని పునర్వ్యవస్థీకరించారు. దీనిని కార్యరూపంలో పెట్టడం కోసం ఒక శాఖను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలోనే తెలంగాణ పది జిల్లాలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన గెజిటీర్ లు ప్రచురించేవారు. ఈ శాఖ ఆధ్వర్యంలో వివిధ మోనోగ్రాఫ్స్, ఆర్థిక సర్వే వివరాలు, గ్రామ చరిత్రలు తదితరాలు ప్రచురిస్తూ వచ్చారు. ప్రజలకు ఎంతో ప్రామాణిక, కచ్చితమైన సమాచారాన్ని అందించే ఈ శాఖను ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. దీనిని ప్రభుత్వం ప్రత్యేక శాఖగా నిర్వహించలేక స్టేట్ ఆర్కైవ్స్ లో విలీనం చేయడం దురదృష్టకరం.

నత్తనడకన సాగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియ

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అన్ని విభాగాల్లోనూ ప్రతి పేజీని డిజిటైజ్ చేస్తూ ఉంటే.. స్టేట్​ ఆర్కైవ్స్ లో మాత్రం తూతూ మంత్రంగా సంవత్సరాల తరబడి ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. డిజిటైజేషన్​ కోసం నిధులు అరకొరగా విడుదల చేయడం, విడుదలైన నిధులను ఉపయోగించుకోవడానికి సరిపడా సిబ్బంది లేకపోవడం ఈ ప్రక్రియ మరింత ఆలస్యానికి కారణం అవుతోంది. సంస్థలోని డాక్యుమెంట్ల కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ కోసం ప్రత్యేక ఫ్యుమిగేషన్ చాంబర్లు ఏర్పాటు చేయాలి. కానీ ఈ వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గడిచిన ఏడు సంవత్సరాల్లో 4 కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించినా.. విడుదల చేసినవి పైసలు నామమాత్రమే. దానికి ఉదాహరణ 2021-–22 సంవత్సరానికి కేవలం నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు విడుదల చేయడమే. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ చారిత్రక నిధి 2020లో వచ్చిన వరదల వల్ల కొంత వరకు పాడైపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సెక్రటేరియట్ లో భద్రపరిచిన వివిధ శాఖల ప్రాచీన పత్రాలు సెక్రటేరియట్ కూల్చివేతలో భాగంగా మరోచోటికి తరలించినప్పుడు మరికొన్ని పత్రాలు చెడిపోయినట్లు కూడా సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లిప్త వైఖరితో అద్భుతమైన చారిత్రక సంపదకు చెదలు పడుతోంది. ఆర్కైవ్స్ లో 72 మంది ఉద్యోగులకుగానూ 26 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఉన్న వారిలో కూడా ఎక్కువ మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వారే.

చరిత్రను మర్చిపోవడం తగదు

చరిత్రను తెలుసుకోవడానికి, నిర్మించుకోవడానికి ఉపయోగపడే వివిధ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ తెలంగాణ సమగ్ర చరిత్ర రచనను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే చరిత్ర సబ్జెక్టు బోధన విషయంలో కూడా చిన్నచూపుతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని సగం యూనివర్సిటీల్లో హిస్టరీ విభాగాలే లేవు. ఇక చరిత్రలో నూతన పరిశోధనలు ఎక్కడ నుంచి వస్తాయి? కాలేజీ స్థాయి విద్యలోనూ చరిత్రను నామమాత్రంగా భోదించడం బాధాకరం. తను నివసించే ప్రాంత చరిత్ర తెలియకుండా పౌరుడు అభివృద్ధిలో ఎలా భాగస్వామి కాగలడు? తన వారసత్వ చరిత్ర తెలియకుండా ఉత్తమ పౌరుడిగా ఎలా మారగలడు? తెలంగాణ ఉద్యమమే చరిత్ర పునాదులపై నిర్మితమైంది. అలాంటి చరిత్రను విస్మరించి, ముందుకు సాగాలనుకోవడం దురాశే. మన చరిత్రను మనమే కప్పిపెట్టాలనుకోవడం.. భవిష్యత్ తరాలకు తెలియకుండా చేయడం ముమ్మాటికీ చారిత్రక ద్రోహమే.
- డాక్టర్ సందెవేని తిరుపతి, 
ఫౌండర్, చరిత్ర పరిరక్షణ సమితి