
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని విశాలమైన స్థలంలో ఉన్న తారామతి బారదారి రిసార్ట్‌కు అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. ప్రైమ్ లొకేషన్‌లో రూ.700 కోట్ల విలువైన ఏడెకరాల స్థలంలో ఉన్న తారామతి బారదారి రిసార్ట్‌కు ఏడాదిలో కోటిన్నర మాత్రమే ఆదాయం రావడంపై మండిపడ్డారు. శుక్రవారం ఈ రిసార్ట్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్టారెంట్, పుష్పాంజలి అంపి థియేటర్, ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, టాయిలెట్స్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరిత తారామతి బారదారి ఎంట్రెన్స్ వద్ద రోడ్డుపై గుంతలు పడ్డాయని, వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల చెత్త చెదారాన్ని తొలగించి, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఉన్న తారామతి బారదారి రిసార్ట్‌కు ఏడాదికి రూ.కోటిన్నర ఆదాయం మాత్రమే రావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం తక్కువగా రావడానికి నిర్వహణ లోపమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. గత సర్కార్ పట్టించుకోకపోవడం వల్లే పర్యాటక శాఖ పరిధిలోని హరిత హోటల్స్ నిర్వహణ లోపభూష్టంగా తయారైందని మంత్రి మండిపడ్డారు.
కోడ్ వల్ల సమీక్ష చేయలేకపోయా..
ఎన్నికల కోడ్ కారణంగా పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపోయానని, ఇప్పటినుంచి గ్రౌండ్ లెవల్‌లో పర్యటిస్తానని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. మరో మూడు, నాలుగు నెలల్లో హరిత హోటల్స్ రూపురేఖలను మారుస్తామని వివరించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. భవిష్యత్‌లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ నాయుడు, జీఎం (ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి, టూరిజం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.