రోడ్ల రిపేర్లకు ఎందుకంత లేట్?

రోడ్ల రిపేర్లకు ఎందుకంత లేట్?
  • ప్రజలు ఇబ్బందులు పడ్తుంటే టైమ్ వేస్ట్ చేస్తున్నరు: మంత్రి వెంకట్ రెడ్డి
  • జులై కల్లా టిమ్స్ హాస్పిటల్స్ పనులు పూర్తి చేయాలి
  • ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే మా ప్రభుత్వంలో నడ్వదు
  • ఆర్ అండ్ బీ అధికారుల పనితీరుపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను రిపేరు చేయడంలో ఎందుకు లేట్ అవుతున్నదని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లు అంటూ కాలం వెల్లదీస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సెక్రటేరియెట్​లో ఆర్ అండ్ బీ శాఖపై వెంకట్​రెడ్డి బుధవారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్ లో కొంత మంది అధికారుల పనితీరు సరిగా లేదు. పక్క రాష్ట్రాల్లో అధునాత పద్ధతులతో రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపడ్తున్నరు. మనోళ్లు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నరు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తే రూ.45 వేల కోట్లు విలువ చేసే రోడ్లను రిపేర్ చేయొచ్చు. ఇంజినీర్లంతా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రోడ్లను ప్రపోజల్స్ తయారు చేసే కన్సల్టెంట్లుగా మారిన్రు’’అని వెంకట్​రెడ్డి మండిపడ్డారు. 

పీపీపీ మోడల్​ను అమలు చేయాలి

కేబినెట్ లో చర్చించిన పీపీపీ మోడల్ రోడ్లపై ఐడెంటిఫికేషన్ గురించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ను మంత్రి అడిగారు. ఇప్పటి దాకా 1,787.06 కిలో మీటర్లు కలిగిన 20 రోడ్లను గుర్తించామని చెప్పారు. ‘‘రోడ్డు నిర్మాణాల భారం ప్రజల మీద పడకుండా పీపీపీ మోడల్​ను అమలు చేయాలి. నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంలో అలసత్వం వద్దు. వేగంగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. జులై నాటికి వర్క్స్ కంప్లీట్ చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్స్​లో డబ్బులు కట్టలేక ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడి నిధులు రిలీజ్ చేస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నరు?’’అని మంత్రి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. రివ్యూ మీటింగ్​లో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెక్రటరీ దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి, సీఈలు మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూడేండ్లలో వరంగల్ ఎయిర్​పోర్ట్ పూర్తి

మూడేండ్లలో మామునూరు ఎయిర్ పోర్ట్ పూర్తి చేయాలని అధికారులను మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ స్పీడప్ చేయాలన్నారు. ఎయిర్​పోర్టు పనులపై ఏవియేషన్ డైరెక్టర్ భరత్​రెడ్డితో పాటు డిపార్ట్​మెంట్ అధికారులతో సెక్రటేరియెట్​లో బుధవారం మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ చేపట్టారు. ‘‘భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్​పోర్టు నిర్మాణ పనులు చేపట్టాలి. ప్రతీ 15 రోజులకోసారి ఎయిర్​పోర్టు పనుల పురోగతిపై రివ్యూ చేస్త. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి హామీలతో టైమ్​పాస్ చేయ. ఎయిర్​పోర్టు కట్టి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టి పెట్టాలి’’అని వెంకట్​రెడ్డి ఆదేశించారు.

అట్లుంటది మనోళ్లతోటి

సెక్రటేరియెట్​లోని తన చైర్ కింద ఉన్న టైల్స్ ఫిటింగ్ ను మంత్రి స్వయంగా అధికారులకు చూపించారు. ‘‘వెయ్యి కోట్లకు పైగా నిధులతో సెక్రటేరియెట్ కట్టిన్రు. నా చైర్ కింద ఉన్న టైల్స్ ఫిటింగ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉందో సూడున్రి. మన ఇంజినీర్ల పనితీరు అట్లుంటది. మనం ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజలు సొమ్ము. దాన్ని మరిచిపోయి.. ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే నడ్వదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లనే చేసిన్రు.. మా ప్రభుత్వంలో కుదరదు’’అని మంత్రి వెంకట్​రెడ్డి హెచ్చరించారు.