ప్రతిపక్ష నేతకు అసెంబ్లీ భయమెందుకు?

ప్రతిపక్ష నేతకు అసెంబ్లీ భయమెందుకు?

ఓడించినందుకు ప్రజలను నిందించిన  మొదటి నేతగా చరిత్రకెక్కారు. ఫామ్​హౌస్​ వేదికగా 14 నెలల నుంచి (లోక్​సభ ఎన్నికల ప్రచారంలో తప్ప) మౌన రాజకీయం నడిపారు. చివరకు మొన్న పార్టీ విస్తృత సమావేశంలో .. ‘లోక్​సభ ఎన్నికల్లో ఓడిపోగానే  బీఆర్​ఎస్​ పని అయిపోయిందంటూ సొంత పార్టీ నేతలే  ప్రచారం చేశారని.. అలాంటి నెగెటివ్​ ప్రచారం వల్లనే 10 మంది ఎమ్మెల్యేలు నిరాశకు గురై పార్టీ ఫిరాయించారు’ అని  సొంత పార్టీ నేతలనే నిందించడం కొసమెరుపు.

బీఆర్​ఎస్​ అంటేనే కేసీఆర్​. దాని గెలుపుఓటములకు తానే కారణం తప్ప మరెవరో కారణం కాదని అందరికీ తెలిసిందే. ఓటములను ప్రజలపై, పార్టీ నేతలపై రుద్దే.. పరనింద ఆత్మస్తుతి పనికొచ్చేది కాదు. తన తప్పును ఒప్పుకోవడం కేసీఆర్​ రాజకీయ చరిత్రలో మనకు ఎక్కడా కనిపించదు. రాజకీయాల్లో నాయకుడికి ప్రజల పట్ల వినమ్రత ఉండాలి.  ఓడినా,  గెలిచినా  ప్రజాతీర్పును గౌరవించే లక్షణం ఉండాలి.  ప్రజలే తన పట్ల వినమ్రత చాటుకోవాలని  కోరుకోవడం ఒక వినూత్న విచిత్ర వైఖరి. ​  ‘గెలిస్తే తాను కారణం.. ఓడితే ప్రజలు కారణం’ అనే కొత్త రాజకీయ ఫిలాసఫీకీ తానే పితామహుడుగా మారిపోయాడు.

ఇలాంటి మనస్తత్వం ఉన్న నేతలు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో  ఔరంగజేబులాంటి మనస్తత్వాలకు స్థానం ఉండదు. ఇది ఆయనకు ఇప్పటికీ బోధపడని విషయం అనుకోవచ్చా? కేసీఆర్​ రాజకీయ పాండిత్యంలో తాను తప్ప ప్రజలుండరని ఆయన వైఖరే తెలుపుతోందా? 


ప్రజలను నిందించడం, సొంత పార్టీ నేతలను నిందించడం బాగానే ఉంది. కానీ ప్రజలు అప్పగించిన ప్రతిపక్షనేత పాత్రను అసెంబ్లీలోగానీ, బయటగానీ ఎందుకు పోషించడంలేదని ప్రజలు ప్రశ్నిస్తే కేసీఆర్​ దగ్గర జవాబు ఉందా?  ఏడాది కాలంగా తెలంగాణలో ప్రతిపక్ష నేత అసెంబ్లీకి హాజరుకాకపోవడమే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రతిపక్ష పాత్ర అంటే అదేదో తన వ్యక్తిగత విషయంగా కేసీఆర్​  భావిస్తుండటమే పెద్ద అభ్యంతరం. ప్రజాస్వామ్యంలో అది క్షమార్హం కాని విషయం. అధికారం మాత్రమే కావాలని, ఒక్కసారిగా ఓడిపోగానే ప్రజలపై అలగడం.. మళ్లీ గెలిచి మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెడతాననే పరోక్ష  వైఖరి దేనికి సంకేతం? ‘‘అసెంబ్లీకి  ప్రజల కోసమైతే (ప్రతిపక్షనేతగా) రానంటడు. తనకోసమైతే (సీఎంగా) వస్తానంటడు!” ఇదీ వరుస!

అది మాత్రం కారణం కాదు!

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోవడం మనకు ప్రాంతీయ పార్టీల నేతల్లోనే కనిపిస్తుంది. తమిళనాడులో జయలలిత, కరుణానిధి కూడా ఓడిపోయాక  అసెంబ్లీకి రాలేదు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య దురహంకారాలు, పగలు, సెగలు ఏరీతివో తెలియనివి కావు. ఇకపోతే, ఎన్టీఆర్​ ప్రతి
పక్షనేతగా అసెంబ్లీకి రాకుండా ఎందుకు ఉన్నారనే ప్రశ్న కూడా ఉంది. ఎన్టీఆర్​లోనూ ఓటమిని జీర్ణించుకోలేని అహంభావం మెండుగా ఉండేది. కాకపోతే  ఆయన ఆసెంబ్లీకి ప్రతిపక్షనేతగా రాకపోవడానికి అవినీతి కేసులకు భయపడి మాత్రం కాదు. అయినా తెలంగాణ రాజకీయాల్లో పగలు, సెగలు తక్కువే. కాబట్టి, కేసీఆర్​ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం  తిట్లకు భయపడి ఏ మాత్రం కాదనే అభిప్రాయం మాత్రం విస్తృతంగా ఉంది. తన  పదేండ్ల పాలనలో వచ్చిన అవినీతి ఆరోపణలకు జవాబులు చెప్పుకోవడానికి అసెంబ్లీని ఉపయోగించుకునే అవకాశం కేసీఆర్​కు లేదని ఎవరైనా చెప్పగలరా?

అసెంబ్లీకి రాకపోవడం వ్యక్తిగత విషయమా?

 బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రసిడెంట్​ ఓ టీవీ ఇంటర్వ్యూలో.. కేసీఆర్​ అసెంబ్లీకి అటెండ్​ కాకపోవడం అదేదో కేసీఆర్​ వ్యక్తిగత విషయం అన్నట్లు జవాబు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కేసీఆర్​పై అసభ్యంగా మాట్లాడుతున్న క్రమంలో అసెంబ్లీకి ఎలా వస్తాడు? రేవంత్​ చేత తిట్లు తినడానికి కేసీఆర్​ అసెంబ్లీకి రావాలా?’ అని కేటీఆర్​  మీడియాకు జవాబివ్వడం చాలాసార్లు చూశాం. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్​ అటెండ్​ కావడం, కాకపోవడం అనేది కేసీఆర్ వ్యక్తిగత విషయమైనట్లు కేటీఆర్​ జవాబివ్వడం చూస్తే..  ప్రజాతీర్పు పట్ల బీఆర్​ఎస్​ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ వస్తున్నదో చెప్పడానికి మరొక ఉదాహరణ అక్కర లేదనుకుంటా!    సీఎం రేవంత్​రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్​ను అసెంబ్లీకి రావలసిందిగా అనేకసార్లు మీడియా సాక్షిగా ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే.  అయినా అసెంబ్లీకి పోతే కేసీఆర్​పై సీఎం రేవంత్​ అసభ్యంగా మాట్లాడుతాడని కేటీఆర్​ ఎలా నిర్ధారణకు వచ్చాడో ఎవరికీ అర్థంకాని విషయమే.

తిట్ల బహానా!

ఉద్యమకాలంలో కేసీఆర్​ వాడిన భాషను అప్పట్లో ప్రజలేమీ తప్పుపట్టలేదు. కానీ వచ్చిన తెలంగాణలో అధికారం చేపట్టాక కూడా అదే అసభ్య పదజాలం వాడిన మొదటి ముఖ్యమంత్రి కూడా కేసీఆరే. ఒక కేంద్ర మంత్రిని ‘రండ మంత్రి’ అని సంబోధించిన ముఖ్యమంత్రి ఆయనే.. ఇవాళ రేవంత్​  అసభ్యంగా మాట్లాడుతాడని భయపడి అసెంబ్లీకి రావడం లేదంటే.. అది తప్పించు తిరుగువాడే ధన్యుడు సుమతీ అనే పద్యం ఎవరికైనా తప్పక గుర్తొస్తుంది కదా! 
ఒక చేత్తో చప్పుడొస్తదా?


ఒక చేత్తో ఎప్పడూ చప్పుడు రాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది. అలాగే, బీఆర్​ఎస్ ఘాటు విమర్శలపై సీఎం రేవంత్​ కూడా  ఘాటు విమర్శలు చేస్తున్న మాట నిజం. కానీ అదంతా బహిరంగ సభల్లో,  ప్రెస్​మీట్లలో రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు అసభ్యంగా మాట్లాడుకుంటున్నారే తప్ప, అసెంబ్లీ లోపల  సీఎం రేవంత్​ అలాంటి భాష ​ వాడిన దాఖలా మాత్రం లేదు. అసెంబ్లీలో కేటీఆర్​, హరీష్​రావులపై సీఎం విమర్శలు చేసి ఉండొచ్చుకానీ, వారిపై అసభ్యంగా మాట్లాడిన దాఖలా లేదే! అసెంబ్లీకి వస్తే కేసీఆర్​పై మాత్రమే అలాంటి భాష మాట్లాడుతాడని కేటీఆర్​ ఎలా తెలుసు? ఆయనేం జ్యోతిష్యుడు కాదే!

దర్యాప్తుల భయమేనా?

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి బలమైన కారణం.. ప్రభుత్వం రిలీజ్​ చేసిన శ్వేతపత్రాలకు, జరుగుతున్న దర్యాప్తులకు జవాబులు చెప్పుకోవాల్సి వస్తుందనే భయమే ఆయనను వెంటాడుతున్నదని బుద్ధిజీవుల అభిప్రాయం. తన పదేండ్ల పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణలే  కేసీఆర్​ను ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రజల్లోనూ ఉన్న అభిప్రాయం. ఎందుకంటే, కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అన్ని శాఖలపై శ్వేతపత్రాలు (వైట్​ పేపర్స్)​ రిలీజ్​ చేసింది.  ఆస్తుల కన్నా అప్పులు పెరిగాయెందుకు అనే విషయం శ్వేతపత్రాల ద్వారా బహిర్గతమైన మాట వాస్తవం. కాళేశ్వరంపై జ్యుడీషియల్​ దర్యాప్తు, పవర్​ పర్చేస్ పైన, యాదాద్రి, భద్రాద్రి పవర్​ ప్లాంట్ల నిర్మాణంపైన దర్యాప్తులు జరుగుతున్నాయి. గొర్రెలు, చేపలు వంటి సంక్షేమ పథకాల్లోనూ జరిగిన అవినీతిపై శాఖాపరమైన దర్యాప్తులు కూడా జరిగాయి. అవినీతి కేసుల కన్నా బీఆర్​ఎస్​ యజమానులను ఫోన్​ ట్యాపింగ్​  కేసు మరింత భయాందోళనలకు గురిచేసే కేసుగా మారింది. అసెంబ్లీకి వెళ్లకపోవడానికి తమపై సాగుతున్న కేసులే కారణం కాకపోతే.. అసెంబ్లీలో రేవంత్​ పాలనా లోపాలపై  నిలదీసే అవకాశం ప్రతిపక్షనేతగా కేసీఆర్​కు ఉంది కదా. ఇదే విషయం ఏడాది కాలంగా ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.

ప్రతిపక్ష పాత్ర  ఒక అదృష్టం, కేసీఆర్​కు మాత్రమే దురదృష్టమా?

ప్రజల పక్షాన పనిచేసే నాయకుడికి ప్రతిపక్ష పాత్ర ఒక అదృష్టం. ఒకప్పుడు ప్రతిపక్షానికి అధికార పక్షం భయపడేది. ప్రతిపక్షాలు అటు పార్లమెంటులో గానీ, ఇటు రాష్ట్ర అసెంబ్లీల్లోగాని సాధించిన విజయాలూ ఎన్నో ఉన్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఎప్పుడూ  అధికార పక్షంపై పైచేయి సాధించిన దాఖలాలు అనేకం ఉన్నాయి.  కానీ పోరాడి  తెలంగాణ తెచ్చాననే  కేసీఆర్​ ఇవాళ అదే తెలంగాణ కోసం ప్రతిపక్షనేతగా పనిచేయడానికి మొఖం చాటేయడమేంటనేదే ప్రజల ప్రశ్న. ప్రజల కోసం కాకుండా.. తనకోసం మాత్రమే పనిచేస్తాననే నాయకుడికి ప్రతిపక్ష పాత్ర  నిజంగా ఓ దురదృష్టమే! 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
పొలిటికల్​ ఎనలిస్ట్