
దేశవ్యాప్తంగా చేనేత రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం, అలక్ష్యం, చిన్నచూపు స్పష్టంగా కనపడుతోంది. తెలంగాణలో కూడా చేనేతపట్ల నిర్లక్ష్యం కొన్ని ఏండ్ల నుంచి కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక రకమైన వివక్ష ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక చేనేత కుటుంబాలు తమ పట్ల ప్రభుత్వ స్పందన మెరుగవుతుందని భావించాయి. ఆవిధంగా జరగకపోగా వారి పరిస్థితి ఇంకా దిగజారింది.
స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఒకనాడు శాసనసభలో చేనేత రంగం నిర్వీర్యం అయిపోయింది, ఆధునిక వాతావరణంలో దానికి స్థానం లేదు అని అర్థం వచ్చేవిధంగా మాట్లాడడంతో పాలక వైఖరి స్పష్టం అయ్యింది.
ఆ బలమైన దురభిప్రాయంతోనే చేనేత పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనపడుతోంది. ఏ పార్టీకి చెందినవారైనా, ఏ కులానికి చెందిన నాయకుడు అయినా చేనేత మీద పాలకులలో అవగాహన చాలా తక్కువ. చేనేతకున్న ప్రత్యేకతలు, ఆ రంగం విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేయరు. పాలకులు ఒక చేనేత గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాలను స్వయంగావెళ్లి పలకరిస్తే ఈ దురభిప్రాయం పోతుంది.
కానీ, ఆపాటి ప్రయత్నం కూడా కొరవడింది. ఏండ్ల కిందటి రోశయ్య కమిటీ నివేదిక ఒక్కటే రాజకీయ స్పందనగా భావించవచ్చు. ఈ కమిటీ సిఫారసులు కూడా అమలుకాలేదు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం చేనేత మీద ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు.
ఒక సగటు చేనేత కుటుంబ సభ్యులు చనిపోతే పట్టించుకోని నాయకులు, పరామర్శించని అధికారులు ప్రభుత్వం జౌళి శాఖ సమావేశం ఏర్పాటు చేయగానే గుంపులుగా వాలిపోతారు. బాధిత చేనేత కుటుంబం తమ బాధలు చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. తమ అవగాహన లేమిని అభిప్రాయంగా మార్చి గందరగోళం సృష్టిస్తారు.
ప్రాథమిక రంగమైన చేనేత రంగం మీద సమాచారం లేకపోవడం, పవర్ లూమ్ రంగంతో ముడిపెట్టడం, సంఘాల దుస్థితి వంటి అంశాలకిచ్చే ప్రాధాన్యత వల్ల అసలు విషయాలు అనేకం మరుగునపడుతున్నాయి. వార్షిక సంప్రదింపుల సమావేశాలకు కూడా తిలోదకాలు ఇచ్చారు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో మొదలు అయిన అంతర్జాతీయ వాణిజ్య మార్పులు చేనేతను బలంగా తాకాయి. జౌళి వాణిజ్యంలో పోటీ పేరిట దేశీయ రంగంలో తీవ్ర మార్పులకు నాంది ఏర్పడిన నాటి నుంచి చేనేత రంగం మీద ఒత్తిడి పెరిగింది.
3 దశాబ్దాలలో చేనేతను కాపాడుకునే ప్రయత్నం ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా నెత్తికి ఎత్తుకోలేదు. అక్కడక్కడా కొంత స్పందన తప్పితే. చేనేత పట్ల దురభిప్రాయం, దాని పోటీ రంగాలు అయిన పవర్ లూమ్, మిల్లు రంగాల పట్ల ఉన్న ప్రేమవల్ల క్రమంగా చేనేత రంగాన్ని కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు.
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ
2015లో జరిగిన మొదటి జాతీయ చేనేత దినోత్సవం నాడు ప్రధాని మోదీ పేదరికాన్ని ఎదుర్కోవడంలో చేనేత ప్రాముఖ్యతను గుర్తు చేశారు. చేనేత ఉత్పత్తులను బాగా మార్కెట్ చేయవలసిన అవసరాన్ని ఎత్తిచూపారు. చెప్పడం వరకు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం సానుకూల చర్యలు శూన్యం. అఖిల భారత చేనేత బోర్డును రద్దు చేసింది.
చేనేత ఉత్పత్తుల మీద వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించింది. 1997-–98లో చేనేతకు బడ్జెట్ నిధులు రూ.200 కోట్లు ఇస్తే, 29 ఏండ్ల తరువాత 2025-–26 బడ్జెట్లో చేనేతకు ఇచ్చిన నిధులు రూ.200 కోట్లు. ఈ రకమైన నిధుల స్తంభన మీద ప్రశ్నించేవారు కరువు అయ్యారు. చేనేతకు హాని తలపెడితే గ్రామీణ ఉపాధి పోతున్నది అనే కనీస జ్ఞానం కొరవడిన కాలంలో మీడియాలో విశ్లేషణ వార్తలు స్పృహను పెంచుతాయి. లక్షలాది కుటుంబాలు ఆధారపడిన చేనేత రంగాన్ని విస్మరించడం ఆధునిక పాలక వర్గాలకు తగదు.
భారతీయ వస్త్రాలలో చేనేతకు ప్రత్యేక స్థానం
ప్రత్యేక తెలంగాణలో గత ప్రభుత్వం తమ ఇమేజ్ పెంచుకోవడానికి చేనేతను ఉపయోగించుకున్నదే తప్పితే ఆ రంగానికి చేసింది ఏమీ లేదు. చేనేత డిజైన్ శాలువాలు కప్పడం వంటి ఉత్సవ చర్యలు చేనేత కుటుంబాలను ఆదుకున్నట్లుగా భావించలేం. విదేశీయులు ఇష్టపడే భారతీయ వస్త్రాలలో చేనేతకు ప్రత్యేకత ఉన్నది. సంప్రదాయ దుస్తులు, మహిళలు ఇష్టపడే చీరలు కూడా చేనేత రంగానివే. అయితే, నకిలీల బెడద పెరిగింది. అసలు నిఖార్సైన చేనేత మార్కెట్లు, వస్త్రాలు, కష్టపడి నేసే చేనేత కుటుంబాలు వెనుకబడుతున్నాయి.
చేనేత మార్కెట్లు దెబ్బతినడానికి, చేనేత వస్త్రాలు ఖరీదు కావడానికి ప్రభుత్వ విధానాలే కారణం. పవర్ లూమ్, మిల్లు కంపెనీల లాబీ గణనీయ పాత్ర పోషిస్తోంది. మార్కెట్లో చేనేత వస్త్రాలకు ఉన్న ‘ఆకర్షణ’ తిరుగులేనిది. చేనేత డిజైన్లు కాపీకొట్టి మార్కెట్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఆసాములు దీనిని గుర్తించారు. ప్రభుత్వం మాత్రం గుర్తించలేదు.
సగటు చేనేత కార్మికుడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, రాష్ట్ర సచివాలయం చేరుకుని తమ బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు. చేనేత రంగం కుదేలవడంతో నేత కార్మికులుజీవనోపాధి కోల్పోయారు. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. వారిలో ఎక్కువ మంది పేదరికంలోకి జారిపోయారు. చేనేత చీరలు ధరిస్తూ, చేనేత ఉత్పత్తులపై కొంత అవగాహన ఉన్న మహిళా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 8 సంవత్సరాల నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పిస్తున్నా కేంద్ర చేనేత కేటాయింపులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
చేనేత బడ్జెట్‌ను పెంచాలి
గత 44 సంవత్సరాలుగా ప్రతి ఏటా చేనేతకు నిధులు కేవలం రూ.200 కోట్లకు పరిమితం చేశారు. 2025-–26 లో కూడా చేనేతకు ఒక్క పథకానికి రూ.200 కోట్లు ఇచ్చారు. మొత్తం బడ్జెట్లో ఇది 0.004 శాతం. 2013-–14లో జాతీయ బడ్జెట్‌లో చేనేత బడ్జెట్ కేవలం 0.003 శాతం మాత్రమే, 2010-–11లో 0.03 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కేటాయింపులు ఇంకా దారుణం. ప్రత్యేక తెలంగాణ తొలి బడ్జెట్లో జౌళి రంగంతో కలిపి చేనేత రంగానికి ఇచ్చిన నిధులు రూ.142 కోట్లు, తరువాత రెండు సంవత్సరాలలో పెంచారు. 2015-–16 నాటికి తగ్గింది.
2016-–17 నుంచి చేనేత రంగానికి పథకాలకు ఇచ్చింది సున్నా. 2025–-26లో కూడా ఇచ్చింది సున్నా. జౌళి రంగానికి మాత్రం చీరల పథకంతో సహ నిధులు ఇస్తూనే ఉన్నారు. విదేశీ అతిథులకు చేనేత శాలువాలు కప్పి తమ ఇమేజిని పెంచుకున్నారు తప్పితే బతుకమ్మ చీరల పథకం వల్లగాని, శాలువాల సన్మానం వల్లగాని చేనేతకు ఒరిగింది ఏమీ లేదు. ప్రభుత్వంలో అధికార పార్టీ మారినా చేనేతకు కేటాయింపులు మారలేదు.
మార్చిలో దాదాపు 18 రోజులు జరిగిన శాసనసభ సమావేశాలలో సగటు చేనేత కుటుంబం పరిస్థితి గురించి ఎవరూ ప్రస్తావించలేదు. ఉపాధి పెంచాలన్నా, గ్రామీణ కొనుగోలు శక్తి పెరగాలన్నా, గ్రామీణ వినియోగం పెంచాలన్నా వ్యవసాయంతో పాటు చేనేత బడ్జెట్‌ను పెంచడం
ఒక శ్రేయస్కర మార్గం.
చేనేత రంగం వాటా 15 శాతం
వస్త్ర ఉత్పత్తిలో చేనేత రంగం వాటా 15 శాతం. చేనేత రంగంలో అధికారిక లెక్కల ప్రకారం నిత్య వస్త్ర ఉత్పత్తిలో 28.2 లక్షల మగ్గాలు, 31.44 లక్షల కుటుంబాలు, 35.22 లక్షల మంది కార్మికులు (26.74 లక్షల మంది చేనేత కార్మికులు, 8.4 లక్షల మంది అనుబంధ కార్మికులు) ఉన్నారు. ఈ లెక్కల సేకరణ కూడా ఒక ప్రైవేటు సంస్థకు ఇవ్వడంతో వారు తమ లాభాలను మిగుల్చుకునే ప్రయత్నంలో అనేక గ్రామాలకు పోనే లేదు. చేనేత రంగంలో నేరుగా ఉపాధి మాత్రమే కాక చేనేత వస్త్రాలకు అవసరమైన సహజ నూలు ఇచ్చే అనుబంధ రంగాలలో కూడా ఉపాధి ఉంటుంది.
పత్తి రైతులు దాదాపు కోటిమంది ఉంటారు. అలాగే, సిల్కు, ఉన్ని తదితర నూలు అందించే రంగాల ఉపాధి కూడా చేనేత రంగం మీద ఆధారపడి ఉన్నది. ప్రమాదకర ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించాలంటే కూడా చేనేతరంగమే ఉత్తమమైన పరిష్కారం. ఇవన్నీ పరిగణనలోనికి తీసుకోకుండా, అవగాహన పెంచుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రాజకీయ నాయకులు, అధికారులు, ఆర్థికవేత్తలు దేశానికి, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్